తెలంగాణ

telangana

ETV Bharat / priya

శక్తి కావాలా...ఇదిగో జావ!

వేసవికాలంలో ఎక్కువగా అలసిపోతుంటాం. చిన్న పని చేసినా నీరసం వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు కాస్త జావ తాగితే చాలు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతాం. ఇంకెందుకాలస్యం... రకరకాల జావలను మీరూ ప్రయత్నించండి మరి.

healthy food in summer
శక్తి కావాలా...ఇదిగో జావ!

By

Published : Mar 21, 2021, 2:59 PM IST

రాగి జావ

కావాల్సినవి:రాగిపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం- చిన్నముక్క, పాలు- అరకప్పు, యాలకులపొడి- చిటికెడు. మజ్జిగజావ కోసం: రాగిపిండి రెండు టేబుల్‌స్పూన్లు, పల్చటి మజ్జిగ- కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, జీలకర్ర పొడి- చిటికెడు, కొత్తిమీర, కరివేపాకు తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ:రాగిపిండిని అరకప్పు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలిపి సన్నని మంట మీద ఉండలు కట్టకుండా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలపాటు ఉడికించాలి. జావ తియ్యగా కావాలంటే కొద్దిగా బెల్లం, అరకప్పు పాలు, చిటికెడు యాలకుల పొడి వేసుకుని రెండు నిమిషాలపాటు ఉడికించాలి. మజ్జిగతో కావాలంటే.. జావ తయారైన తర్వాత పల్చటి మజ్జిగ, సన్నగా తరిగైన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చాలి.

బార్లీ జావ

కావాల్సినవి:బార్లీగింజలు- పావుకప్పు, మజ్జిగ- కప్పు, దానిమ్మ గింజలు- గుప్పెడు, ఉప్పు- తగినంత.
తయారీ: బార్లీ గింజలను కడిగి నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. ఇలాచేస్తే త్వరగా ఉడుకుతాయి. ఈ గింజలను కుక్కర్‌లో వేసి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వడపోసి పటికబెల్లం, నిమ్మరసం కలిపి తాగొచ్చు. పల్చటి మజ్జిగ కలిపి దానిమ్మ గింజలు వేసుకుని కూడా తాగొచ్చు. మజ్జిగకు బదులుగా పుచ్చకాయ రసం పైనాపిల్‌ రసం కలిపి తాగినా చాలా రుచిగా ఉంటుంది.

సత్తు

కావాల్సినవి:సత్తుపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి- ఒక్కోటి చొప్పన, నిమ్మరసం- టేబుల్‌స్పూన్‌, నల్లఉప్పు- చిటికెడు.
తయారీ:కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. రెండు గ్లాసుల నీటిలో సత్తుపిండిని కలిపి దీన్ని ఉల్లిపాయల్లో వేసి మిశ్రమం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండాలి.

తియ్యటి సత్తు కోసం: రెండు గ్లాసుల నీళ్లలో సత్తుపిండి వేసి ఉడికించాలి. దీంట్లో పంచదార/ బెల్లంపొడి వేసి బాగా కలపాలి.


* దీన్ని ‘పేదవారి ప్రొటీన్‌’ అనికూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తాగుతారు గోధుమలు, జొన్నలు, బార్లీతో చేసిన సత్తుపిండిలో వేయించిన సెనగపిండి కలుపుతారు. ఇది మార్కెట్లోనూ అందుబాటులో ఉంటుంది.
* సత్తు షర్బత్‌ని బిహార్‌, ఝార్ఖండ్‌లో ఎంతో ఇష్టంగా తాగుతారు.
* ఎండలో పనిచేసే వారికి వడదెబ్బ నుంచి సత్తు రక్షణ కల్పిస్తుంది.

సత్తుపిండితో

సగ్గు బియ్యం

కావాల్సినవి: సగ్గుబియ్యం- నాలుగు టేబుల్‌స్పూన్లు, పాలు- అరకప్పు, పంచదార- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- చిటికెడు.
తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు, మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మెత్తబడేంతవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, పంచదార, ఉప్పు కలపాలి.
* ఇది ఎండాకాలంలో వచ్చే నీళ్ల విరేచనాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే పాలు కాకుండా పెరుగుగానీ మజ్జిగగానీ కలపాలి. ఉడికేటప్పుడే జీలకర్ర లేదా పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

సగ్గుబియ్యంతో..

ఇదీ చూడండి:5వేలకుపైగా ప్రసవాలు చేసిన 103 ఏళ్ల బామ్మ

ABOUT THE AUTHOR

...view details