పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది కేక్. ఇలాంటి సమయాల్లో కేక్ కట్ చేసి తింటూ సెలబ్రేషన్స్ చేసుకోవడం మనకు అలవాటే. భిన్నమైన ఫ్లేవర్స్‌లో దొరికే ఈ కేక్‌ను ఏదో ఒక బేకరీ నుంచి కొనుగోలు చేయడమో.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారుచేసుకోవడమో చేస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా మ్యాంగో ఛీజ్ కేక్ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. అందుకోసం దీని తయారీ విధానం మీకోసం.
కావాల్సినవి: 10 బిస్కెట్లు, వెన్న- 50 గ్రాములు , పన్నీర్-30 గ్రాములు, క్రీమ్ ఛీజ్-30 గ్రాములు, హంగ్ కర్డ్-30 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్-30 గ్రాములు, కస్టర్డ్- 50 గ్రాములు, మ్యాంగో గుజ్జు-50 గ్రాములు, జెలిటన్- 5 గ్రాములు, కొన్ని మామిడి పండు ముక్కలు.
తయారీ విధానం
ముందుగా ఓ బౌల్లో బిస్కెట్స్ తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కరిగించిన వెన్న వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్ బౌల్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఇంకో గిన్నెలో పన్నీర్‌ను మెత్తగా చిదుముకోవాలి. అందులో క్రీమ్ ఛీజ్, హంగ్ కర్డ్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఆ తర్వాత కస్టర్డ్, మ్యాంగో గుజ్జు, బేసిల్(తులసి), మామిడి పండు ముక్కలు, కరగపెట్టిన జెలిటన్ను వేసి మరోసారి బాగా కలపాలి. దీన్ని మ్యాంగో క్రీమ్ అంటారు.
ముందుగా మనం కలిపిపెట్టుకున్న బిస్కెట్ గుజ్జు మిశ్రమం పైన మ్యాంగ్ క్రీమ్‌ను వేసి దానిపైనా మామిడి ముక్కలను నచ్చిన విధంగా పరచాలి. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. మీకు కావాల్సిన టేస్టీ మ్యాంగో ఛీజ్ కేక్ రెడీ.
ఇదీ చూడండి: వెల్లుల్లి వంకాయ పులుసు చేసుకోండిలా!