తెలంగాణ

telangana

ETV Bharat / priya

కాలమేదైనా.. 'పుదీనా' రుచి చూడాల్సిందే!

అప్పుడప్పుడు పుదీనా పచ్చడి చేసుకుంటూ.. బిర్యానీలు, మసాలా కూరల్లో పుదీనా దట్టంగా వేసుకుంటే ఎంతో ఆరోగ్యం అంటారు పెద్దలు. మరి అంత ఆరోగ్యకరమైన పుదీనాను మరింత రుచికరంగా మార్చేస్తే.? రకరకాల పుదీనా పానీయాలను కమ్మగా చేసుకొని సిప్​ చేస్తే.. చాలా బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం పుదీనా స్పెషల్ రెసిపీలు చూసేయండి మరి..

learn mint leaves  recipes like scotch, raita, pudheeena water etc,. in telugu
కాలమేదైనా.. 'పుదీనా' రుచి చూసి తీరాలిలా!

By

Published : Jul 27, 2020, 1:01 PM IST

శరీరానికి ఎన్నో పోషకాలు అందించే పుదీనా రుచి, వాసన ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ ఆకులను వేసవిలోనే కాదు ఏ కాలంలో తీసుకున్నా ఆరోగ్యకరమే అంటారు నిపుణులు. మరి పుదీనాతో నోరూరించే పానీయాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి...

కాలమేదైనా.. 'పుదీనా' రుచి చూసి తీరాలిలా!

పుదీనా కొత్తిమీర...

పుదీనా కొత్తిమీరతో...

కావాల్సినవి

పుదీనా, కొత్తిమీర - గుప్పెడు చొప్పున, అల్లం - చిన్నముక్క, యాలకులు - నాలుగు, తాజా బెల్లం తరుగు - రెండున్నర టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - చెంచా.

తయారీ

ఓ గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని అందులో కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక వడకట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. దీన్ని బెల్లం నీటిలో వేసి బాగా కలిపి గ్లాసులోకి తీసుకోవాలి. పుదీనా పాకం సిద్ధం. బెల్లం ఇష్టం లేనివాళ్లు తేనె వేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్ని వడకట్టుకుని కూడా తాగొచ్చు.

పెరుగు చేర్చి...

పెరుగు చేర్చి...

కావాల్సినవి

చిక్కని పెరుగు - ముప్పావుకప్పు, పుదీనా తరుగు - పావుకప్పు, బాదంపాలు - కప్పు, చిక్కని చక్కెర పాకం - రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ

ఈ పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకోవాలి. అన్నింటినీ చిక్కని మిల్క్‌షేక్‌లా తయారుచేసుకుంటే సరిపోతుంది. దీన్ని గ్లాసుల్లోకి తీసుకున్నాక కావాలనుకుంటే రెండు పుదీనా ఆకులతో అలంకరించుకోవచ్చు.

జీరా పానీ

జీరా పానీ

కావాల్సినవి

పుదీనా ఆకులు - ముప్పావు కప్పు, చక్కెర - పావుకప్పు, నిమ్మకాయలు - రెండు, ఉప్పు - చెంచా, అల్లం పేస్టు - అరచెంచా, వేయించిన జీలకర్రపొడి - చెంచా.

తయారీ

మిక్సీజారులో ఈ పదార్థాలన్నీ తీసుకుని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఇందులో ఐసు ముక్కలు వేసుకుని తాగితే చాలు.

రైతా

రైతా

కావాల్సినవి

కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట, చిక్కటి పెరుగు - కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - రెండు, వేయించిన జీలకర్రపొడి - ముప్పావు చెంచా, చాట్‌మసాలా - పావుచెంచా.

తయారీ

పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా కడిగి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని గిలక్కొట్టిన పెరుగులో వేసి బాగా కలపాలి. తర్వాత ఉవ్పు, జీలకర్రపొడి, చాట్‌మసాలా వేసుకుని బాగా కలిపితే చాలు. పుదీనా రైతా సిద్ధం. దీన్ని బిర్యానీలాంటి వాటితోనే కాదు, చపాతీలతోనూ తినొచ్చు.

స్క్వాష్

స్క్వాష్

కావాల్సినవి

తాజా పుదీనా ఆకులు - రెండుకప్పులు, నిమ్మకాయలు - రెండు, చక్కెర - రెండున్నర కప్పులు, నీళ్లు - గ్లాసు, అల్లం తరుగు - పావు చెంచా.

తయారీ

అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. చక్కెర కరిగి, మరీ ముదురు, మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా పాకం అయ్యాక దించాలి. ఇది పూర్తిగా చల్లారాక పుదీనా ఆకుల తరుగుతోపాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి ఓ నాలుగైదు గంటలు వదిలేయాలి. ఈ పదార్థాల సారం అంతా పాకంలో కలుస్తుంది. అప్పుడు గాజు సీసాలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కావాల్సినప్పుడల్లా ఓ గ్లాసు చల్లని నీటిలో రెండుమూడు చెంచాలు వేసుకుని తాగొచ్చు. ఈ స్క్వాష్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి.. రెండు రోజులకోసారి అప్పటికప్పుడు తాజాగా చేసుకుంటే మంచిది.

ఇదీ చదవండి:'గోధుమ పిండి కేక్' రుచి చూస్తే అవాక్కే!

ABOUT THE AUTHOR

...view details