తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజల మధ్య అంతరాల గోడ కూలేదెన్నడు?

ప్రజల మధ్య అసమానతలను తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించాలని ప్రపంచదేశాలు నిర్ణయించాయి. కానీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వీటిని అటకెక్కించాయి. ఆరంభంలో కనబరిచిన చిత్తశుద్ధి తర్వాత సన్నగిల్లిపోయింది. అంతర్జాతీయంగా ఐక్యత, సామరస్యాలు లోపిస్తున్నాయి. అభివృద్ధి దిశగా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పయనిస్తాయా అన్నది సందేహంలో పడింది.

wall of Inequality
సుస్థిరాభివృద్ధి

By

Published : Aug 4, 2020, 7:17 AM IST

అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న అసమానతల గురించి 2005లో ఐక్యరాజ్య సమితిలో చర్చించాయి. 2030నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) సాధించడం ద్వారా ఆకలి, పేదరికం, అసమానతలను అధిగమించాలని ప్రపంచ నాయకులు తీర్మానించారు. ఆ లక్ష్యాల సాధనకు ఆరంభంలో కనబరచిన చిత్తశుద్ధి తరవాత సన్నగిల్లిపోవడం శోచనీయం. ఇందుకు కారణాలనేకం.

బ్రెగ్జిట్‌, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలన్న ట్రంప్‌ నిర్ణయం, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా తెచ్చిపెట్టిన చమురు ధరల పతనం, చైనా నుంచి కొవిడ్‌ వైరస్‌ విస్తరణ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా నిష్క్రమణలతో ప్రపంచానికి సమర్థ నాయకత్వం కొరవడిందనే వాస్తవం కళ్లకు కడుతోంది. అంతర్జాతీయంగా ఐక్యత, సామరస్యాలు లోపిస్తున్నాయి. అభివృద్ధి దిశగా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పయనిస్తాయా అన్నది సందేహంలో పడింది.

అసమానతలే శాపం

ప్రతి దేశంలో అసమానతలతోపాటు, దేశాలమధ్య అసమానతలనూ తగ్గించాలని ఎస్‌డీజీలలోని పదో లక్ష్యం నిర్దేశిస్తోంది. పదేళ్లలో ప్రపంచం అసాధారణ రీతిలో అభివృద్ధి సాధించినా, అసమానతల నిర్మూలనకు కొన్ని విస్తృత మార్పులు అడ్డుపడ్డాయి. 1990 తరవాత నుంచి భారత్‌, చైనాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆదాయపరమైన అసమానతలు పెరిగాయి. ఇక అల్పాదాయ, మధ్యాదాయ దేశాల సంగతి వేరే చెప్పేదేముంది? అసమానతలు తీవ్రంగా ఉన్న దేశాల్లోనే 71శాతం ప్రపంచ జనాభా నివసిస్తోంది.

లాటిన్‌ అమెరికా, కరీబియన్‌, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఆదాయాలు కొంత మెరుగుపడినా, ప్రపంచ జనాభాలో ఒక్క శాతం అతి సంపన్నులకే ప్రపంచ సంపదలో అత్యధిక వాటా చేరిపోతోంది. 1990లో ఈ ధోరణి 46 దేశాల్లో కనిపిస్తే, 2015 వచ్చేసరికి మొత్తం 57 దేశాలకు పాకింది. గణాంకాలు అందుబాటులో ఉన్న 92 దేశాల్లో అట్టడుగున ఉన్న 40శాతం పేదలకు దక్కుతున్న ఆదాయం 25శాతం లోపే. చైనాతోపాటు కొన్ని ఆసియా దేశాల్లో అధిక ఆర్థికాభివృద్ధి నమోదు కావడంతో అక్కడ మాత్రం పేదరికం స్థాయులు తగ్గాయి.

ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్ల వల్ల వర్ధమాన దేశాల్లోనూ విద్య, ఆరోగ్య, ఆర్థిక సేవలు సులువుగా అందుబాటులోకి రావడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడే అంశమే కానీ- ఈ ఆధునిక సాంకేతికతలు పేదలకు పెద్దగా అందుబాటులో లేవు. సంపన్న దేశాల్లో 87 శాతం జనాభాకు నెట్‌, స్మార్ట్‌ఫోన్లు ఉంటే, అల్పాదాయ దేశాల్లో కనీసం 19 శాతం ప్రజలకైనా అవి లభ్యం కావడం లేదు. యువజనులు వాడినంత విస్తృతంగా పెద్దవయసువారు ఆధునిక సాంకేతికతలను వినియోగించరు. ఈ విధంగా పేదలు, ధనికులు, యువజనులు, పెద్ద వయసువారి మధ్య డిజిటల్‌ అగాధం ఏర్పడటం అభివృద్ధిలో అంతరాలను తీవ్రతరం చేస్తోంది.

ఇటువంటి విస్తృత ధోరణులను సమన్వయపరచకపోతే అసమానతలను తగ్గించి ఎస్‌డీజీలను అందుకోవడం కష్టం. అలాగని సాంకేతిక మార్పులను, పట్టణీకరణను, వలసలను నిరోధిస్తే అసలు అభివృద్ధి రథం ముందుకే కదలదు. కొత్త సాంకేతికతలతో అన్ని వర్గాలూ పురోగమించేట్లు జాగ్రత్తపడితే ఎస్‌డీజీలను వేగంగా అందుకోగలుగుతాం.

పేదలకే అన్ని పాట్లు

వాతావరణ మార్పులవల్ల ఎక్కువగా నష్టపోయేది పేదలే. శిలాజ ఇంధనాల నుంచి హరిత సాంకేతికతలకు మారేటప్పుడు పేదల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుంటే అసమానతలను నివారించవచ్చు. కొత్త సాంకేతికతలు సంపన్నులను మరింత సంపన్నులు చేయడానికి పరిమితం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అధునాతన సాంకేతికతలు విస్తృత ఉపాధి కల్పనకు, పేదరిక నిర్మూలనకు దారితీసేట్లుగా తగిన విధానాలు రూపొందించడం ప్రభుత్వాల బాధ్యత.

పట్టణాలు, గ్రామాల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందరికీ నాణ్యమైన విద్య అందిస్తే ఉపాధి అవకాశాల్లో సమాన వాటా దక్కుతుంది. పాత టెక్నాలజీలు సృష్టించిన ఉద్యోగాల్లో అనేకం కొత్తవాటి రాకతో ఊడిపోతున్నా, ప్రత్యామ్నాయాల సృష్టిలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అసంఘటిత రంగంలో, ఒప్పందాలపై పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకు రక్షణ కల్పించకపోతే ఆదాయ అసమానతలు మరింత విస్తృతమవుతాయి.

విధాన చట్రం ముఖ్యం

ఆదాయ అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వాల ఆర్థిక విధానాలు రూపొందాలి. సామాజిక భద్రతకు కావలసిన నిధులను సమీకరించడానికి ఆ విధానాలు తోడ్పడాలి. పన్ను వసూళ్లు, వివిధ పద్దులకు నిధుల కేటాయింపులను సమానత్వ సాధన దృష్టితో చేపట్టాలి. నిరుద్యోగ భృతి, దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు, బాలల సంక్షేమం, ఆరోగ్య సేవల వంటి సామాజిక భద్రతా ఏర్పాట్లు పేదరిక నిర్మూలనకు, ఎస్‌డీజీల సాధనకు ఎంతగానో తోడ్పడతాయి.

కానీ, 2017లో కేవలం 29శాతం ప్రపంచ జనాభాకు మాత్రమే సామాజిక భద్రత అందిందని తెలుసుకుంటే, జరగాల్సింది ఎంతో ఉందని అవగతమవుతుంది. సమసమాజ నిర్మాణం కోసం ఏ దేశానికి ఆ దేశమే కాకుండా, అన్ని దేశాలూ కలిసికట్టుగా నడుం బిగించాలి. వాతావరణ మార్పులు, వలసలపైనా ప్రపంచ దేశాలది తలో దారి అయితే పని జరగదు. సంపన్న దేశాలు శిలాజ ఇంధనాలను అతిగా వాడటంవల్ల వాతావరణ కాలుష్యం, తుపానులు, వరదలు, ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విస్తృత సమస్యలను అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పరిష్కరించాలి తప్ప- ఏ దేశం ఒంటి చేత్తో అధిగమించలేదు.

పన్ను ఎగవేతదారులు అక్రమ ధనాన్ని ఎల్లలు దాటిస్తుంటారు. ఉగ్రవాదులకు నిధులు దేశదేశాల నుంచి వస్తుంటాయి. మేధాహక్కుల చౌర్యం విజృంభిస్తోంది. వీటిని నియంత్రించాలంటే ప్రపంచ దేశాలు చేయీ చేయీ కలపాల్సిందే. దీనికి బహుళ దేశ సంస్థలు, అంతర్జాతీయ వేదికలు గొప్ప సాధనాలవుతాయి. ఇప్పుడు జరుగుతోంది అందుకు భిన్నం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమించిన ట్రంప్‌ సర్కారు ప్రపంచ వాణిజ్యసంస్థపైనా నిందలు మోపుతోంది. బహుళదేశ సంస్థల్లో లోపాలు ఉండవచ్చు కానీ, వాటిని చక్కదిద్ది గాడిన పెట్టాలే తప్ప- మొత్తంగా బుట్టదాఖలు చేయకూడదు.

కరోనా, ఆర్థిక మందగమనాలను సమర్థంగా ఎదుర్కొని సుస్థిరాభివృద్ధి సాధించడానికి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. అభివృద్ధి రేటు పెంచుకుంటున్న వర్ధమాన దేశాలతోపాటు పేద దేశాల వాణీ వినిపించాలంటే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో బహుళదేశ సంస్థలు చాలా అవసరం. పర్యావరణ, ఆర్థిక, సామాజిక సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ చేపడితే ఎస్‌డీజీలను అందుకోవడం సుసాధ్యమవుతుంది. ఈ కృషిలో ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికల్లో చర్చించుకొంటూ, లోపాలు సవరించుకుంటూ ముందుకు సాగాలి. ఈ అవగాహన అన్ని దేశాల్లో సమానంగా ఇంకలేదు. ఈ పరిస్థితి మారాలి. అసమానతలు, అభద్రతలు ఇప్పటికీ కొనసాగడానికి ప్రస్తుత విధానాలు, వాటి అమలులోని లోపాలే కారణం. ఆ లోపాలను సరిదిద్ది 2030కల్లా ఎస్‌డీజీలను సాధించడానికి నూతన విధానాలను రూపొందించుకోవడం తక్షణావసరం!

(రచయిత- పరిటాల పురుషోత్తం, సామాజిక ఆర్థిక విశ్లేషకులు)

ABOUT THE AUTHOR

...view details