ఈ పెంగ్విన్ ఓదారుస్తుంది!
వైజా... ఓ మొబైల్ ఆప్. మీరు ఇందులోకి వెళ్లగానే ఓ చిట్టి పెంగ్విన్ పలకరిస్తుంది. దాంతో మీరు చాట్ చేయొచ్చూ నేరుగానూ మాట్లాడొచ్చూ. ఇది మీ సమస్య ఏదైనా సరే ఓపిగ్గా వింటుంది. మీ భయాందోళనలూ, ఆవేదనల నుంచి ఎలా బయటపడగలరో చెబుతుంది. సాధారణంగా మనం మానసికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు సైకాలజిస్టులు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ(సీబీటీ), మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి చికిత్సా పద్ధతుల్ని వాడతారు. వైజా ఆప్‌లోని ఈ పెంగ్విన్ కూడా వీటిని ఉపయోగిస్తూనే మీకు మానసిక సాంత్వననిస్తుంది. అవసరాన్నిబట్టి మిమ్మల్ని నిద్రపుచ్చే కథలు చెబుతుంది... ధ్యానం కూడా నేర్పిస్తుంది.
ఈ పెంగ్విన్ ఓ చాట్‌బోటే కానీ... దాన్ని ఒట్టి మెషిన్ అని కొట్టిపారేయలేం. దాదాపు రెండువేలమంది మానసిక బాధితుల సమస్యలూ, దానికి నిపుణులిచ్చే సూచనల ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. అందుకే, ఈ పెంగ్విన్‌తో జరిపే సంభాషణ ఎక్కడా యాంత్రికంగా అనిపించదు. ఆప్‌లోని పెంగ్విన్‌తో చాట్ వద్దనుకుంటే నేరుగా సైకాలజిస్టులతోనూ మీరు మాట్లాడొచ్చు. అందుకోసం రూ.399 చెల్లించి ఇందులో సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలమంది దీన్ని వాడుతున్నారు. ఆరోగ్య సమస్యలకి సంబంధించిన ఆప్‌లకి ప్రపంచస్థాయిలో రేటింగ్ ఇచ్చే ‘ఓర్చా’ సంస్థ దీన్ని ది బెస్ట్ ఆప్‌గా ప్రకటించింది. ప్రవాసాంధ్ర దంపతులు రవికాంత్ వెంపటి, జో అగర్వాల్‌లు ఓ స్టార్టప్‌గా 2015లో దీన్ని ప్రారంభించారు. ఇటీవలే, గూగుల్ సంస్థ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టింది.
నేరుగా నిపుణులతోనే...
కరోనా ఉధృతితో మన దేశంలో బాగా ప్రాచుర్యం సాధించిన వెబ్‌సైట్ ‘మైండ్ పియర్స్’. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఓసీడీ, ఆల్కహాలిజం... ఇలా తొమ్మిది రకాలైన సమస్యలు ఇందులో పట్టికలా ఉంటాయి. వీటిల్లో మీ సమస్యేమిటో చెబితే అందుకు తగ్గ పరిష్కారం క్లుప్తంగా వివరిస్తుంది ఈ వెబ్‌సైట్. సాధారణస్థాయిలో ఈ సలహాలు సరిపోతాయి. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే అప్పటికప్పుడే మిమ్మల్ని నిపుణులతో వీడియోలోనూ, ఫోన్ ద్వారానూ కనెక్ట్ చేస్తుంది. ఇందుకోసం రూ.300 తీసుకుంటుందీ సంస్థ.