ఏ దేశమైనా పెట్టుబడుల కేంద్రస్థలిగా మారాలంటే అవినీతి లేని పాలన వ్యవస్థలు అవసరం. వ్యాపార సంస్థల ఏర్పాటుకు అనుమతుల జారీలో అలవిమాలిన జాప్యం ఉండరాదు. అన్నింటికన్నా ముఖ్యంగా భూ రికార్డుల వ్యవస్థ పారదర్శకంగా, సరళంగా ఉండాలి. భూమి కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, ఇతర ధ్రువీకరణ పత్రాలు సంపాదించాలన్నా- రెవిన్యూ విభాగాల్లో సంక్లిష్టత లేని వాతావరణం తప్పనిసరి. ఆ విషయంలో అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో వెనకబడి ఉంది. భూమి పత్రాల నిర్వహణలో దశాబ్దాలుగా భారత్ స్థితి దిగనాసిగా ఉంది. వ్యవసాయ వ్యవసాయేతర భూములు, సర్వే నంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో గందరగోళం సర్వసాధారణంగా మారింది. సులభతర వ్యాపార సూచీలో 14 స్థానాలు ఎగబాకి భారత్ ఇటీవల 63వ స్థానంలో నిలిచినప్పటికీ- రెవిన్యూ సంస్కరణల విషయంలో చురుగ్గా ముందడుగు వేయకపోతే పరిస్థితులు గుణాత్మకంగా మారవు.
లొసుగులు ఎన్నో...
వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని సంస్కరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రెవిన్యూ చట్ట సంస్కరణలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవినీతి తిమింగిలాల అక్రమార్జన చూసి నివ్వెరపోతున్న ప్రజలు- అధికార యంత్రాంగంలోని అక్రమార్కుల దూకుడుకు సంస్కరణలతో అడ్డుకట్ట పడాలని బలంగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ రెవిన్యూ వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న అభిప్రాయం ఉంది. భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా మోసాలు ఏపీలోనూ తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. రెవిన్యూ రికార్డులను పక్కాగా మార్చేందుకు అక్కడా భూముల సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఓ గ్రామంలో సర్వే నిర్వహించారు. 2021 జనవరి నుంచి ఏపీలో సుమారు తొమ్మిది వేలమంది సర్వేయర్లతో భూములు సర్వే చేయించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రితమే స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలొచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మండలాలు సహా ఇతర ప్రాంతాల్లోనూ భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎకరా భూమి ధర కోట్ల రూపాయలకు చేరితే- మారుమూల మండలాల్లో లక్షల రూపాయలు పలుకుతోంది. ప్రతి గ్రామంలో అనేకమంది స్థిరాస్తి వ్యాపారులుగా, బ్రోకర్లుగా మారారు. ఈ జోరులో ప్రైవేటు భూముల విక్రయాలతోపాటు దొడ్డిదారిన ప్రభుత్వ, సీలింగ్ ఈనాం, భూదాన్ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేసి అమ్ముకునే దందా సైతం ప్రారంభమైంది. రెవిన్యూ యంత్రాంగం గాడి తప్పింది ఇక్కడే! హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రభుత్వ భూములకు ఏదో రకంగా వివాదం సృష్టించడం, ఆపై కొందరు రెవిన్యూ అధికారుల అండదండలతో వాటిని సొంతం చేసుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే వ్యవస్థ అక్రమాలపుట్టలా మారింది. ‘మ్యుటేషన్’ చేయాలన్నా, వారసుల పేర్లతో పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నా, చివరికికుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సైతం డబ్బులు వసూలు చేసే పరిస్థితి నెలకొంది.