తెలంగాణ

telangana

అదిరే ఫీచర్లతో హోండా బైక్​.. ధర రూ.74వేలే.. స్ప్లెండర్​కు గట్టి పోటీ!

By

Published : Mar 1, 2023, 1:52 PM IST

హోండా బైక్​లకు, కార్లకు భారత్​లో మంచి డిమాండ్​ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ అందరికీ అందుబాటు ధరలో ఉండే మరో బైక్​ను మార్కెట్​లోకి తీసుకురానుంది. 100 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైక్​ను భారత్​లో మార్చి 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంజిన్​ కెపాసిటీ పరంగా ఈ బైక్​ మంచి పనితీరు కనబరుస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైక్​ మోడల్ గతంలో విడుదలైన హోండా షైన్​ను పోలి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే దీంతో పాటుగా మరో బైక్, మరో కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి!

honda new launch bikes and cars
honda new launch bikes and cars

జపాన్​కు చెందిన ప్రముఖ వాహన తయారీదారు కంపెనీ అయిన హోండా.. 100సీసీతో సరికొత్త బైక్​ను మార్కెట్​లోకి విడుదల చేయనుంది. మార్చి 15న ముంబయి వేదికగా దీన్ని భారత్ మార్కెట్​లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందని తెలిపింది. ఇదే కాకుండా మరికొన్ని రోజుల్లో సీబీ350 కేఫ్​ రేసర్ బైక్​ను కూడా తీసుకురానుంది. దీంతో పాటుగా హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​ అనే కారును తీసుకురానున్నట్లు ప్రకటించింది. కొత్తగా మార్కెట్​లోకి వస్తున్న వీటి ప్రత్యేకతలేంటో చూద్దామా!

హీరో స్ల్పెండర్​ బైక్​కు పోటీ..
హోండా 100 సీసీతో మార్కెట్​లోకి తీసుకురానున్న ఈ బైక్.. దిగ్గజ టూవీలర్​ హీరో కంపెనీకి చెందిన స్ల్పెండర్​ బైక్​కు పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. తాజాగా హోండా తాను మార్కెట్​లోకి తీసుకువస్తున్న కొత్త బైక్​కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. అయితే ఈ టీజర్​లో మాత్రం బైక్​ మోడల్​, దాని ఫీచర్లను బయటపెట్టకుండా ఉంచింది. ఇది దాదాపుగా హోండా షైన్​ మోడల్​ను పోలి ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హోండా కంపెనీ 110 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో కూడా బైక్స్‌ను అందుబాటులో ఉంచింది. సీడీ 110 డ్రీమ్, లివో వంటి మోడళ్లు ఆ విభాగంలోనివే. వీటి తర్వాత హోండా 125 సీసీ ఇంజిన్‌తో హోండా షైన్ బైక్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మోడల్ భారత్​లో మంచి మార్కెట్​ను సంపాదించి.. బజాజ్​, హీరో కంపెనీలకు పోటీగా నిలుస్తోంది.

ధర ఎంతంటే..
హోండా కంపెనీ కొత్తగా మార్కెట్​లో తీసుకువస్తున్న 100 సీసీ బైక్​ ఎక్స్ షోరూం ధర దాదాపుగా రూ.74,000 ఉండొచ్చని వ్యాపార​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్​లో మాత్రం ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఏ ఎంట్రీ లెవెల్(తక్కువ రేటు) బైక్​లో లేని విధంగా డిజిటల్ టెక్నాలజీ ఉండనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మార్చి 15 వరకు వేచిచూడాల్సిందే మరి.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారు ఫీచర్లు
గతకొన్నేళ్లుగా హోండా సిటీ కార్లు భారత్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హోండా సిటీ అప్​గ్రేడ్​ వెర్షన్​.. ఫేస్​లిఫ్ట్​ను ఆ సంస్థ మరికొన్ని రోజుల్లో భారత మార్కెట్​కు తీసుకురానుంది. అయితే ఈ మోడల్​ పెట్రోల్ వెర్షన్​ను మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీన్ని బీఎస్​6 నింబంధనలకు లోబడి రూపొందించింది. దీనిలో ​1.5L అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఇంజిన్​ కూడా ఉంది. ఇది 124 bhp పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 9 వరుసల ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అధిక భద్రతా ప్రమాణాలు, ఆటోమేటిక్​ క్లైమెట్​ కంట్రోల్​ సిస్టమ్​, ఎయిర్​బ్యాగ్​ సిస్టమ్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉండే హోండా సిటీ కార్లకంటే కాస్త ఎక్కువగానే దీని ధర ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ​

హోండా సీబీ350 బేస్డ్ కేఫ్ రేసర్ బైక్​
హోండా కంపెనీకి చెందిన హైనెస్ సీబీ350, సీబీ 350 ఆర్​ఎస్​లు కంపెనీ డీలర్ల వద్ద ఉన్నాయి. అయితే దీనికి మరిన్ని హంగులు జోడించి సీబీ 350 కేఫ్​ రేసర్​ను మార్కెట్​లోకి తీసుకురానుంది. దీనిలో సింగిల్​ పీస్​ సీటు మాత్రమే ఉంటుంది. కాని చూడడానికి మాత్రం హైనెస్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కేఫ్​ రేసర్ బైక్​ను ఎక్కువ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details