కరోనా విజృంభిస్తున్న వేళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్లకు విపరీత డిమాండు ఏర్పడింది. మన దేశంలో వీటిని పెద్దఎత్తున తయారుచేయడానికి ప్రముఖ వైద్య, సాంకేతిక సంస్థలు పోటీపడుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో వీటిని తయారుచేసే కసరత్తు మొదలైంది. కరోనా వైరస్‌తో ప్రధానంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగి రోగి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ క్రమంలో బాధితుల్లో 3% మందికి కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లు ప్రాణావసరాలుగా మారాయి.
దేశంలో ఇదీ పరిస్థితి..
- * కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు దాదాపు 60 వేలు.
- * ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 వేల లోపే ఉండగా.., మిగతావి ప్రైవేటు రంగంలో ఉన్నాయి.
- * ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణం 1.10-2.20 లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంటుందని అంచనా.
- * విదేశాల నుంచి విడిభాగాల దిగుమతిలో ఇబ్బంది లేకుంటే దేశంలో నెలకు గరిష్ఠంగా 5,500 వరకు ఉత్పత్తి చేయొచ్చు.
- * దేశీయంగా ఫిబ్రవరిలో 2,700, మార్చిలో 5,580 వెంటిలేటర్లు తయారయ్యాయి.
- * మే నాటికి నెలకు 50 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- * భారత్‌లో తయారవుతున్న సాధారణ వెంటిలేటర్ ధర రూ.5-7 లక్షల వరకు ఉంటుంది. దిగుమతి చేసుకునే వాటి ధర రూ.11-18 లక్షలు ఉంటోంది.
2 రకాలు
వెంటిలేటర్లలో రెండు రకాలున్నాయి. మైక్రోప్రాసెసర్ ఆధారిత మూడోతరం వెంటిలేటర్లను ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. అలానే ‘ఆర్టిఫీషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్’ లేక ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ వెంటిలేటర్లు కూడా అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి. అంబూ బ్యాగ్ వెంటిలేటర్లనీ పిలిచే వీటి ధర తక్కువే. ఈ పరికరంలోని సంచిని 5-6 సెకన్లకు ఒకసారి వేళ్లతో ఒత్తడం ద్వారా... రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. ఇవి యాంత్రికంగా పనిచేసేందుకు కంప్రెషర్ యంత్రాలూ అందుబాటులోకి వచ్చాయి.
ప్రసిద్ధ సంస్థల ముందడుగు
- * స్కాన్‌రే సంస్థతో బీఈఎల్, బీహెచ్‌ఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రాలు జతకూడాయి. స్కాన్‌రే నెలకు 2 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయగలదు. దాన్ని మే ఆఖరుకు 30వేల సామర్థ్యానికి తీసుకెళ్లనున్నారు.
- * మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సైతం అగ్‌వా హెల్త్‌కేర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం అగ్‌వా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 400 యూనిట్ల నుంచి 10వేల యూనిట్లకు పెంచడానికి కృషి జరుగుతోంది.
తక్కువ ఖర్చు.. వేగంగా తయారీ
ఈ సంక్షోభ సమయంలో తామున్నామంటూ డీఆర్‌డీఓ, భారతీయ రైల్వే సహా దేశంలోని వివిధ సాంకేతిక, వైద్య, విద్యా సంస్థలు రంగంలోకి దిగాయి. ఆధునాతన పరిజ్ఞానాలను జోడించి వెంటిలేటర్ల తయారీకి నమూనాలు తయారుచేశాయి. ‘‘తక్కువ ఖర్చు- వేగంగా తయారీ’’ లక్ష్యంగా మేధోమథనం సాగించాయి. తక్కువలో తక్కువగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో వీటి తయారీకి పలు నమూనాలు సిద్ధం కాగా.. కొన్ని సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి.
బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్లూ...
- * శ్రీచిత్ర తిరునాల్ వైద్య సంస్థ(ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) అంబూబ్యాగ్ విధానంలో వెంటిలేటర్ నమూనాను రూపొందించింది. భారత ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ విభాగం ఆమోదంతో వీటి ఉత్పత్తికి బెంగళూరులోని విప్రో 3డీ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
- * హైదరాబాద్‌కు చెందిన నెక్స్ట్ బైట్ సంస్థ అంబూబ్యాగ్ యూనిట్‌ని నిర్వహించేందుకు విద్యుత్తు ఆధారిత పరికరాన్ని తయారు చేసింది. దీని ధర రూ.4 వేలు.
- * చండీగఢ్ పీజీఐఎంఆర్‌లో సహాయ ఆచార్యుడు రాజీవ్ చౌహాన్ కూడా ఇదే తరహాలో అంబూబ్యాగ్‌ని పనిచేయించే ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించారు.
- * ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సైతం రూ.7,500 ధరలో అంబూబ్యాగ్ వెంటిలేటర్ తయారీకి నమూనా తయారు చేసింది.