తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

విద్యార్థుల భావాల్ని కనిపెట్టే కృత్రిమ మేధ! - artificial intelligence on children emotion

ఆన్​లైన్ తరగతుల్లో విద్యార్థుల మానసిక స్థితి గురించి ఉపాధ్యాయులు కనిపెట్టడం కష్టమైన పనే. అయితే హాంకాంగ్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ సంస్థ ఇందుకు పరిష్కారం చూపింది. 4 లిటిల్ ట్రీస్​ పేరుతో సాఫ్ట్​వేర్​ను రూపొందించింది. దీని ద్వారా విద్యార్థుల మానసిక స్థితి, ప్రతిభ దగ్గరుండి తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. 2017లోనే రూపొందిన ఈ సాఫ్ట్​వేర్​.. కరోనా సంక్షోభంతో వెలుగులోకి వచ్చింది.

artificial intelligence
కృత్రిమ మేధ విద్యార్థుల భావాల్ని కనిపెట్టేస్తుంది!

By

Published : Mar 11, 2021, 5:55 AM IST

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. కానీ, ప్రత్యక్షంగా బోధించడం ద్వారానే విద్యార్థులకు జ్ఞానం, మంచి నడవడిక అబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సైతం విద్యార్థుల మానసిక స్థితి, ప్రతిభ దగ్గరుండి తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ తరగతుల వల్ల అదీ వీలు కావట్లేదు. పదుల సంఖ్యలో విద్యార్థులను చిన్న తెరపై గమనించడం కాస్త కష్టమే. ఇదే పరిస్థితి హాంకాంగ్‌లో ట్రూ లైట్‌ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా ఉన్న కా టిమ్‌ చుకి ఎదురైంది. దీంతో కృత్రిమ మేధ(ఏఐ)ను ఆశ్రయించాడు. ఏఐకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ రూపొందించిన 4 లిటిల్‌ ట్రీస్‌ను కొనుగోలు చేసి ఉపయోగించడం మొదలుపెట్టాడు. దీని ద్వారా తను పాఠాలు చెబుతున్న సమయంలో విద్యార్థుల ముఖాలను పరిశీలించి వారి భావాల్ని టిమ్‌ కనిపెట్టగలుతున్నాడు.

ఎలా పనిచేస్తుంది ?

ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌ తరగతులకు ఉపయోగించే కంప్యూటర్‌ లేదా ట్యాబ్లెట్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే.. అందులోని కెమెరా ద్వారా ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలను ఏఐ పరిశీలిస్తుంది. ముఖ కండరాలు, కదలికలను బట్టి విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? కోపంగా ఉన్నారా? భయపడుతున్నారా? లేదా ఆశ్చర్యపోతున్నారా? వంటి విషయాలను గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాదు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఒక్కో విద్యార్థి ఎంత సమయం తీసుకుంటున్నాడు?వారి మార్కుల జాబితా, వారి బలాలు.. బలహీనతలు ఇలా అన్ని విషయాలను రికార్డు చేసి.. ప్రతి విద్యార్థికి ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తుంది. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభ సులువుగా తెలుసుకోవచ్చు. వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే వీలు కలుగుతుంది. అలాగే, ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌ మెదడుకు పనిచెప్పే కొన్ని ఆటలు ఆడిస్తూ విద్యార్థులకు తెలివిపెరిగేలా శిక్షణ ఇస్తుంది.

2017లోనే..

ఈ 4 లిటిట్‌ ట్రీస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన వియోలా లామ్‌ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడట. అందుకే, విద్యార్థులు పడే ఇబ్బందులు గుర్తించడం కోసం దీన్ని 2017లోనే రూపొందించాడు. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆన్‌లైన్‌ తరగతులే దిక్కుగా మారడం వల్ల ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చూడండి :ఉత్తమ అగ్రిటెక్ స్టార్టప్​గా ఇంటెల్లో ల్యాబ్స్

ABOUT THE AUTHOR

...view details