తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహమ్మారిపై మిశ్రమ వ్యూహం.. ఫలించేనా? - వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ ఎంతమేరకు పనిచేస్తుంది?

వ్యాక్సినేషన్​​తో సంబంధం లేకుండా వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్​కి అడ్డుకట్ట వేయాలంటే వేర్వేరు కరోనా టీకాలను కలిపి (వ్యాక్సిన్‌ మిక్సింగ్‌) ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిశ్రమ టీకాలతో పాటు.. బూస్టర్ డోసు అవసరం ఎంతన్నది తేలాల్సి ఉంది.

మహమ్మారిపై మిశ్రమ వ్యూహం.. ఫలించేనా?

By

Published : Aug 3, 2021, 5:05 AM IST

కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందన్న సంబరాన్ని నీరుగారుస్తూ ప్రపంచవ్యాప్తంగా డెల్టా కేసులు పెచ్చుమీరుతున్నాయి. కరోనా వైరస్‌ డెల్టా రకంగా ఉత్పరివర్తన చెంది అమెరికా, చైనా, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల్లో మళ్లీ ఆంక్షల విధింపు ఘట్టాలకు తెర తీస్తోంది. డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందే తప్ప, అది ప్రాణాంతకం కాదని, అందుబాటులోని టీకాలు దానిపై సమర్థంగా పనిచేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా ఇస్తోంది. అయితే టీకాలు వేసుకోనివారిలో డెల్టా ఉద్ధృతంగా వ్యాపిస్తున్నకొద్దీ వైరస్‌ వేగంగా రూపాంతరం చెంది కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇప్పుడున్న టీకాల సామర్థ్యం కొన్ని నెలల తరవాత తగ్గిపోతుంది కాబట్టి వేర్వేరు టీకాలను కలిపి వాడితే ఎక్కువ కాలం రక్షణ లభిస్తుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ప్రయోగశాలలో ఈ మిశ్రమ టీకాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా, అవి వాస్తవ ప్రపంచంలో అంతే సమర్థంగా పనిచేస్తాయా, దుష్పలితాలు ఏమీ ఉండవా అన్నది నిగ్గుతేలాలి.

కనిపించని దుష్ఫలితాలు..

పూర్వాశ్రమంలో శాస్త్రజ్ఞురాలైన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఆంగెలా మెర్కెల్‌ మొదట ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) డోసు తీసుకున్నారు. రెండో డోసుగా ఆమె మోడెర్నా టీకా తీసుకోవడం అంతటా ఆసక్తి రేపుతోంది. ఇటలీ ప్రధానమంత్రి మరియో ద్రాఘి సైతం మొదట ఆస్ట్రాజెనెకా, తరవాత ఫైజర్‌-బయాన్‌ టెక్‌ టీకా వేయించుకున్నారు. అమెరికా టీకా కార్యక్రమంలో కొన్నిచోట్ల మోడెర్నా, ఫైజర్‌లను ఇలా మార్చి మార్చి వాడారు. మొదటి డోసుగా మోడెర్నా టీకా వాడినవారికి రెండో డోసుకు అదే టీకా లభ్యం కాకపోతే, ఫైజర్‌ను ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనివల్ల దుష్ఫలితాలేమీ కనిపించలేదు. రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ టీకా మొదటి, రెండో డోసుల్లో వేర్వేరు ఎడినోవైరస్‌లను వాడతారు. దీంతోనూ దుష్ఫలితాలు ఎదురవలేదు. ఇండియాలోనూ కొంతమందికి మొదట కొవిషీల్డ్‌ ఇచ్చి, తరవాత పొరపాటున రెండో డోసుగా కోవాక్సిన్‌ ఇచ్చిన కేసులు వెలుగుచూశాయి. ఆ సందర్భాల్లోనూ దుష్పలితాలు చోటుచేసుకున్నట్లు వెల్లడికాలేదు. దీంతో టీకా మిశ్రమంపై పరిశోధన జరపాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణులు సిఫార్సు చేశారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన క్రిస్టియన్‌ వైద్య కళాశాల 300 మంది ఆరోగ్యవంతులపై టీకా మిశ్రమాన్ని ప్రయోగించి చూడబోతోంది. పాశ్చాత్య దేశాల్లో ఆస్ట్రాజెనెకా-ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా-మోడెర్నా మిశ్రమాలపై జరిగిన ప్రయోగాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఆస్ట్రాజెనెకా-స్పుత్నిక్‌ మిశ్రమమూ సమర్థమేనని వార్తలు వచ్చాయి. టీకాల మిశ్రమంపై ఇంకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరించారు.

పాశ్చాత్య దేశాల జనాభాలో వృద్ధుల సంఖ్య ఎక్కువ. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా తీసుకున్నప్పుడు దాని సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేదు. రెండో డోసు తీసుకున్నాక సామర్థ్యం పెరిగినా- అది ఫైజర్‌, మోడెర్నా టీకాలకు దీటుగా లేదు. ఆస్ట్రాజెనెకా రెండు డోసుల్లోనూ చింపాంజీ ఎడెనోవైరస్‌ను వాడటం దీనికి కారణమై ఉండవచ్చు. ఫైజర్‌, మోడెర్నాలు ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో తయారవుతాయి. స్పుత్నిక్‌ రెండు డోసుల్లో వేర్వేరు మానవ ఎడెనోవైరస్‌ (5, 26) వెక్టర్లను వాడినందువల్ల టీకా సామర్థ్యం తగ్గలేదు. అందుకే ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌ టీకాల మిశ్రమం ఆశాజనక ఫలితాలిస్తోంది. భారత్‌లో ఫైజర్‌, మోడెర్నా టీకాలు అందుబాటులోకి రాగానే, వాటిలో ఏదో ఒక దాన్ని రెండో డోసుగా తీసుకోవాలని ఉన్నతాదాయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కొవాక్సిన్‌ టీకా పలు యాంటిజెన్లను సృష్టించి వివిధ కరోనా వేరియంట్లను సమర్థంగా అడ్డుకోగలుగుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొవిషీల్డ్‌కు చింపాంజీ ఎడెనో వైరస్‌ను ఉపయోగిస్తే, కొవాక్సిన్‌ మృత కరోనా వైరస్‌ భాగాలతో తయారైంది. రెండూ వేర్వేరు మార్గాల్లో పనిచేస్తాయి వీటి మిశ్రమం కరోనాను దీటుగా అడ్డుకోగలుగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.

పరిశీలిస్తున్న ప్రభుత్వం..

అమెరికాతోపాటు ఐరోపా దేశాలు సైతం బూస్టర్‌ డోసుకు ఆమోదం తెలపకపోయినా, వృద్ధ పౌరులకు మూడో డోసు ఇచ్చే కార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌ ఇప్పటికే చేపట్టింది. రెండు డోసులు ఇచ్చిన తరవాత బూస్టర్‌ డోసు ఇస్తున్న దేశం ప్రపంచంలో ఇజ్రాయెల్‌ ఒక్కటే. కాలం గడిచే కొద్దీ టీకా సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి బూస్టర్‌ డోసు అవసరమని ఆ దేశం భావిస్తోంది. 60 ఏళ్లు పైబడినవారిలో రోగనిరోధక శక్తి కొంత తగ్గుతుంది కాబట్టి, వారికి ప్రాధాన్య ప్రాతిపదికపై బూస్టర్‌ డోసులు వేస్తోంది. 93 లక్షల ఇజ్రాయెల్‌ జనాభాలో 57 శాతానికి రెండు డోసుల ఫైజర్‌ టీకాలు పడ్డాయి. 40 ఏళ్లుపైబడిన జనాభాలో 80 శాతానికి రెండు డోసులూ వేశారు. అయినా, ఇటీవలి కాలంలో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. జనవరిలో టీకాలు వేసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినట్లు తేలడంతో ఇజ్రాయెల్‌ సర్కారు వయోధికులకు బూస్టర్‌ డోసులివ్వడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్‌ అనుభవం చూశాక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే దీర్ఘకాల రోగులకు బూస్టర్‌ డోసులు ఇవ్వాలని అమెరికన్‌ నిపుణులు సిఫార్సు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, లుకేమియా, కీళ్లవాతంతో బాధపడుతున్నవారికి, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అమెరికా జనాభాలో మూడు శాతం ఈ కోవకు చెందుతారు. వీరికి బూస్టర్‌ డోసు ఇచ్చే అంశాన్ని సీడీసీ చురుగ్గా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకాల మిశ్రమం, బూస్టర్‌ డోసుల విషయంలో ప్రపంచ దేశాల అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.

బూస్టర్‌ డోసుపైనా చర్చ..

టీకా మిశ్రమంపై ఒకవైపు పూర్తి స్పష్టత రావాల్సి ఉండగా, రెండో వైపు బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై చర్చ పుంజుకొంటోంది. డెల్టా, లాంబ్డా వంటి కరోనా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నా, ప్రస్తుతానికి మూడో డోసు(బూస్టర్‌) అవసరం లేదని అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. రెండు డోసులు తీసుకున్నవారికి కొవిడ్‌ వల్ల మరణించే ప్రమాదం, ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు బాగా తక్కువ కాబట్టి- ఇప్పుడప్పుడే బూస్టర్‌ డోసు అక్కర్లేదని వివరించింది. బూస్టర్‌ డోసుకు అనుమతి కోరిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీలకు ఈ విషయం స్పష్టం చేసింది. ఇంతలో ఆ రెండు కంపెనీలు ప్రత్యేకంగా డెల్టా వేరియంట్‌ పైనే పనిచేసే టీకాల రూపకల్పనను ముమ్మరం చేస్తున్నాయి. ఈ ఏడాది చివరకే మానవులపై ప్రయోగాలు మొదలుపెడతామంటున్నాయి.

- వరప్రసాద్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details