మైక్రోసాఫ్ట్ సంస్థ ఐదేళ్ల తర్వాత విండోస్ ప్లాట్‌ఫామ్(Windows-11)లో తొలి భారీ మార్పును ఆవిష్కరించింది. టెక్నాలజీ పరిశ్రమ కోసం కొన్ని గణనీయమైన మార్పులకూ నాంది పలికింది. విండోస్ 10ను విడుదల చేస్తున్న సమయంలోనే 'ఇది విండోస్ చివరి వర్షన్' అని కంపెనీ గొప్పగా ప్రకటించింది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అంటేనే భారీ మార్పులకు సంకేతం. భవిష్యత్ యాప్స్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నరనటానికిదో సూచన. కాబట్టే డెవలపర్లు, వినియోగదారుల్లో ఇది సరికొత్త ఆసక్తిని రేకెత్తించింది. అనుకున్నట్టుగానే మునుపెన్నడూ లేని ఫీచర్లను ముందుకు తెచ్చింది.
ఆండ్రాయిడ్ యాప్ సపోర్టు
అతి పెద్ద కొత్త మార్పు ఇదే. ఇప్పుడిక విండోస్‌లోనూ ఆండ్రాయిడ్ యాప్‌లను వాడుకోవచ్చు. ఇందుకోసం అమెజాన్, ఇంటెల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్ పరికరాలకు అమెజాన్ యాప్‌స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను అందిస్తుంది. వివిధ ప్రాసెసర్లతో తయారయ్యే విండోస్ ల్యాప్‌టాప్‌ల్లో యాప్‌లు పనిచేయటానికి అనువైన పరిజ్ఞానాన్ని ఇంటెల్ బ్రిడ్జ్ కల్పిస్తుంది. ఇలా విండోస్‌తో ఆండ్రాయిడ్ యాప్‌ల కలయికతో పీసీలు మరింత వైవిధ్య భరితం కానున్నాయి. అంటే జొమాటో, ఓలా, ఉబర్ వంటి యాప్‌లను సైతం కొత్త విండోస్ వేదికలో వినియోగించుకోవటానికి వీలుంటుందన్నమాట.
టీమ్స్ జోడింపు
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వీడియో సమావేశాలకు ఆదరణ గణనీయంగా పెరిగింది. మున్ముందూ ఈ ధోరణి కొనసాగేదే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్11కు టీమ్స్‌నూ జతచేసింది. అంటే టీమ్స్ ఇకపై నేరుగా కొత్త ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమవుతుందన్నమాట. స్టార్ట్ మెనూలోనే ఇది దర్శనమిస్తుంది. వీడియో సమావేశాలు, మాటామంతీ పరంగా ఇది పెద్ద అడుగే. దీంతో తేలికగా, త్వరగా టీమ్ సమావేశాల్లో పాల్గొనటానికి వీలవుతుంది. టాస్క్‌బార్ నుంచే మ్యూట్, అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. పర్సనల్ కాంటాక్ట్‌లతో ఎక్కడైనా టెక్స్ట్, ఛాట్, వాయిస్, వీడియోల ద్వారా కనెక్ట్ కావొచ్చు. అవతలివాళ్లు టీమ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోయినా ఎస్‌ఎంఎస్ ద్వారా అనుసంధానమయ్యే వీలుండటం విశేషం.
భవిష్యత్ పీసీలకు మార్గనిర్దేశం
డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తిరుగులేని ఆధిపత్యం గల విండోస్ కొత్త వర్షన్ భవిష్యత్ పీసీలకూ మార్గనిర్దేశం చేయనుంది. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవటానికి పీసీకి కనీస అవసరాలు తప్పనిసరి. 'సపోర్టు చేసే పీసీ'ల్లో విండోస్11 ఉచితంగా అప్‌డేట్ అవుతుంది గానీ పీసీకి కనీసం 64-బిట్ సీపీయూ, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉండాలి. పైగా టీపీఎం సెక్యూరిటీ చిప్‌తో కూడినదై ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని భద్రంగా ఉంచటం కోసం దీన్ని తప్పనిసరి చేశారు. దీంతో విండోస్11 సపోర్టుతో కూడిన చవకైన ల్యాప్‌టాప్‌లు సైతం చాలా వేగంగా, సురక్షితంగా పనిచేస్తాయి.
థర్డ్‌పార్టీ చెల్లింపులకు సై
డెవలపర్లు థర్డ్‌పార్టీ చెల్లింపు వ్యవస్థలను వాడుకోవటానికి కొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్స్ అనుమతిస్తుంది. తమ యాప్‌లు, సేవల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా డెవలపర్లే ఉంచుకోవచ్చు.