తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అంతులేని యుద్ధాలకు బైడెన్ స్వస్తి చెబుతారా! - అమెరికా యుద్దాలు

అగ్రరాజ్యంపై 9/11 ఉగ్రదాడుల తర్వాత ప్రతీకార యుద్ధాలకు దిగింది అమెరికా. ఇరవైఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధాల్లో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఖర్చుకు తగిన ఫలితమూ దక్కలేదు. విదేశాల్లోని అమెరికా సైనికులను వెనక్కు రప్పిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హామీ ఇచ్చినా.. ఆయన తీసుకున్న నిర్ణయాలు వైరాలను మరింత పెంచాయి. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్​పైనే శాంతి కాముకులు ఆశలు పెట్టుకున్నారు.

will-bidens-presidency-be-a-blessing-for-war-torn-world
అంతులేని యుద్ధాలకు బైడెన్ స్వస్తి చెబుతారా!

By

Published : Nov 11, 2020, 6:53 AM IST

అమెరికాపై 2001 సెప్టెంబరు 11 నాడు అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి జరిపిన దరిమిలా వాషింగ్టన్‌- ఆసియాలో ప్రతీకార యుద్ధాలు మొదలుపెట్టింది. గడచిన 20 ఏళ్లుగా సాగుతున్న ఈ నిరంతర యుద్ధాలవల్ల అమెరికాకు దండిగా చేతి చమురు వదిలింది. బ్రౌన్‌, బోస్టన్‌ విశ్వవిద్యాలయాల అధ్యయనం ప్రకారం ఈ యుద్ధాలకు అయిన, అవుతున్న ఖర్చు 2019 నాటికే 6.4లక్షల కోట్ల డాలర్లు (475లక్షల కోట్ల రూపాయలు) దాటిపోయింది. ఇంత ఖర్చుకు తగిన ఫలితాన్ని అమెరికా సాధించిందా అంటే అదీ లేదు. అవన్నీ విఫల యుద్ధాలే. ఒకవేళ 2020 ఆర్థిక సంవత్సరాంతానికల్లా ఆసియా, ఆఫ్రికాలలో యుద్ధాలకు స్వస్తి చెప్పినా- ఆ పోరాటాల్లో పాల్గొన్న సైనికులకు పింఛన్లు చెల్లించడానికి, యుద్ధాల కోసం చేసిన అఫ్పులపై వడ్డీలు కట్టడానికి అపార ధనరాశులను గుమ్మరిస్తూనే ఉండాలి. అదలా ఉంచితే ఇరాక్‌, సిరియా, అఫ్గానిస్థాన్‌ తదితర దేశాల్లో జరిగిన పోరాటాల్లో అపార ప్రాణ, ఆస్తి నష్టాలకు గురైన అమాయక పౌరుల క్షోభ అంతా ఇంతా కాదు. దానికి వెల కట్టడం ఎవరి తరమూ కాదు. గత 20 ఏళ్లుగా అమెరికా చేపట్టిన అంతులేని యుద్దాల్లో చనిపోయిన 8,01,000 మందిలో 3,35,000 మంది నిరాయుధ పౌరులే. మరో 2.1కోట్ల మంది ఇళ్లూవాకిళ్లు కోల్పోయి నిర్వాసితులుగా మారారు.

వైరాలను ఎగదోసిన ట్రంప్‌ విధానాలు

నిరంతర, నిరర్థక యుద్ధాల పట్ల అమెరికా ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని 2016 ఎన్నికల ప్రచారంలో బాగా సొమ్ముచేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌, 2020లోనూ అదేవిధంగా లబ్ధిపొందాలని చూశారు. విదేశాల్లో పోరాట విధుల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు రప్పిస్తానని అప్పుడూ ఇప్పుడూ హామీ ఇచ్చారు. కానీ, 2016 నుంచి ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు శాంతికి దోహదం చేయకపోగా, వైరాలను ఎగదోసేవిగా మారాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని నిర్ణయించినా తాలిబన్లతో సయోధ్య కుదుర్చుకోవాలని ప్రయత్నించడం భారత్‌తో సహా అమెరికాలోనే కొన్ని రక్షణ వర్గాలకు మింగుడుపడలేదు. యెమెన్‌ మీద సౌదీ అరేబియా జరిపిన దాడులు ఇళ్లలో, పాఠశాలల్లో, పెళ్ళి వేడుకల్లో వేలాది యెమెనీ ప్రజల ప్రాణాలు తీసినా ట్రంప్‌ ఆందోళన చెందకపోగా, సౌదీ అరేబియాకు అత్యాధునిక బాంబుల సరఫరాను కొనసాగించారు. ఈ బాంబుల ఎగుమతిని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) నిషేధించినప్పటికీ, ట్రంప్‌ దాన్ని వీటో చేసి మరీ ఎగుమతిని అనుమతించారు. సౌదీ అరేబియా పట్ల ఇంత అభిమానం ఒలకబోసిన ట్రంప్‌, సిరియాపై పూర్తి విరుద్ధ వైఖరి అవలంబించారు. ముద్దుగొలిపే చిన్నారులు సిరియా ప్రభుత్వ దళాల రసాయన దాడిలో మృతి చెందడం తన మనసును కలచివేసిందంటూ- సిరియాపై దాడులకు ఆదేశించారు. సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వంపై చిరకాలంగా పోరాడుతున్న కుర్దులకు అమెరికా సహాయాన్ని ఉన్నట్టుండి విరమించి, వారిని నట్టేట ముంచారు. దీంతో టర్కీ నుంచి పెరిగిన ముప్పును తప్పించుకోవడానికి కుర్దులు అసద్‌ ప్రభుత్వం పట్ల రాజీ ధోరణి అనుసరించాల్సిన దుస్థితిలోకి జారిపోయారు. మరోవైపు సున్నీ సౌదీ అరేబియా పట్ల వలపక్షంతో షియా ఇరాన్‌ మీద ట్రంప్‌ శత్రువైఖరి అవలంబించడం పాశ్చాత్య దేశాలనే కాదు... భారతదేశాన్నీ ఇబ్బందిపెట్టింది.

అణ్వస్త్ర తయారీ యత్నాలను విడనాడవలసిందిగా ఇరాన్‌ను ఒప్పించడానికి ఒబామా హయాములో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో జర్మనీ కూడా భాగస్వామి. తీరా ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక, ఆ శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ఇరాన్‌ సేనాని కాసిం సులేమానీ హత్యకు ఆదేశించడం ద్వారా ఆ దేశంతో యుద్ధానికి దిగినంత పనిచేశారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించి చాబహార్‌ రేవు విషయంలో ముందుకెళ్లే వీలు లేకుండా భారత్‌ ముందరి కాళ్లకు బందాలు వేశారు. బైడెన్‌ ఇరాన్‌ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించి సామరస్య వాతావరణం ఏర్పరచడానికి గట్టిగా కృషిచేస్తారని భావించవచ్చు. అయితే, ఇరాన్‌-సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలను ఉపశమింపజేసి సయోధ్య చర్చలకు ఒప్పించగలిగితే, అది బైడెన్‌కు గొప్ప విజయమవుతుంది. పశ్చిమాసియా శాంతికి మార్గం సుగమం అవుతుంది.

మధ్యేమార్గం వైపు!

అఫ్గానిస్థాన్‌ పట్ల జో బైడెన్‌ విధానం ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత- ఆయన ఒబామా, ట్రంప్‌ల మధ్యేమార్గ విధానాలను అనుసరించనున్నారు. జార్జ్‌ డబ్ల్యు బుష్‌ హయాములో సెనేటర్‌గా, ఒబామా హయాములో ఉపాధ్యక్షుడిగా ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ యుద్ధాలకు బైడెన్‌ ఆమోద ముద్ర వేశారని రిపబ్లికన్లు గుర్తుచేస్తున్నారు. అయితే, అమెరికా ప్రయోజనాలను వ్యతిరేకించే రాజకీయ నేతగా ముద్ర వేయించుకోవడం బైడెన్‌కు ఇష్టం లేకనే ఆ పని చేశారు. ఇకముందు కూడా అదే అంశం ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయకమానదు. ఉదాహరణకు యెమెన్‌పై సౌదీ దండయాత్రను బైడెన్‌ వ్యతిరేకిస్తున్నా, సౌదీకి వందల కోట్ల డాలర్ల ఆయుధాల ఎగుమతిని వీటో చేయకపోవచ్చు. అలా చేస్తే అమెరికా ఆయుధ పరిశ్రమలకు తీరని నష్టం కలిగించినవారవుతారు. కాబట్టి మధ్యే మార్గంగా దౌత్య మార్గాల్లో సౌదీకీ, యెమెన్‌లోని హౌతీలకూ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయవచ్చు. సిరియాలో ప్రతిపక్షాలపై అసద్‌ ప్రభుత్వం బాంబులు కురిపిస్తున్నా ఒబామా, బైడెన్‌లు చేతులు కట్టుకు కూర్చున్నారనే విమర్శ ఉంది. పదేళ్ల నుంచి నడుస్తున్న సిరియా అంతర్యుద్ధంలో వేల మంది మరణించగా, సిరియా జనాభాలో సగంమంది నిర్వాసితులయ్యారు. ప్రస్తుతం పూర్తిగా రష్యా ప్రాబల్యంలోకి వెళ్ళిన సిరియా ప్రభుత్వంపై పోరాడుతున్న కుర్దులకు మద్దతుగా బైడెన్‌ కొందరు అమెరికా సైనికులను నియోగించే అవకాశం ఉంది. సిరియాలో అన్ని పక్షాలను రాజకీయ పరిష్కారం కోసం ఒప్పించడానికి కృషి చేస్తానని బైడెన్‌ విధాన పత్రం పేర్కొంటున్నా, అది ఎలా సాధిస్తారనేదానిపై స్పష్టత లేదు.

ట్రంప్‌ హయాములో ఉత్తర కొరియాతో అణ్వస్త్ర సన్యాసం చేయించడానికి అట్టహాసంగా ప్రయత్నాలు చేసినా చివరకు సాధించింది గుండు సున్న. ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు దిగివచ్చేలా బైడెన్‌ ఆంక్షల అస్త్రాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలతో ఏర్పడిన 'క్వాడ్‌' కూటమిని మరింత బలోపేతం చేయడానికి బైడెన్‌ నడుం కట్టడం ఖాయం. నిరంతర యుద్ధాలకు క్రమంగా స్వస్తి పలకడానికి ప్రయత్నిస్తూనే, అగ్రరాజ్యంగా అమెరికా హోదాను నిలబెట్టుకోవడానికి వివిధ దేశాల్లో పరిమిత సంఖ్యలో సైనిక దళాలను కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.

విసిగిపోయిన అమెరికా ప్రజానీకం

నిరంతర, నిష్ఫల యుద్ధాల పట్ల అమెరికన్‌ ప్రజానీకం విసుగెత్తిపోయింది. అందుకే అఫ్గాన్‌ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు అమెరికా జరుపుతున్న అనవసర యుద్ధాలకు స్వస్తి చెబుతారా అని ప్రశ్నించినప్పుడు, జో బైడెన్‌ 'తప్పకుండా' అని జవాబిచ్చారు. బరాక్‌ ఒబామా హయాములో ఉపాధ్యక్షుడిగా తాను అఫ్గానిస్థాన్‌కు అదనపు సేనలను పంపాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంగతిని బైడెన్‌ గుర్తుచేశారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను పూర్తిగా ఉపసంహరించకుండా, కొంతమంది సైనికులను ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాల కోసం అక్కడ ఉంచాలని బైడెన్‌ భావిస్తున్నారు.

(రచయిత- ఆర్య)

ABOUT THE AUTHOR

...view details