Aditya L1 Mission Successful Launch :చంద్రయాన్-3 విజయం స్ఫూర్తితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో ముందడుగు వేసింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య-ఎల్1 రాకెట్ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు (aditya l1 launch date and time) ఆదిత్య-ఎల్ 1ను శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది.
పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్ (aditya-l1 mission launch vehicle).. ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రోప్రకటించింది. వ్యోమనౌకకు అమర్చిన సోలార్ ప్యానెల్స్ పవర్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టినట్లు తెలిపింది. తొలి కక్ష్య పెంపు ప్రక్రియను ఆదివారం (సెప్టెంబర్ 3) ఉదయం 11.45 గంటలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ మాట్లాడారు. నిర్దేశించిన కక్ష్యలో వ్యోమనౌకను పీఎస్‌ఎల్‌వీ రాకఎట్ ప్రవేశపెట్టిందని తెలిపారు.
"ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాం. పీఎస్‌ఎల్‌వీ తదుపరి చర్యల్లో భాగంగా తొలిసారి "టూ బర్న్ సీక్వెన్స్" వినియోగించి నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపాం. ఆదిత్య ఎల్1ను సరైన కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. కొన్ని ప్రక్రియల తర్వాత ఆదిత్య ఎల్1 తన ప్రయాణాన్ని సూర్యుడి దిశగా కొనసాగిస్తుంది. ఎల్1 పాయింట్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది సుదూర ప్రయాణం. దాదాపు 125 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం."
--ఎస్.సోమ్‌నాథ్, ఇస్రో ఛైర్మన్
ఈ మిషన్ విజయంతో ఒక కల సాకారం అయిందని ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టు డైరెక్టర్ నిగర్ శాజీ ( Aditya L1 Launch Mission Director Name ) తెలిపారు. 'ఆదిత్య-ఎల్1ను.. వాహకనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యోమనౌక 125 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారత్‌కు, ప్రపంచ వైజ్ఞానిక వర్గానికి ఈ మిషన్ ఒక ఆస్తి అవుతుంది. ఈ మిషన్ సాకారం అయ్యేలా చేసిందుకు శాస్త్రవేత్తల బృందానికి ధన్యవాదాలు' అని అన్నారు.
ఈ ప్రయోగం చేసింది అందుకే : ప్రధాని మోదీ
ఆదిత్య ఎల్-1ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇస్రోకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమ కోసం విశ్వాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి కొనసాగుతోందని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు.