తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

బ్లూటూత్‌ సురక్షితమేనా?.. కాదా? - బ్లూటూత్‌ వల్ల నష్టాలు

ప్రస్తుతం చాలామంది బ్లూటూత్‌ పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు(bluetooth uses), ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటివన్నీ దీంతో కూడుకున్నవే. హెడ్‌సెట్‌, స్మార్ట్‌వాచ్‌ పరికరాలు బ్లూటూత్‌తో అనుసంధానమై పనిచేసేవే. వీటితో పాటలు వినటం, ఆరోగ్య వివరాలను ఓ కంట కనిపెట్టటం లాంటి పనులన్నీ సులభంగా కానిచ్చేస్తుంటాం. కానీ రేడియేషన్‌ గురించిన భయాలు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో బ్లూటూత్‌ పరికరాలు సురక్షితమేనా? అన్న సందేహం తొలుస్తూనే ఉంటుంది. ఇంతకీ బ్లూటూత్‌ అంటే ఏంటి?

Bluetooth
బ్లూటూత్‌

By

Published : Sep 8, 2021, 10:34 AM IST

వైర్‌లెస్‌ పరికరాల వాడకం తేలిక. తీగలతో అవసరం లేకుండా ఎంచక్కా వాడుకోవచ్చు. ఇవి వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌.. ఇలా మూడు రకాలుగా ఒకదాంతో మరోటి అనుసంధానం అవుతాయి. వీటిల్లో మొదట్నుంచీ ప్రాచుర్యం పొందింది బ్లూటూత్(Bluetooth technology uses). దీంతో అనుసంధానమయ్యే పరికరాల్లోని చిప్‌లు బ్లూటూత్‌ మాడ్యూల్‌తో (Bluetooth technology) కూడుకొని ఉంటాయి. ఇలాంటి మాడ్యూల్‌తో కూడిన మరో పరికరంలోని చిప్‌తో అనుసంధానమై సమాచార మార్పిడికి తోడ్పడతాయి. ఎరిక్‌సన్‌ కంపెనీ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ జాప్‌ హార్ట్‌సెన్‌ (who invented bluetooth technology) 1994లో బ్లూటూత్‌ను ఆవిష్కరించారు. అనంతరం కొందరు ఇంజినీర్లు కలిసి మెరుగుపరిచారు. ఇంటెల్‌ ఉద్యోగి ఒకరు దీనికి బ్లూటూత్‌ అని పేరుపెట్టారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలతో కూడిన బ్లూటూత్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (ఎస్‌ఐజీ) దీని ప్రమాణాలు, అభివృద్ధి, లైసెన్స్‌ వంటి వాటిని పర్యవేక్షిస్తోంది.

ఎలా పనిచేస్తుంది?

బ్లూటూత్‌ (bluetooth working) 2.4 జీహెచ్‌జెడ్‌ రేడియో తరంగాల మీద పనిచేస్తుంది. ఇది ఫ్రీక్వెన్సీ హాంపింగ్‌ అనే అధునాతన పద్ధతిని వినియోగించుకుంటుంది. తేలికగా చెప్పాలంటే- 79 బ్యాండ్‌ రేడియో తరంగాలతో పనిచేస్తుందన్నమాట. బ్లూటూత్‌ పంపే సమాచారం ముందుగా చిన్న 'ప్యాకెట్లు'గా విడిపోతుంది. తర్వాత ఈ ప్యాకెట్లు ఒక బ్యాండు మీద నుంచి మరో బ్యాండ్‌ మీదికి దూకుతూ సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ ప్రక్రియ చాలావరకు చిన్న సమాచారం పంపిణీకే ఉపయోగపడుతుంది. దీనికి అంత వేగం అవసరం ఉండదు. బ్లూటూత్‌ 5 అయితే 2 ఎంబీపీఎస్‌ వేగంతో 40 మీటర్ల దూరంలో ఉన్న పరికరాలకూ సమాచారాన్ని చేరవేయగలదు. చాలామంది సెల్యులార్‌ డేటాను బ్లూటూత్‌ వాడుకుంటుందని భావిస్తుంటారు. బ్లూటూత్‌తో అనుసంధానమయ్యే పరికరాలు వాటి మధ్య పర్సనల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (పీఏఎన్‌) ఏర్పరచుకొని ఫైళ్లను చేరవేస్తుంటాయి. దీనికి ఇంటర్నెట్‌ అవసరం లేదు.

పరిమితి ఎంత?

మన శరీరం ఎంతవరకు రేడియోఫ్రీక్వెన్సీ శక్తిని గ్రహించుకోగలదనే దాన్ని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ) నిర్వచించింది. దీన్నే స్పెసిఫిక్‌ అబ్జార్బ్‌డ్‌ రేట్‌ (ఎస్‌ఏఆర్‌) అంటారు. దీన్ని వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌ (డబ్ల్యూ/కేజీ) లేదా మిల్లీవాట్స్‌ పర్‌ స్క్వెయర్‌ సెంటీమీటర్‌ (ఎండబ్ల్యూ/సీఎం2) ప్రకారం లెక్కిస్తారు. మన దేశంలో ఫోన్లకు ఎస్‌ఏఆర్‌ పరిమితిని గరిష్ఠంగా 1.6 డబ్ల్యూ/కేజీగా నిర్ణయించారు. బ్లూటూత్‌ ద్వారా అనుసంధానమయ్యే యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ఎస్‌ఏఆర్‌ విలువ 0.466 డబ్ల్యూ/కేజీ. నిజానికి మొబైల్‌ ఫోన్ల కన్నా ఎయిర్‌పాడ్స్‌ ద్వారా కాల్స్‌ మాట్లాడటమే సురక్షితం. చాలా పరికరాల్లోని సెట్టింగ్స్​ల్లో ఎస్‌ఏఆర్‌ విలువ ఎంతనేది కనిపిస్తుంది. ఐఫోన్లు, ఐప్యాడ్స్‌లోనైతే సెట్టింగ్స్​లో జనరల్‌లోకి వెళ్లాలి. అక్కడ్నుంచి లీగల్‌ అండ్‌ రెగ్యులేటరీ ద్వారా ఆర్‌ఎఫ్‌ ఎక్స్‌పోజర్‌లోకి వెళ్లి ఎస్‌ఏఆర్‌ విలువ తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనైతే *#07# కి డయల్‌ చేసి తెలుసుకోవచ్చు.

రేడియేషన్‌ భయం

బ్లూటూత్‌ వాడకం ప్రమాదకరమని చాలామంది భావిస్తుంటారు. ఇది విద్యుదయస్కాంత (ఎలక్ట్రోమాగ్నెటిక్‌) రేడియేషన్‌ను (ఈఎంఆర్‌) వినియోగించుకుంటుంది. ఈఎంఆర్‌ అనేది ఒకరకమైన శక్తి. ఇది మన చుట్టుపక్కలంతా విస్తరించి ఉంటుంది. కృత్రిమ, సహజ వస్తువుల నుంచి వివిధ స్థాయిల్లో ఎంతో కొంత విడుదల అవుతూనే ఉంటుంది. ఇందులో అయోనైజింగ్‌, నాన్‌-అయోనైజింగ్‌ అని రెండు రకాలున్నాయి. అయోనైజింగ్‌ ఈఎంఆర్‌ కణాలు, డీఎన్‌ఏను దెబ్బతీసే అవకాశముంది. సూర్యరశ్మి, ఎక్స్‌రే యంత్రాలు, రేడియోధార్మిక వ్యర్థాల వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది. అదే స్వల్ప పౌనఃపున్యంతో కూడిన నాన్‌-అయోనైజింగ్‌ ఈఎంఆర్‌ సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని చేయదు. బ్లూటూత్‌ పరికరాలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, వైఫై నెట్‌వర్క్‌లు, మైక్రోవేవ్‌లు, ఎంఆర్‌ఐ యంత్రాల నుంచి వెలువడేదీ ఇలాంటి రేడియేషనే. నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం- తక్కువ శక్తితో కూడిన నాన్‌-అయోనైజింగ్‌ ఈఎంఆర్‌ మనకు హాని చేయదు. ఇది శరీరానికి చేసే అనర్థం ఒక్కటే. అది వేడి చేయటం. అదీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. రసాయన బంధాలు, ఎలక్ట్రాన్లను విడదీసేంత శక్తి దీనికి లేదు.

భద్రతే ప్రధానం

చెవి నుంచి ఫోన్‌ను కనీసం సెంటిమీటర్‌ దూరంలో పెట్టి మాట్లాడటం మంచిది. పిల్లల చేతికి మొబైల్‌ ఫోన్లను ఇవ్వకపోవటమే ఉత్తమం. ఒకవేళ ఇస్తే ఎక్కువసేపు వాడకుండా చూసుకోవాలి. బ్లూటూత్‌ పరికరంలో ఎస్‌ఏఆర్‌ విలువ ఎంత ఉందో చూసుకోవటం మంచిది. ఒకవేళ పరికరంలో దీని విలువ కనిపించకపోతే అలాంటి పరికరాలను కొనొద్దు. అన్నింటికన్నా భద్రతే ప్రధానమని తెలుసుకోవాలి.

ఇదీ చూడండి:స్మార్ట్ ఫోన్​​ ఉంటే.. పక్కన మరో మనిషి ఉన్నట్లే!

ABOUT THE AUTHOR

...view details