తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చివరి నిమిషంలోనూ ఓటమి ఒప్పుకోని ట్రంప్ - trump allegations over biden's victory

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జో బైడెన్​కు విస్పష్టమైన గెలుపును ఆ దేశ ప్రజలు కట్టబెట్టారు. కానీ అధ్యక్షుడు మాత్రం బైడెన్​ విజయాన్ని ఒప్పుకోవడం లేదు. రేపు దేశాధ్యక్షుడిగా అమెరికా కాంగ్రెస్​ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తరుణంలో కూడా ట్రంప్​ తన ఓటమిని ఒప్పుకోవడం లేదు. ఎన్నికల్లో ఏదో బూటకం జరిగిందని ఆరోపిస్తున్నారు. నిరాధారా ఆరోపణలతో తన ట్రంపరితనాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ కథలు అమెరికా రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Trump is making baseless allegations over Joe Biden's victory
ఓటమి ఒప్పుకోని ట్రంప్​-కడ నిమిషంలోనూ కొర్రీలే!

By

Published : Jan 6, 2021, 7:04 AM IST

నిరుడు నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బైడెన్‌ స్పష్టమైన మెజారిటీతో గెలిచినా, ఎన్నికల ఫలితం పచ్చి మోసమంటూ ట్రంప్‌ పేచీలు పెడుతూనే ఉన్నారు. రేపు జో బైడెన్‌ను దేశాధ్యక్షుడిగా అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆలోగా కథ ఏ మలుపు తిరుగుతుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్‌ కింద పడ్డా తనదే పైచేయి అంటున్నారు. ఎన్నికల్లో మోసం, మాయోపాయాలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తన పదవీ కాలంలోని అవకతవకలు, అక్రమాలపై బైడెన్‌ ప్రభుత్వం విచారణ చేపడుతుందనే భయంతోనే ట్రంప్‌ ఇలా మోకాలడ్డుతున్నట్లుంది. ఆయన చేష్టలు అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి తీరని హాని చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సజీవ ప్రజాస్వామ్యంగా అమెరికాకు ఉన్న పేరు కాస్తా, ట్రంప్‌ నెలకొల్పుతున్న దుష్ట సంప్రదాయాల వల్ల మంటగలిసే ప్రమాదం పొంచి ఉంది. ఓటమిని తప్పించుకోవడానికి ఆయన ఎంతకైనా తెగిస్తారని 'ద వాషింగ్టన్‌ పోస్ట్‌' పత్రిక తాజా కథనం హెచ్చరిస్తోంది. ఆ పత్రిక వెల్లడించిన ఒక టేపులో ట్రంప్‌, జార్జియా ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసి తనను గెలిపించడానికి తగినన్ని ఓట్లను ఎలాగోలా సంపాదించాలంటూ ఆ రాష్ట్ర మంత్రి బ్రాడ్‌ రాఫెన్‌ స్పెర్గర్‌ను కోరడం స్పష్టంగా వినవచ్చింది. రాఫెన్‌ స్పెర్గర్‌ కూడా ట్రంప్‌ మాదిరిగానే రిపబ్లికన్‌ పార్టీకి చెందినవాడే అయినా, ఈ అడ్డగోలు కోరికను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఫలితంగా జార్జియా నిక్షేపంగా ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడెన్‌ ఖాతాలో పడి ఆయనకు తిరుగులేని ఆధిక్యత సమకూరింది. అయినా ట్రంప్‌ తెలివితెచ్చుకోకుండా మునిగిపోతున్న తన నౌకను ఎలాగోలా గట్టెక్కించాలని విఫలయత్నం చేస్తున్నారు.

దారితప్పిన రిపబ్లికన్లు

రేపు అమెరికా పార్లమెంటు ఉభయ సభలు బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించే ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని ట్రంప్‌ పన్నాగం పన్నారు. బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే ప్రక్రియ సెనేట్‌ అధ్యక్షుడు, దేశ ఉపాధ్యక్షుడు అయిన మైక్‌ పెన్స్‌ చేతుల మీదుగా జరగాలి. పెన్స్‌ కూడా రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ఎన్నికల ఫలితాన్ని సీలు చేసిన కవర్లలో పంపుతుంది. పెన్స్‌ ఆ కవర్లన్నింటినీ తెరిచి కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభలకు ప్రకటించాల్సి ఉంది. ఆ తతంగం పూర్తయ్యాక కాంగ్రెస్‌ అధికారికంగా బైడెన్‌ను దేశాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. ఇక్కడ పెన్స్‌ పాత్ర అలంకారప్రాయమే. అన్ని రాష్ట్రాలూ తమతమ నెలవుల్లో ఎవరు గెలిచినదీ ఇప్పటికే లాంఛనంగా ప్రకటించి ఉన్నాయి. ఆ ఫలితాలను కాంగ్రెస్‌కు నివేదించడం తప్ప మైక్‌ పెన్స్‌ చేయగలిగిందేమీ ఉండదు.

సాటి రిపబ్లికన్‌, దేశ ఉపాధ్యక్షుడు అయిన మైక్‌ పెన్స్‌తో సైంధవ పాత్ర పోషింపజేయాలన్నది ట్రంప్‌ వర్గం మొదటి పాచిక. ట్రంప్‌ వర్గం ఓడిపోయినా, ఎన్నిక ఫలితం మోసపూరితమంటూ కోర్టుకెక్కిన రాష్ట్రాల్లో నియోజక గణ ఓట్లు బైడెన్‌ ఖాతాలో పడకుండా పెన్స్‌ మోకాలడ్డాలన్నది ఈ వర్గం అభిమతం. అయితే, ఎన్నికల ఫలితాన్ని అంటే ప్రజల తీర్పును తోసిపుచ్చే అధికారం దేశాధ్యక్షుడితో సహా ఏ ఒక్క వ్యక్తికీ లేదని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. కాబట్టి, ఉపాధ్యక్ష హోదాలో పెన్స్‌ నియోజక గణ ఓట్లను నిరాకరించినా, అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కోర్టులు ఆయన నిర్ణయాన్ని కొట్టివేస్తాయి. ట్రంప్‌ వర్గం వేయగల రెండో పాచిక- బైడెన్‌ గెలుపును ప్రకటించే కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని వాయిదా వేయించడం. ఏదైనా రాష్ట్రంలో జరిగిన ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్‌ ఉభయ సభల నుంచి తలా ఒక సభ్యుడు లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తీకరిస్తే సంయుక్త సమావేశాన్ని నిలిపివేసి సమస్యపై రెండు గంటలు చర్చించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అభ్యంతరపెట్టే రిపబ్లికన్‌ పార్టీ సభ్యులకు కొదవ లేదు కాబట్టి ఈ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కనుక వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరగవచ్చు. అదేసమయంలో ట్రంప్‌ ఆడమన్నట్లు ఆడటానికి నిరాకరించే రిపబ్లికన్లూ చాలామంది ఉన్నారని మరచిపోకూడదు. కాబట్టి రెండు గంటల చర్చలో బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీ సులువుగా నెగ్గుతుందనడంలో సందేహం లేదు. ఏతావతా బైడెన్‌ ప్రమాణ స్వీకారాన్ని ట్రంప్‌ వర్గం కాస్త ఆలస్యం చేయగలదేమో కానీ, మొత్తం ఎన్నికనే వీగిపోయేలా చేయలేదు.

ఈ పాచికలు పారవు

ట్రంప్‌ అంతేవాసుల చివరి పాచిక- ఓట్ల లెక్కింపు వివాదాస్పదమైన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అత్యవసరంగా పది రోజుల పాటు ఆడిటింగ్‌ జరగాలని పట్టుపట్టడం. అందులో ఏవైనా తేడాపాడాలు వస్తే వాటిని నిర్ధారించడానికి ప్రత్యేక కాంగెస్‌ సమావేశం జరిగేలా చూడటం. 1876 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇలాగే జరిగింది. దాన్ని సంప్రదాయంగా ఉటంకిస్తూ బైడెన్‌ ఎన్నికను తారుమారు చేయాలని రిపబ్లికన్లు తహతహలాడుతున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితికి, 1876నాటి స్థితిగతులకు చాలా తేడా ఉంది. ఈసారి అన్ని రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించాయి. వాటిని సవాలు చేసే అవకాశమే లేదు. పైగా, ట్రంప్‌ వర్గం బొంకుతున్నట్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలూ జరిగిన దాఖలాయే లేదు. ఎన్నికల ఫలితాన్ని సవాలు చేస్తూ ట్రంప్‌ వర్గం వేసిన 61 దావాలలో 60 దావాలను కోర్టులు కొట్టివేశాయి. అలాంటప్పుడు ఎన్నికల ఫలితంలో తేడాపాడాలు ఉన్నాయనే ఆరోపణపై కాంగ్రెస్‌ ప్రత్యేక సంయుక్త సమావేశం జరిగే అవకాశమెక్కడిది? ట్రంప్‌ భజనపరులు వెర్రిమొర్రి ఆరోపణలతో ఆయనకు తీవ్ర పరాభవం తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. అన్నిటికన్నా విచారకరమేమంటే- అబ్రహాం లింకన్‌ వంటి మహానాయకుడి పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ నేడు ట్రంప్‌ను భుజాన వేసుకుంటూ అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావడం.

ఉపాధ్యక్ష పదవి... ఆరో వేలు!

'మానవుడు సృష్టించిన అత్యంత పనికిమాలిన పదవి- మన ఉపాధ్యక్ష పదవి' అని అమెరికా రెండో ఉపాధ్యక్షుడైన థామస్‌ జెఫర్సన్‌ వ్యాఖ్యానించారు. ఆ మాట నిజమే. ఉపాధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌ లాంటివాడు. అధికార లాంఛనాలు నిర్వహించడం తప్ప ఆయనకు మరో పని ఉండదు. అమెరికా పూర్వ అధ్యక్షుడైన థియొడోర్‌ రూజ్‌వెల్ట్‌ హయాములో జరిగిన ఘటన ఒకదాన్ని ఇక్కడ ఉదాహరించాలి. అప్పట్లో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో పైకప్పు నుంచి వేలాడే ఒక దీపాల తోరణం (షాండేలీర్‌) గాలికి అటూఇటూ కదులుతూ శబ్దం చేసేది. అది అధ్యక్షుడు రూజ్‌ వెల్ట్‌ను చీకాకుపరచేది. దాంతో ఆయన షాండెలీర్‌ను తక్షణం తొలగించాలని ఆదేశించారు. దాన్ని ఎక్కడ పెట్టాలని నౌకరు అడగ్గా, 'తీసుకెళ్లి ఉపాధ్యక్షుడి భవనంలో పడేయండి. ఆయన్ను మెలకువగా ఉంచడానికి పనికొస్తుంది' అని రూజ్‌వెల్ట్‌ వ్యాఖ్యానించారు. అలాంటి అలంకారప్రాయ పదవి ట్రంప్‌ చేష్టలవల్ల నేడు కాస్త ప్రాధాన్యం సంతరించుకొంది. మరి రేపు ఉపాధ్యక్షుడు పెన్స్‌ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.

- డాక్టర్‌ కె.ఎమ్‌.బాబు

ఇదీ చూడండి: పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్

ABOUT THE AUTHOR

...view details