Apple Release New iOS 17 Update : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ లేటెస్ట్గా ఐఓఎస్ 17 అప్డేట్ను తీసుకువచ్చింది. దీనిలో రెండు సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ తాజా అప్డేట్తో ఐఫోన్ 15లోని బగ్స్ అన్నింటినీ ఫిక్స్ చేశామని.. అందువల్ల ఐఫోన్ హీటింగ్ సమస్యలకు చెక్ పడుతుందని యాపిల్ కంపెనీ వెల్లడించింది.
సమస్య- పరిష్కారం!
యాపిల్ కంపెనీ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు అనుగణంగా కొత్త ఐఓఎస్ 17.0.2ను తీసుకొచ్చింది. దీనితో అందరూ ఈ ఐఓఎస్‌ను అప్డేట్ను చేసుకున్నారు. కానీ అక్కడి నుంచే సమస్య మొదలైంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు పరిమితికి మించి వేడెక్కడం స్టార్ట్ అయ్యింది. దీనితో యాపిల్ యూజర్లు అందరూ కంపెనీకి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. రంగంలోకి దిగిన కంపెనీ తాజాగా ఐఓఎస్ 17.0.3 అప్డేట్ను రిలీజ్ చేసింది. దీని ద్వారా ఐఫోన్ 15 హీటింగ్ సమస్యకు చెక్ పడుతుందని పేర్కొంది.
ఐఫోన్ 15లో కొన్ని యాప్స్ కూడా సరిగా రన్ కాలేదు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఉబర్ లాంటి యాప్స్ సక్రమంగా పనిచేయలేదు. తాజా అప్డేట్తో ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది.
ఓవర్ లోడ్ పడకుండా ఆప్టిమైజేషన్!
ఐఫోన్ 15లో A17 Pro చిప్‌ను అమర్చారు. కొన్ని యాప్స్ వల్ల దీనిపై ఓవర్ లోడ్ పడుతోంది. అందువల్ల ఐఫోన్ 15 ఓవర్ హీట్ అవుతోంది. దీనిని గుర్తించిన యాపిల్ కంపెనీ.. A17 Pro చిప్‌పై ఓవర్ లోడ్ పడకుండా.. యాప్‌లను అప్టిమైజ్ చేయాలని.. యాప్ డెవలపర్లకు కోరింది. పైగా వారికి కావాల్సిన సహకారం కూడా అందిస్తోంది.