Chandrayaan 3 Pragyan Rover Travel Distance :చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం ప్రయాణించిందని ఇస్రో శుక్రవారం వెల్లడించింది. దాని పేలోడ్లు ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్- APXS, లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్- LIBS ఆన్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్లు సవ్యంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది.
Rover Payloads Of Chandrayaan 3 : చంద్రుడి ఉపరితలంపై కెమికల్ కంపోజిషన్, మినరలాజికల్ కంపోజిషన్‌ను అంచనా వేయడానికి APXS పేలోడ్‌లో ఉపయోగపడుతుంది. ఇక, చంద్రుడి నేల, ల్యాండింగ్ ప్రాతంలో రాళ్లలో ఉండే వివిధ మూలకాలను LIBS పేలోడ్ గుర్తిస్తుంది.
Chandrayaan 3 Pragyan Rover Landing Video : అంతకుముందు విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో శుక్రవారం (ఆగస్టు 25న) విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజ్ కెమెరా.. రోవర్ జాబిల్లిపై దిగుతున్న దృశ్యాలను బంధించింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. అనతంరం తన వెనుక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్ర వేసింది.