ఒడిశాలో ప్రతి ఏటా మార్చి నెలలో 'పఖాలీ అన్నం' లేదా 'సద్దన్నం' దినోత్సవం జరుపుకొంటారు. పఖాలీ అంటే మనం తినే చద్దన్నమే. ఈ పఖాలీ అన్నం గురించి మాట్లాడకుండా ఒడిశా క్యుజీన్‌కి సంపూర్ణత్వం రాదు. రాత్రి మిగిలిన అన్నంలో గంజి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రాత్రంతా పులియబెడతారు. ఫెర్మెంట్ అయిన ఈ అన్నంలో కొద్దిగా ఆవనూనె వేసి తింటారు. దీన్నే పఖాలా అంటారు. అక్కడి పెళ్లిళ్లలో కూడా ఈ అన్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లికూతురు అత్తింటివారికి వేయించిన చేపలు, పఖాలీ అన్నం వడ్డించడం ఆచారం.
నిమ్మఆకులు వేసి చేసే చద్దన్నాన్ని 'లేంబు పత్ర పఖాలా' అనీ 'తోరాణి అన్నం' అనీ అంటారు. ఇది మన తర్వాణి అన్నమే! చద్దన్నంలో కాస్త మజ్జిగ, నిండుగా నిమ్మఆకులు కానీ దబ్బ ఆకులు కానీ వేస్తే అది తోరణి లేదా తర్వాణి అవుతుంది. పూరీజగన్నాథుని సన్నిదిలో దొరికే ఈ ప్రసాదానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ అన్నాన్నే రైతోడి అన్నం అని, అలబొద్దు అనీ అంటారు. కంచుమట్టు గిన్నెల్లో తింటారు.
అసిస్టెంట్ దోసెలు..
కావాల్సినవి:అన్నం - మూడు కప్పులు, పెరుగు - 50గ్రా, ఉప్పు, నూనె - తగినంత, ఉల్లిపాయ- సగం
తయారీ: అన్నం, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయముక్కలని మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు కూడా కలుపుకొని జారుగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి. దోసెలపిండి సిద్ధం. దీంతో కరకరలాడే రుచికరమైన దోసెలని వేసుకోవచ్చు.
సద్ది ఇడ్లీలు..
కావాల్సినవి: అన్నం - కప్పు, అటుకులు - పావుకప్పు, బొంబాయి రవ్వ- కప్పు, పెరుగు- కప్పు, ఈనో ఫ్రూట్ సాల్ట్- రెండు చెంచాలు, ఉప్పు, నూనె- తగినంత
తయారీ:అన్నం, అటుకులు, రవ్వ, పెరుగు వీటన్నింటిని తగినంత ఉప్పు వేసి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత రుబ్బి మరో పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. గరిటెతో కలిపి చివరిగా ఈనో సాల్ట్ వేసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. కొబ్బరి చట్నీతో రుచిగా ఉంటాయి.
సద్ది జంతికలు
కావాల్సినవి: అన్నం - కప్పు, బియ్యప్పిండి - అరకప్పుపైన చెంచా, సెనగపిండి - పావుకప్పుపైన చెంచా, పసుపు- కొద్దిగా, కారం- అరచెంచా, ఉప్పు- తగినంత, ఇంగువ- తగినంత, జీలకర్ర - అరచెంచా, నువ్వులు- చెంచా, వెన్న- రెండు చెంచాలు
తయారీ:ముందుగా మిక్సీలో అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్‌కి సెనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇంగువ, నువ్వులు, జీలకర్ర కూడా కలుపుకొని చివరిగా వెన్న కలుపుకొంటే జంతికలు వేసుకోవడానికి అనువైన మెత్తని జంతికల పిండి సిద్ధమైపోతుంది. వీటితో చేసిన జంతికలు చాలా రుచిగా ఉంటాయి.