తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Vaccination: రెండు డోసుల వ్యాక్సిన్​తోనే.. భారతావనికి శ్రీరామరక్ష! - భారత్​లో వ్యాక్సినేషన్ ప్రక్రియ

అమెరికాను మించి కరోనా డోసులు(Coronavaccine) పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే.. నిపుణుల వాదన మాత్రం మరోలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో(Vaccination in India) వేగం పెరగాలని.. అప్పుడే దేశ జనాభా కరోనా మహమ్మారి(Corona Pandemic) నుంచి పూర్తి రక్షణ పొందుతుందని వారంటున్నారు.

vaccination process
vaccination process

By

Published : Sep 15, 2021, 5:45 AM IST

Updated : Sep 15, 2021, 7:06 AM IST

కోర సాచిన మహమ్మారి వైరస్‌పై(Corona Pandemic) విశ్వమానవాళి కొన్ని నెలలుగా మహాయుద్ధమే కొనసాగిస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా టీకాస్త్ర ప్రయోగంలో(Vaccination in India) భారత్‌ రికార్డు అనితర సాధ్యమని కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు మన్‌సుఖ్‌ మాండవీయ తాజా ప్రకటన చాటుతోంది. జనాభా ప్రాతిపదికన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మనది. ఎన్నో సమస్యలకు అదనంగా దాపురించిన కొవిడ్‌ ప్రజ్వలనాన్ని(Covid-19) ఎదుర్కొంటూ ఎనిమిది నెలల్లో 75కోట్లకు మించి టీకా మోతాదులు వేయడం ఎన్నదగ్గ పరిణామమే. తొలినాళ్లతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకొందన్నదీ యథార్థమే. జనవరి పదహారో తేదీన మొదలైన కొవిడ్‌ టీకాల కార్యక్రమంలో తొలి పదికోట్ల డోసుల మైలురాయి చేరడానికి 85 రోజులు పట్టింది. అదే, 65కోట్ల నుంచి 75 కోట్లకు కేవలం 13 రోజుల వ్యవధిలోనే చేరగలిగారు. సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా, దాద్రా-నాగర్‌హవేలీ, లద్దాఖ్‌, లక్షద్వీప్‌లలోని వయోజనులందరికీ కనీసం ఒక్క డోసైనా వేయగలిగామన్న మంత్రివర్యుల ప్రకటనే- దేశంలో మరెన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ స్థాయికి చేరాల్సి ఉందో చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుత వేగం కొనసాగితే డిసెంబరు నాటికి 43శాతం జనాభాకు రెండు మోతాదులూ అందుతాయంటున్నారు. అంటే, అప్పటికింకా దేశంలో సగానికిపైగా ప్రజానీకం కొవిడ్‌ టీకా(Corona Vaccine) రూపేణా రక్షణ భాగ్యం పొందడానికి నిరీక్షిస్తూనే ఉంటారు! ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇంతవరకు రెండు డోసుల టీకాలు(Vaccine doses) పొందినవారు జనసంఖ్యలో 14 శాతమే. ఈ లెక్కన పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ భద్రతకు నోచనివారి సంఖ్య- అంతకు ఆరింతలు. స్థూలకాయం, గుండెజబ్బులు తదితర సమస్యలు కలిగిన 12-17 ఏళ్ల వయసు పిల్లలకు టీకాలు అక్టోబర్‌-నవంబర్లలో ఆరంభం కానున్నాయంటున్నారు. చురుగ్గా సాధించాల్సింది మరెంతో ఉందన్న వివేచనతో యావత్‌ అధికార యంత్రాంగం కదం తొక్కాల్సిన పరీక్షా ఘట్టమిది.

ప్రతి వందమంది పౌరుల్లో సంపూర్ణంగా వ్యాక్సిన్‌(Covid Vaccine) రక్షణ పొందినవారెందరని ఆరాతీస్తే- ఇజ్రాయెల్‌, యూకే, అమెరికా, జర్మనీ వంటివి మనకన్నా యోజనాల దూరం ముందున్నాయి. యూఏఈ, ఉరుగ్వే, సింగపూర్‌, ఫ్రాన్స్‌ వంటివీ ఎంతో మెరుగ్గా రాణిస్తున్నాయి. కనిష్ఠ వ్యవధిలో గరిష్ఠ జన బాహుళ్యానికి టీకాలు పంపిణీ చేయగలిగితేనే పౌరసమాజానికి పటిష్ఠ రక్షణ ఛత్రం సమకూర్చినట్లవుతుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారిలో యాంటీబాడీల శాతం, రోగనిరోధకత ఇనుమడిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌ సోకినా ప్రాణాలకు ముప్పు కనిష్ఠ స్థాయికి పరిమితం కావాలన్నా, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా అడ్డుకోవాలన్నా రెండు మోతాదుల టీకాలు వేయించుకోవడం అత్యవసరమనీ అవి స్పష్టీకరిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాల కార్యాచరణ పదునుతేలాలి! గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 27వేల కొవిడ్‌ కేసులలో 15వేల దాకా కేరళకు చెందినవే. కేరళ, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి.

తక్కిన రాష్ట్రాలకన్నా మెరుగైన స్వాస్థ్య వ్యవస్థ కలిగిన కేరళ, కొవిడ్‌ సంక్షోభ తీవ్రతను ముందుగానే గుర్తించి అప్రమత్తమైంది. వ్యాక్సిన్‌ వృథా నివారణలో ప్రధాని మోదీ(PM Modi) ప్రత్యేక ప్రశంసలూ అందుకుంది. అటువంటి చోట కొత్త కేసులు ఇంతగా జోరెత్తడం వ్యాకులపరుస్తోంది. మూడున్నర కోట్లకు పైబడిన కేరళ జనాభాలో రెండో మోతాదు కొవిడ్‌ టీకా పొందినవారి సంఖ్య 90 లక్షలు. మూడొంతుల మంది సంపూర్ణ వ్యాక్సిన్‌ రక్షణ పొందకపోవడం, జనసాంద్రత, వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకురావడం.. కేరళనిప్పుడు కుంగదీస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ అటువంటి లక్షణాలే పొటమరిస్తున్నాయి. మూడో ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే డిసెంబరు నాటికి కనీసం 60శాతం దేశ జనాభాకు రెండు డోసులూ అందాలన్న అంచనాల ప్రకారం- ప్రస్తుత రోజువారీ సగటు 74లక్షల వేగం సరిపోదు. ఇకమీదట అనుదినం 1.2కోట్ల మందికి టీకాలు వేయగలిగితేనే జాతికి సాంత్వన దక్కుతుంది. అంతటితో ఆగకుండా దేశ పౌరులందరికీ రెండు దఫాల టీకాలు వేసేదాకా వ్యాక్సినేషన్‌(Covid Vaccination) కార్యక్రమాన్ని అవిశ్రాంతంగా కొనసాగించడమే భారతావనికి శ్రీరామరక్ష అవుతుంది!

ఇవీ చదవండి:

Last Updated : Sep 15, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details