Alien Signal From Mars : కేవలం భూమి మీదనే జీవజాలం ఉందా? అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా.. గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసుల గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా జరిగింది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్(టీజీఓ) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ టీజీఓను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.
అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీఓ 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్‌కు చేరవేసింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని 'ఎ సైన్స్ ఇన్ స్పేస్' ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్ తెలిపారు. 'ఇది చరిత్రలోనే నిలిచిపోయే ఘటన. గ్రహాంతరవాసుల ఉనికి కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర గ్రహాలపైనున్న జీవరాశుల నుంచి ఓ సందేశం రావడం భవిష్యత్ పరిశోధనలకు పునాది వేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఊతమిస్తోంది' అని పౌలిస్ అన్నారు.