తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టపడనివారూ తినేస్తారు! - etv bharat food

ఇంట్లో ఇడ్లీ అంటే చాలు.. అబ్బా ఇదా అనుకుంటారు చాలామంది. అందుకే, ఇడ్లీలు చేసిన రోజు ఎక్కువగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు వాటితో వెరైటీగా స్నాక్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే, ఇడ్లీతో చేసే రెండు వెరైటీ రెసిపీలను మీ కోసం పట్టుకొచ్చాం. ఇలా చేశారంటే ఇడ్లీ ఇష్టపడనివారు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరింకెందుకు ఆలస్యం ఇడ్లీని రీమోడల్ చేసేయండిలా...

try idly fry and masala idly recipes to serve even idly haters
ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టపడనివారూ తినేస్తారు!

By

Published : Aug 24, 2020, 1:04 PM IST

మిగిలిపోయిన ఇడ్లీలతో మనం రకరకాల వంటకాలు చేయవచ్చు. వాటిలో మసాలా ఇడ్లీ, ఫ్రైడ్‌ ఇడ్లీలు బాగుంటాయి. పిల్లలకూ బాగా నచ్చుతాయి.

మసాలా ఇడ్లీ

మసాలా ఇడ్లీ...

చాలామంది మసాలా ఇడ్లీని ఎక్కువగా ఇష్టపడతారు. దీని తయారీ విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. కడాయిని పొయ్యిమీద పెట్టి కొంచెం నూనె వేసి అరచెంచా చొప్పున ఆవాలూ, జీలకర్రా, చెంచా అల్లంవెల్లుల్లి ముద్దా, సన్నగా తరిగిన ఉల్లిపాయా, రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఓ కప్పు తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి టొమాటోలు మెత్తగా అయ్యేవరకూ వేయించుకోవాలి. ఒక వేళ ఇడ్లీలు నిన్నటివి అయితే ఫ్రిజ్‌లో పెడతాం కాబట్టి గట్టిగా ఉంటాయి. కాబట్టి టొమాటోలు ఉడికాక గ్లాసు నీళ్లు పోయాలి. ఇందులో ఇందాక కోసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇది కొంచెం గ్రేవిలా ఉంటుంది. చివరగా అర చెంచా పావుబాజీ మసాలా కూడా కలుపుకోవాలి. అదే ఇడ్లీ తాజా అయితే నీళ్లు పోయకుండా వేయించుకోవచ్చు. చివర్లో కొద్దిగా నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే.. మసాలా ఇడ్లీ రెడీ.

ఫ్రైడ్ ఇడ్లీ

ఫ్రైడ్‌ ఇడ్లీ...

ఇడ్లీని ఇలా కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చీ, జీలకర్రా, కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా మిరియాలు... వీటన్నింటినీ మిక్సీలో వేసుకుని.. మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. బాణలిలో కాస్త నూనె వేసి ఇడ్లీలను రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొంచెం నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇందాక తయారు చేసుకున్న పొడిని వేసి కాసేపు వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకుంటే చాలు. దీని రుచి మరికాస్త పెరగాలంటే కొద్దిగా ఉప్పుతోపాటు ఆమ్‌చూర్‌ పొడి చల్లుకోవచ్చు. ప్రత్యేకమైన రుచి రావాలంటే ఒక చెంచా సాంబారుపొడినీ వేసుకోవచ్చు. దీన్ని స్నాక్‌లా తినాలంటే సాంబారు పొడి బదులు చాట్‌ మసాలా చల్లుకోవచ్చు. ఇది కరకరలాడుతూ ఉండాలనుకుంటే పాన్‌లో ఎక్కువగా నూనె తీసుకుని ఇడ్లీ ముక్కలను గారెల్లా వేయించుకుని తీసుకోవాలి. డీప్‌ ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలను టిష్యూ పేపర్‌పై తీసుకోవాలి. పుట్నాల పప్పు పొడి, కరివేపాకు పొడి, సాంబారు పొడి వేయించిన ఇడ్లీ ముక్కలపై చల్లుకుంటే చాలు.

ఇదీ చదవండి : వానలో మనసుకోరే 'మొక్కజొన్న పాన్‌కేక్‌' మనింట్లోనే!

ABOUT THE AUTHOR

...view details