How To Know If Someone Has Blocked You On WhatsApp : ఇద్దరు వ్యక్తుల మధ్య, ప్రేయసీ, ప్రేమికుల మధ్య, ప్రాణ స్నేహితుల మధ్య ఏదో ఒక సందర్భంలో చిన్నపాటి విభేదాలు రావడం సహజం. ఆలాంటి సమయంలో ఎదుటివారితో తమకున్న స్నేహాన్ని, బంధాన్ని తగ్గించుకోవడానికి మాట్లాడడం తగ్గిస్తారు లేదా మానేస్తారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో విహరిస్తున్నందున, ముందుగా వాట్సాప్‌లో తమకు నచ్చని వ్యక్తులను బ్లాక్ చేస్తున్నారు. ఆ విషయం అవతలి వ్యక్తికి తెలిసే ఛాన్స్ తక్కువ. అందుకే వాట్సాప్‌లో మనల్ని బ్లాక్ చేసిన వ్యక్తుల గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- ప్రొఫైల్ పిక్చర్ చూడాలి
మనల్ని ఎవరైనా బ్లాక్ లిస్టులో పెట్టిందీ, లేనిదీ తెలుసుకోవాలంటే, ముందుగా వారి ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. సాధారణంగా మన కాంటాక్టు లిస్టులో ఉన్నవారి ప్రొఫైల్ పిక్చర్లు అన్నీ మనకు కనిపిస్తుంటాయి. కానీ, మనల్ని బ్లాక్ లిస్టులో పెట్టిన వారి ప్రొఫైల్ చిత్రం మాత్రం కనిపించదు. అందువల్ల అవతలివారి ప్రొఫైల్ పిక్చర్ మీకు కనిపించకపోతే, వారు మిమ్నల్ని బ్లాక్ చేశారని అనుకోవచ్చు. అయితే కేవలం ఇది చూసి మాత్రమే ఒక నిర్ణయానికి రాకూడదు. మనల్ని నిజంగా బ్లాక్ చేశారా? లేదా? అని నిర్ధరించుకోవడానికి ఇంకొన్ని అంశాలను పరిశీలించాలి. - లాస్ట్ సీన్‌ను పరిశీలించాలి
ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో, వారి చాట్ ఓపెన్ చేసి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్‌లను చెక్ చేయాలి. వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే, మిమ్మల్ని బ్లాక్ చేయకపోయినా అది కనిపించదు. ఒక వేళ వాళ్లు ఆన్‌లైన్‌లో ఉన్నా, లాస్ట్ సీన్ కనిపించకపోతే, వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లుగానే భావించవచ్చు. - మెసేజ్ పంపించాలి
వాట్సాప్ ద్వారా పంపిన సందేశాలు అవతలివారికి చేరాయో, లేదో నిర్ధరించుకునేందుకు ఎన్ని టిక్కులు వచ్చాయో గమనిస్తుంటాం. మనం పంపిన మెసేజ్‌కు ఒక టిక్ మాత్రమే ఉంటే, ఆ సందేశం అవతలవారికి చేరలేదని అర్ధం. రెండు టిక్కులు ఉంటే మెసేజ్ వెళ్లిందని అర్థం. ఇక రెండు టిక్కులు బ్లూ కలర్లోకి మారితే, ఆ సందేశాన్ని అవతలి వ్యక్తి చదివారనో, చూశారనో అర్థం. మనల్ని బ్లాక్ లిస్టులో పెట్టిన కాంటాక్టుకు ఏ మెజేస్ వెళ్లదు. ఎప్పుడూ సింగిల్ టిక్కే కనిపిస్తుంది. అయితే ఒక్కోసారి అవతలి వ్యక్తి కవరేజ్ ఏరియాలో లేకపోయినా, డేటా లేకపోయినా మన సందేశాలను చూడలేరు. అందుకే ఈ విధానంలో మనం బ్లాక్ అయ్యామా? లేదా? అనేది నిర్ధరించుకోడానికి మరింత పరిశీలన అవసరం. - వాట్సాప్ కాల్ చేయాలి
మనల్ని బ్లాక్ చేసిన వారికి వాట్సాప్ ద్వారా కాల్ చేయలేము. ఎందుకంటే మనల్ని బ్లాక్ చేసినవారికి, మనం కాల్ చేసినా కాలింగ్ అని కనిపిస్తుంది తప్ప, రింగింగ్ అని మాత్రం రాదు. అయితే ఒక్కోసారి నెట్వర్క్ ఏరియాలో లేకపోయినా, డేటా అందుబాటులో లేకపోయినా కాల్ కనెక్ట్ కాదు. కనుక కొంత సమయం ఆగి, తరువాత మరలా కాల్ చేయాలి. ఎప్పటికీ కాల్ కనెక్ట్ కాకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లుగా గుర్తించాలి. - గ్రూప్‌లో యాడ్ చేయడానికి ప్రయత్నించాలి
వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా కాంటాక్టును యాడ్ చేయలేకపోతున్నారంటే, అవతలివారు మిమ్మల్ని బ్లాక్ చేశారని కచ్చితంగా నిర్ధరించుకోవచ్చు. అయితే మీరిద్దరూ ఉన్న గ్రూపులో, మీరు ఏదైనా మెసేజ్ పెడితే, అవతలి వ్యక్తి దానిని చూసే అవకాశం ఉంటుంది.
ఈ ఐదు మార్గాలు ద్వారా మీరు బ్లాక్ అయ్యారా? లేదా? అని తెలుసుకోవచ్చు. అయితే మీ స్నేహితులు, ప్రేయసి/ ప్రేమికుడు మిమ్మల్ని బ్లాక్ చేస్తే, మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. వారు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసేంతవరకు వేచిచూడటం తప్ప!