'నాకు చాక్లెట్ కావాలి. నాకు అరటిపండు కావాలి' అంటూ పిల్లలు గోముగా అడుగుతుంటే కాదనేవారెవరు? వారి ముద్దు ముద్దు మాటలకు అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మల మనసు సంతోషంతో నిండిపోతుంది. ఎలాంటి కోరికలైనా ఇట్టే తీర్చేస్తారు. మరి ఆ మాటలే బంగారమైతే? తమకేం కావాలో పిల్లలు నోటితో చెప్పలేని స్థితిలో ఉంటే? ఎవరికైనా బాధగానే ఉంటుంది. భావ వ్యక్తీకకరణకు మాటలే కీలకం. అది చిన్నప్పట్నుంచే అలవడుతూ వస్తుంది. కానీ ఆటిజమ్ వంటి సమస్యలతో బాధపడే పిల్లలు భాష, మాటల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. తమకు అవసరమైనవాటిని వివరించలేకపోతుంటారు. చాలాసార్లు తమ సంతానం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు అంగీకరించటానికీ తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. కొందరు వీటిని సమస్యలుగానే గుర్తించరు. నిజానికి ఇలాంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రత్యేక సూచనలు, సలహాలు అవసరం. ఇందుకోసం నిపుణులు, ప్రత్యేక స్కూళ్లు ఉన్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని భర్తీ చేయటానికే కొన్ని యాప్‌లు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తమయ్యే ఇవి ఒకవైపు పిల్లల అవసరాలను తీరుస్తూనే మరోవైపు చికిత్సగానూ ఉపయోగపడుతున్నాయి. గేమ్స్, వినోదాలతో కూడుకొని ఉండటం వల్ల పిల్లలు కూడా వీటికి తేలికగానే అలవాటు పడే అవకాశముంది. తల్లిదండ్రులతో, పెద్దవాళ్లతో ఇంట్లోనే వీటితో సాధన చేయటం వల్ల త్వరగానూ నేర్చుకోవటానికి వీలుంటుంది.
ఆవాజ్
భావ వ్యక్తీకరణకే కాదు, భాషను నేర్చుకోవటానికీ ఆవాజ్ ఉపయోగపడుతుంది. వరుస బొమ్మలతో నేర్పించటం దీని ప్రత్యేకత. దీన్నే ఏఏసీ (ఆగ్‌మెంటేటివ్ అండ్ అల్టర్నేటివ్ కమ్యూనికేషన్) అంటారు. ఆవాజ్‌ను ఓపెన్ చేయగానే రోజువారీ అవసరాలకు సంబంధించిన బొమ్మలు కనిపిస్తాయి. వీటిని ఎంచుకుంటే స్పీకర్ ద్వారా మాట వినిపిస్తుంది. ఆటిజమ్‌తో బాధపడే పిల్లలు బాగానే ఉంటారు కానీ కొన్ని విషయాలను నోటితో చెప్పలేరు. తమకు కావాల్సినవి అడగటానికి పెద్దవాళ్లను ఆయా వస్తువులు ఉన్న చోటుకి తీసుకెళ్లి చూపిస్తుంటారు. ఇలాంటివారికిది బాగా ఉపయోగపడుతుంది. పాలు అవసరమైతే పాల గ్లాసు బొమ్మను నొక్కితే చాలన్నమాట. ఈ బొమ్మలను వాక్యం రూపంలోనూ మార్చుకోవచ్చు. ఉదాహరణకు- ‘నాకు అరటిపండు కావాలి’ అని అడగాలని అనుకుంటే వీటిని సూచించే బొమ్మలను వరుసగా ఎంచుకొని ఎంటర్ నొక్కాల్సి ఉంటుంది. ఈ మూడు పదాలు కలిసి నాకు అరటిపండు కావాలి అనే మాట బయటకు వినిస్తుంది. తరచూ ఇలాంటి మాటలను వినటం వల్ల పిల్లలు క్రమంగా వీటిని నేర్చుకొని, పలకటానికి వీలవుతుంది. పిల్లల వయసు పెరుగుతున్నకొద్దీ స్థాయులను పెంచుకోవచ్చు. హిందీ, తమిళం, కన్నడం, తెలుగు, మరాఠీ భాషల్లో ఆవాజ్ అందుబాటులో ఉంది. గుజరాతీ, బెంగాలీ భాషలనూ సపోర్ట్ చేస్తుంది. మాట్లాడటంలో ఇబ్బంది పడే పిల్లల బోధన, చికిత్సలో ఇదిప్పుడు అంతర్భాగంగానూ మారిపోయింది. మొదట్లో ట్యాబ్లెట్ రూపంలోనే అందుబాటులో ఉండేది. తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ రూపాల్లోకీ మార్చారు. దీన్ని సృష్టించిన అజిత్ నారాయణన్ దివ్యాంగుల సాధికారతకు తోడ్పడేవారికిచ్చే జాతీయ అవార్డునూ అందుకున్నారు.
లీలూ
మాటలు సరిగా రాని పిల్లలకు తోడ్పడే యాప్ ఇది. బొమ్మల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసే వ్యవస్థతో పనిచేస్తుంది. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే ప్రతి పదానికీ ఒక కార్డు ఉంటుంది. ఈ కార్డు పిల్లలు చెప్పదలచుకున్న పదం లేదా వాక్యానికి సరిపడిన బొమ్మతో ముడిపడి ఉంటుంది. దీన్ని మాట రూపంలోనూ వినిపిస్తుంది. కార్డును నొక్కినప్పుడు ఎంచుకున్న పదాలను టెక్స్ట్ టు స్పీచ్ రోబో పైకి చదువుతుంది. అన్నీ ఒకే దగ్గర కాకుండా వివిధ అవసరాల కోసం ఉపయోగపడేలా 37 కార్డులు కలిగుండటం విశేషం. లీలూ యాప్‌లో సైన్ ఇన్ అయ్యి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తమ అవతార్‌ను ఎంచుకోవాలి. అనంతరం అవసరాన్ని బట్టి ఆయా కార్డులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు కమ్యూనికేషన్ కార్డును ఎంచుకుంటే మి, హలో, ఎస్, నో, టాయ్‌లెట్, బాత్, స్లీప్ వంటి బొమ్మలెన్నో కనిపిస్తాయి. ఇవి వ్యక్తిగత పనులను తెలపటంలో సాయం చేస్తాయి. ఇందులో తల్లిదండ్రులకు ఉపయోగపడే ప్రత్యేకమైన విభాగమూ ఉంది. పక్షవాతం, ప్రమాదాలకు గురికావటం వల్ల మాట్లాడటంలో ఇబ్బంది పడే పెద్దవాళ్లకూ ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ లీలూ అందుబాటులో ఉంది.
లెట్‌మిటాక్