తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఉగాది విందులో... కారంగా, తియ్యగా! - telangana news

తెలుగు సంవత్సరాదిన... షడ్రుచుల పచ్చడితోపాటు పంచభక్ష్య పరమాన్నాలు చేసుకోవడమూ మామూలే. కానీ ఆ విందు కోసం ఏమేం చేయాలనేదే పెద్ద సమస్య అయితే... ఇవీ తయారు చేసి చూడండి.

special-items-for-ugadi
ఉగాది విందులో... కారంగా, తియ్యగా!

By

Published : Apr 13, 2021, 6:57 AM IST

బీట్‌రూట్‌ వడ

కావలసినవి
బీట్‌రూట్‌ తురుము: కప్పు, సెనగపప్పు: కప్పు,కందిపప్పు: పావుకప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ తరుగు: పావుకప్పు, ఎండుమిర్చి:రెండు, అల్లం తురుము: చెంచా, సోంపుపొడి: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు:పావుకప్పు, ఉప్పు:తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం

సెనగపప్పు, కందిపప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి. గంటయ్యాక నీళ్లు వంపేసి రెండింటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, అల్లం తురుము, సోంపుపొడి, ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పిండిని ఓ గిన్నెలో వేసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా తట్టుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

కొబ్బరిపాల బర్ఫీ

కావలసినవి
మైదా:కప్పు, కొబ్బరిపాలు: నాలుగుకప్పులు, చక్కెర: రెండు కప్పులు, జీడిపప్పు పలుకులు:కొన్ని, నెయ్యి:పావుకప్పు.


తయారీవిధానం

మైదాను ఓ గిన్నెలో వేసి నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. దాంట్లోనే మరో మూడు కప్పుల నీళ్లు పోసి చేత్తో కలుపుతూ ఉంటే పిండినీళ్లు పైకి తేలతాయి. ఇలా పిండి అంతా నీటిలో కలిసిపోయేవరకూ కలిపి... మూత పెడితే మర్నాటికి పల్చని నీరు పైకి తేలుతుంది. ఆ నీటిని వడకట్టి చిక్కని మైదా మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మైదా మిశ్రమం, కొబ్బరిపాలు, పావు వంతు చక్కెర వేసి అన్నింటినీ కలిపి స్టౌని మీడియంలో పెట్టాలి. మరో బాణలిలో మిగిలిన చక్కెర, నెయ్యివేసి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు దాన్ని మైదా మిశ్రమంలో వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గర పడుతుంది. అప్పుడు జీడిపప్పు పలుకులు వేసి ఓసారి కలిపి నెయ్యి రాసిన ప్లేటులో పరిచి, వేడి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోసుకోవాలి.

ఖర్జూర పాయసం

కావలసినవి
గింజల్లేని ఖర్జూరాలు: పన్నెండు, చిక్కని పాలు:మూడున్నర కప్పులు, వాల్‌నట్లు: పావుకప్పు, పొట్టుతీసిన బాదంపలుకులు: పావుకప్పు,డ్రై ఫ్రూట్స్‌:గుప్పెడు, యాలకులపొడి: అరచెంచా, నెయ్యి:రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీవిధానం

అరకప్పు గోరువెచ్చని పాలల్లో బాదం, ఖర్జూరాలు, వాల్‌నట్లను నానబెట్టుకోవాలి. పావుగంటయ్యాక అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన పాలు పోయాలి. అవి మరిగి సగం అయ్యాక స్టౌ కట్టేయాలి. ఇందులో వేయించిన డ్రైఫ్రూట్స్‌పలుకులతోపాటూ ఖర్జూరాల ముద్ద, యాలకులపొడి వేసి అన్నింటినీ కలపాలి.

బూడిద గుమ్మడి హల్వా

కావలసినవి
నీళ్లు పూర్తిగా పిండేసిన బూడిద గుమ్మడి తురుము: మూడు కప్పులు, గుమ్మడిరసం:ఒకటిన్నర కప్పు,చక్కెర: ఒకటిన్నర కప్పు, ఉప్పు: చిటికెడు, నిమ్మరసం: అరచెంచా, నెయ్యి:పావుకప్పు, యాలకులపొడి: ముప్పావు చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: కొన్ని.

తయారీవిధానం

స్టౌమీద కడాయి పెట్టి అందులో గుమ్మడి రసం పోయాలి. అవి మరుగుతున్నప్పుడు తురుము వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేసటికి నీళ్లు ఆవిరవుతాయి. అప్పుడు చక్కెర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకులపొడి వేసి అన్నింటినీ కలిపి దింపేయాలి.

మామిడి కారం పులిహార

కావలసినవి
మామిడి తురుము:అరకప్పు, పొడిపొడిగా వండిన అన్నం: ఒకటిన్నర కప్పు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, పల్లీలు:పావుకప్పు, ఆవాలు: పావుచెంచా, ఇంగువ: పావుచెంచా, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చిమిర్చి: రెండు సెనగపప్పు: చెంచా, ఉప్పు: తగినంత. మసాలాకోసం: దనియాలు:చెంచా, మిరియాలు: అరచెంచా, మినప్పప్పు: చెంచా,సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: రెండు, మెంతులు:నాలుగు గింజలు.

తయారీవిధానం
స్టౌమీద కడాయి పెట్టి.. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి కొద్దిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసిపెట్టుకోవాలి. స్టౌమీద మళ్లీ అదే బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు, పల్లీలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అన్నీ వేగాక మామిడి తురుము కూడా వేసి ఓ నిమిషంపాటు వేయించి స్టౌకట్టేయాలి. ఇప్పుడు ఈ తాలింపు, ముందుగా చేసుకున్న మసాలా ఒకటిన్నర చెంచా, తగినంత ఉప్పు అన్నంపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.

ఇదీ చూడండి:బీపీని తగ్గించుకోగలమా.?

ABOUT THE AUTHOR

...view details