విమానాలు ఎలా నడుస్తాయి? పెట్రోల్‌తో. అదీ మరింత శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో. దీన్ని విమాన ఇంధనమనీ అంటారు. మరి వంట నూనెతో ఆకాశంలోకి ఎగిరితే? బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ఇలాంటి ఘనతే సాధించింది. సైనిక రవాణా విమానాన్ని నూరుశాతం సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్) సాయంతోనే నడిపించి కొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాల్లో ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది! సైనిక, పౌర విమాన సేవలకు ఎస్‌ఏఎఫ్‌ను వాడుకోవటానికిది మార్గం సుగమం చేసింది. సరికొత్త చర్చకు దారితీసింది.
విమాన ఇంధనంలో చాలా శక్తి ఉంటుంది. దీని మూలంగానే విమాన ప్రయాణాలు సాధ్యమవుతున్నాయి. చాలా త్వరగా, దూర ప్రాంతాలకు ప్రయాణాలు సాగించటానికి దీనికి మించిన సాధనం మరోటి లేదు. దీంతో చిక్కేంటంటే- కర్బన ఉద్గారాలు వెలువడటం. ఒక కిలో ఇంధనంతో 3.16 కిలోల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుంది. అందుకే విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించటం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సుస్థిర విమాన ఇంధనం.. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ (ఎస్‌ఏఎఫ్) ఆలోచన పుట్టుకొచ్చింది. ఎన్నో పెట్రోలు కంపెనీలు దీన్ని తయారు చేయటంపై దృష్టి సారించాయి. 2050 కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించటం దీని ఉద్దేశం.
సుస్థిర విమాన ఇంధనమంటే?
పెట్రోలు, డీజిల్ వంటివన్నీ శిలాజ ఇంధనాలు. వీటిని భూగర్భంలోంచి తవ్వి తీస్తారు. సుస్థిర విమాన ఇంధనం అలాంటిది కాదు. బయో ఇంధనం. వాడగా మిగిలిన వంటనూనెలు, ఆహార వ్యర్థాల వంటివాటితో తయారు చేస్తారు. ఇది శిలాజ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్‌ను విడుదల చేస్తుంది. విమాన ఇంధనంతో పోలిస్తే కర్బన ఉద్గారాల చట్రాన్ని సుమారు 80% వరకు తగ్గిస్తుంది. అదెలాగో ఉదాహరణతో చూద్దాం. మొక్కలు పెరుగుతున్నప్పుడు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి కదా. ఆహార, అటవీ వ్యర్థాలన్నీ మొక్కలు, చెట్ల నుంచి వచ్చినవే. వీటి నుంచి తయారైన ఇంధనాన్ని విమానాల్లో వాడుకుంటున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ తిరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఒకవైపు తగ్గటం, మరోవైపు పెరగటం.. దాదాపు రెండూ సమానంగానే ఉంటాయి. మరి తేడా ఏంటి? వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారుచేయటం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్ కలవటం తగ్గుతుంది. విలువైన వనరులను తిరిగి వినియోగించుకోవటానికి వీలవుతుంది. ఇదే స్వచ్ఛ ఇంధనమనే పేరు తెచ్చిపెడుతోంది. భవిష్యత్ బయో ఇంధనం, అధునాతన ఇంధనమనీ పిలుచుకుంటున్నారు.
వేటి నుంచి తయారుచేస్తారు?
సుస్థిర విమాన ఇంధనాన్ని రకరకాల పదార్థాలు, వ్యర్థాలతో తయారుచేస్తారు.
* గృహ, కార్యాలయ వ్యర్థాలు: ఆహార వ్యర్థాలు.. పాత దుస్తులు, పత్రికలు, బాటిళ్లు,.. పారేసిన బాటిళ్లు, ఫర్నిచర్.. ఇలాంటివన్నీ ఇంధన తయారీకి ఉపయోగపడేవే.