ప్రస్తుతం దేశంలో 80శాతం తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాం. అరవైశాతం మేర సేద్యానికీ భూమి లోపలి పొరల్లోని నీటి ఊటే దిక్కు. అటువంటి భూగర్భ జలాల్లో అయిదోవంతు దాకా ఆర్సెనిక్‌తో విషతుల్యమయ్యాయన్న తాజా సమాచారం దిగ్భ్రాంతపరుస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఐఐటీ ఖరగ్‌పూర్ చేపట్టిన అధ్యయన ఫలితాల ప్రకారం, 25కోట్ల మందికి పైగా ప్రాణాలకిప్పుడు పెనుముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా పంజాబ్, బిహార్, పశ్చిమ్ బంగ, అసోం, హరియాణా, యూపీ, గుజరాత్ వంటి చోట్ల ఆర్సెనిక్ కోరలు చాస్తున్నదన్నది నివేదిక సారాంశం. నాలుగు నెలల క్రితం 'జియో సైన్స్ ఫ్రాంటియర్స్'లో ప్రచురితమైన మరో కథనం ఇంకా భయానక పరిస్థితిని ఆవిష్కరించింది.
మోతాదుకు మించి..
దేశంలోని 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషపూరితమయ్యాయని, పర్యవసానంగా వివిధ క్యాన్సర్లు సహా రకరకాల రుగ్మతలు రెచ్చిపోయే వాతావరణం తిష్ఠ వేసిందని ఆ అధ్యయనం వెల్లడించింది. మూడేళ్ల క్రితం డ్యూక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో దేశీయంగా 16 రాష్ట్రాల్లో మోతాదుకు మించిన యురేనియంతో జలాలు ప్రాణాంతకంగా మారినట్లు స్పష్టమైంది. ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ కలగలిసిన నీటిని 19శాతం భారతీయులు తాగుతున్నట్లు లోగడ లోక్‌సభాముఖంగా నిర్ధారించిన ప్రభుత్వం తదుపరి కార్యాచరణను గాలికొదిలేయడంతో సంక్షోభం తీవ్రతరమైందని సరికొత్త అధ్యయనాలు నిక్కచ్చిగా ధ్రువీకరిస్తున్నాయి. గొంతు తడుపుకోవడానికి కలుషిత నీటినే సేవించక తప్పని కోట్లాది భారతీయుల దుస్సహ దుస్థితి, రోగగ్రస్త భారతావనిగా పరిహాస భాజనమయ్యేలా అవ్యవస్థను శాశ్వతీకరిస్తోంది!
తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం
70శాతం కలుషితమే..
సుమారు ఏడు దశాబ్దాల స్వపరిపాలన తరవాతా దేశ పౌరులందరికీ తాగునీటి లభ్యత ఎండమావినే తలపిస్తుండటం సిగ్గుచేటు. 122 దేశాలకు చెందిన జల నాణ్యత నివేదికలో ఇండియా అట్టడుగు వరసన నూట ఇరవయ్యో స్థానానికి పరిమితమై అలమటిస్తోంది. ఇక్కడ సరఫరా అవుతున్న జలాల్లో 70శాతం దాకా కలుషితమైనవేనని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి నిగ్గుతేల్చింది. అత్యుత్తమ జీవనప్రమాణాల పరికల్పన మాట దేవుడెరుగు- అందరికీ కనీసం తాగునీరైనా తగినంత అందించలేక ప్రభుత్వాలు చతికిలపడుతున్నాయి.
ఫ్లోరైడ్ కోరలు..
దేశానికి స్వాతంత్య్రం లభించేటప్పటికి ఉన్న 'తలసరి నీటి లభ్యత' నేడు నాలుగో వంతుకు కుంగిపోయింది. ఒకప్పుడు బావుల్లో నీరు ఊరినంత మేర చేదలతో తోడి వాడుకునేవారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నామన్న వెర్రి భ్రమలో పడి మోటార్ ఇంజిన్ల విచ్చలవిడి వాడకం ముమ్మరించి ఏడో దశకం నుంచే భూగర్భ జలాల్ని ఎడాపెడా తోడేసే ధోరణులు ప్రబలాయి. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో బోరుబావులు నేలతల్లి కడుపులోని జలరాశిని విచక్షణారహితంగా వెలికి తీసేస్తున్న కారణంగా 160 జిల్లాల్లో భూగర్భంలోని నీరు ఉప్పు నీటిమయమైపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు 230 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్యకు కోరలు మొలుచుకొచ్చాయి. ఎక్కడికక్కడ నీటిమట్టాలు అడుగంటేకొద్దీ ఆర్సెనిక్, నైట్రేట్, క్రోమియం, సీసం, యురేనియం వంటివి పైకి తేలుతూ మరింత గడ్డు పరిస్థితుల్ని కళ్లకు కడుతున్నాయి. అవి పోటాపోటీగా ఉనికిని చాటుకునేకొద్దీ ప్రజారోగ్యానికి తూట్లు పడే వేగం జోరందుకుంటోంది.