Aditya L1 Mission Countdown : భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలోని తొలి లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో 'ఆదిత్య ఎల్1'ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రవేశపెట్టనుంది. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఆదిత్య ఎల్-1లో పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.
'భవిష్యత్తులోనూ ఉండనుందా?'
ISRO Sun Mission :సూర్యుడి నుంచి వెలువడుతున్న కిరణ ప్రసారం ఇప్పుడు ఉన్నట్లే భవిష్యత్తులోనూ ఉండనుందా అనే దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించనున్నారు. ఒకవేళ భవిష్యత్తులో సూర్యుని నుంచి వెలువడే రేడియేషన్ తగ్గితే అది భూవాతావరణంపై భారీ ప్రభావం చూపనుంది. లాగ్రాంజియన్ పాయింట్ నుంచి సుదీర్ఘ కాలం పాటు సూర్యుడిని పర్యవేక్షించగలిగితే, ఇప్పటివరకు మానవాళికి తెలియని సూర్యుని చరిత్ర నమూనా తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
డేటా సాయంతో అంతరిక్ష వాతావరణాన్ని..
Aditya l1 What Will It Do : ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడిలోని అయస్కాంత చర్యల్లో మార్పులు కనిపిస్తాయి. దీన్నే సోలార్ సైకిల్ అని పిలుస్తారు. సౌర వాతావరణంలో అయస్కాంత క్షేత్రంలో అప్పుడప్పుడు ప్రచండ మార్పులు కూడా జరుగుతాయి. దీని ఫలితంగా భారీ శక్తి పేలుళ్లు ఏర్పడతాయి, వీటిని సౌర తుఫానులు అంటారు. సూర్యుడి వెలుపలి వాతావరణం కొరోనా బలమైన అయస్కాంత క్షేత్రాల ద్వారా ఏర్పడింది. ఇది వేడి ప్లాస్మాను పరిమితం చేస్తుంది. ఒక్కోసారి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అన్ని దిశల్లో పయనిస్తాయి. వీటివల్ల ఉపగ్రహాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. జాబిల్లి వంటి ఇతర ఖగోళ వస్తువులు కూడా సౌర తుపాన్ల వల్ల ప్రభావితమవుతాయి. సౌర తుపాను కారణంగా భూ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ప్రభావం పడి జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంతరిక్షంలో ఉన్న మన ఆస్తులను కాపాడుకోవాలంటే అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడం ఎంతో అవసరం. ఆదిత్య ఎల్-1 నుంచి వచ్చే డేటా సాయంతో అంతరిక్ష వాతావరణాన్ని మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది.