దేశంలో సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. క్రెడిట్ కార్డుల పేరుతో అలాంటి మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు వివరిస్తున్నారు.
యువకులే టార్గెట్..
ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడటం ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తామని, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నారు.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. తాము ఇచ్చే క్రెడిట్ కార్డు వాడితే వాటిపై 15 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఆశ చూపుతున్నారు. చాలా మంది ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులై సైబర్ నేరాగాళ్ల వలలో చిక్కుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు .
కొత్తగా క్రెడిట్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న వారికి క్యాష్ బ్యాక్ వచ్చిందని నమ్మిస్తున్నారని సైబర్ నిపుణులు ఆయుశ్ భరద్వాజ్ చెబుతున్నారు. సామాజిక మాధ్యమల్లో 18 నుంచి 30 ఏళ్ల యువకులే లక్ష్యంగా ఈ మోసాలు అధికంగా జరుగుతున్నట్లు వివరించారు.
మోసాలు జరిగే తీరు..
పైన పేర్కొన్న ఆఫర్లలో ఆకర్షితులై నకిలీ ఫేస్బుక్ ఖాతాలో ఉండే సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. వారికి సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తాయి. నిజమైన బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్గానే మాట్లాడి.. అవతలి వ్యక్తి నుంచి ఆధార్, పాన్ వివరాలు సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.
ఇలా సేకరించిన సమాచారాన్ని డీప్ వెబ్‌లో అమ్మకానికి పెడ్డటం, కొత్త సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు.
ఇప్పటికే క్రెడిట్ కార్డు వాడుతున్నవారికైతే.. మీకు క్యాష్ బ్యాంక్ వచ్చిందని దాన్ని పొందాలంటే కొన్ని వ్యక్తిగత వివరాలు చెప్పాల్సి ఉంటుందని అడుగుతారు సైబర్ నేరగాళ్లు. మాటల్లో పెట్టి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు ఓటీపీ వంటి వాటిని అడుగుతారు.
అలా ఎవరైనా వివరాలు చెబితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
వలలో చిక్కుకోకుండా ఏం చేయాలి?
- ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. అది కచ్చితంగా సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైటా? కాదా? అనేది నిర్ధరించుకోవాలి. ఫేస్బుక్లో బ్యాంకుల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ గుర్తింపు ఉంటుంది. బ్లూ టిక్ లేని ఖాతాల్లో ఉండే లింక్‌లపై క్లిక్ చేయొద్దని నిపుణులు ఆయుశ్ భరద్వాజ్ సూచించారు.
- క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్‌లు ఎప్పుడూ కూడా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమకాదు. మీ ఖాతాలో క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ జమ చేస్తామంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. అలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
- ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని మాటల్లో పెట్టి.. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయమన్నా, పిన్ ఎంటర్ చేయమని చెప్పినా, ఓటీపీలు అడిగినా చెప్పకూడదు. అలా ఎప్పుడైనా జరిగితే వెంటనే కాల్ కట్ చేసి.. ఫోన్ వచ్చిన నంబర్‌పై ఫిర్యాదు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఓటీపీ ఎప్పుడు కూడా అడగవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్బీఐ, ట్రాయ్ ఎప్పటికప్పుడు వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి.
ఇదీ చదవండి:బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్ కహానీ తెలుసా?