తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మరో మహా జాడ్యం-పెరుగుతున్న నిరాకరణ వాదం - britain latest updates

బ్లీచింగ్‌, లైజాల్‌ వంటి ద్రావణాలను ఒంట్లోకి ఎక్కించుకుంటే కరోనా వైరస్‌ను తుడిచిపెట్టవచ్చునేమో అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ మధ్య వ్యాఖ్యానించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరచింది. సైన్స్‌ చెప్పే వాస్తవాలను, అది చేసే హెచ్చరికలను ట్రంప్‌ ఖాతరు చేయకపోగా, అవన్నీ అభూత కల్పనలని అంటారు. ఇలాంటి వైఖరి వల్ల మతం, సైన్స్‌ల మధ్య అనవసర సంఘర్షణ తలెత్తుతోంది. పోనుపోను మానవాళికి, సైన్స్‌కు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.

top countries leaders negligence on corona
మరో మహా జాడ్యం-పెరుగుతున్న నిరాకరణ వాదం

By

Published : May 10, 2020, 7:45 AM IST

ఇల్లు, వీధులు తుడిచే బ్లీచింగ్‌, లైజాల్‌ వంటి ద్రావణాలను ఒంట్లోకి ఎక్కించుకుంటే కరోనా వైరస్‌ను తుడిచిపెట్టవచ్చునేమో అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమధ్య వ్యాఖ్యానించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరచింది. తనకు శాస్త్ర విజ్ఞాన స్పృహే లేదని ఆయనే ఈ విధంగా బయటపెట్టుకున్నారు. సైన్స్‌ చెప్పే వాస్తవాలను, అది చేసే హెచ్చరికలను ట్రంప్‌ ఖాతరు చేయకపోగా, అవన్నీ అభూత కల్పనలని అంటారు. ఉదాహరణకు భూతాపం అనేది బోగస్‌ అంటారు. విజ్ఞానాన్ని తోసిపుచ్చేవారిలో ట్రంప్‌ మొదటివారూ కాదు, చివరివారూ కాబోరు. ఆధునిక శాస్త్రవిజ్ఞాన పితామహుడైన గెలీలియోకు ఇలాంటి సైన్స్‌ నిరాకరణవాదుల నుంచి అప్పట్లో పెద్ద ముప్పు ఎదురైంది. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని, భూమి ఇతర గ్రహాలే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని గెలీలియో ప్రకటించి, రోమన్‌ క్యాథలిక్‌ చర్చి ఆగ్రహానికి గురయ్యారు. గెలీలియో బైబిల్‌ వాక్కును ధిక్కరిస్తున్నారని చర్చి మండిపడింది. నేడు ఆధునిక ప్రభుత్వాలు సైతం అలనాటి చర్చి మాదిరిగా శాస్త్రవిజ్ఞానాన్ని తోసిపుచ్చడం పెద్ద వైపరీత్యం, ఈ వైఖరి వల్ల మతం, సైన్స్‌ల మధ్య అనవసర సంఘర్షణ తలెత్తుతోంది, పోనుపోను మానవాళికి, సైన్స్‌కు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న వైనం

ఈ వైరుధ్యాల నడుమ గెలీలియో ఉదంతం మళ్లీ గుర్తుకు వస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంత ఆవశ్యకమో చాటిచెబుతోందని ఇజ్రాయెలీ-అమెరికన్‌ అంతరిక్ష భౌతిక శాస్త్రజ్ఞుడు మేరియో లివియో వ్యాఖ్యానించారు. నేడు కరోనా వైరస్‌ విజృంభణకు తోడుగా సైన్స్‌ నిరాకరణవాదమనే మరో జాడ్యం పెచ్చుమీరుతోంది. విజ్ఞానాన్ని తోసిపుచ్చడంలో ట్రంప్‌నకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఏమాత్రం తీసిపోరు. ‘కరోనా వైరస్‌ వల్ల వచ్చే కొవిడ్‌ వ్యాధి జలుబు, చిన్నపాటి ఫ్లూ జ్వరం తప్ప మరేమీ కాద’ని బొల్సొనారో వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ ప్రజలకు ఏ జబ్బూ రాదని ఆయన అన్నారు. కార్చిచ్చువల్ల అమెజాన్‌ అడవులు నాశనమవుతున్నాయని ఉపగ్రహ సమాచారం అందించిన బ్రెజిల్‌ అంతరిక్ష సంస్థ అధిపతి అబద్ధమాడుతున్నారంటూ ఉద్వాసన పలికిన ‘ఘనత’ ఆయనదే!

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ కూడా భూతాపం బోగస్‌ అని వాదించే వ్యక్తి. మరి కరోనా వైరస్‌ వట్టి బూటకమని బుకాయించకుండా ఎలా ఉంటారు? ఇలాంటి భావనలు ఉండబట్టే కరోనా ముప్పును ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అయిదు కీలక సమావేశాలను బహిష్కరించారు. చివరకు తానే కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరారు. మాస్కులు ధరించినందుకు ప్రజలను గట్టిగా మందలించే కంబోడియా ప్రధానమంత్రి హున్‌ సెన్‌ మొదలుకొని బలీయ నైతిక స్వభావమే తనను కొవిడ్‌ నుంచి రక్షిస్తోందని నమ్మే మెక్సికో అధ్యక్షుడు ఆంద్రే ఒబ్రడార్‌ వరకు ఈ కోవకు చెందినవారే. భారతదేశంలోనూ సైన్స్‌ను నిరాకరించేవారికి కొదవ లేదు. ఇలాంటివారిలో ఉమ్మడి లక్షణాలు ఉంటాయని సైన్స్‌ రచయిత మార్క్‌ హూఫ్‌ నాగిల్‌ వివరించారు. అవి- వాతావరణ మార్పును, పరిణామ సిద్ధాంతాన్ని, హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ను నిరాకరించడం, కుట్ర సిద్ధాంతాలను నమ్మడం, కొందరి మీద, కొన్ని వాస్తవాల మీద దాడి చేయడం, బోగస్‌ నిపుణులను ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ, వాస్తవాలను బోగస్‌ అంటూ కొట్టివేయడం, తర్కాన్ని వక్రించడం వంటివి. హెచ్‌ఐవీని యోగాతో నయం చేయవచ్చని ఒక ఆధ్యాత్మిక గురువు టీవీలో చాటడం, గోమూత్రంతో కరోనా వైరస్‌ను జయించవచ్చని అసోమ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడొకరు ప్రకటించడం... ఇక్కడ ప్రస్తావించాలి.

శాస్త్ర పురోగతికి ఆటంకం

కార్యకారణ సంబంధాలను సైన్స్‌ దృష్టితో అన్వేషించకుండా, అవన్నీ ఏవో అతీత శక్తుల వల్లే జరుగుతున్నాయని విశ్వసించడం సైన్స్‌ నిరాకరణవాదానికి పునాది. ఈ వాదానికి అంకితమైనవారు, తమకు అనువైన విధంగా వాస్తవాలను, గణాంకాలను వక్రీకరిస్తారు. వారికి మత గ్రంథాలు, మత నాయకులు చెప్పేవే వేద వాక్యాలు. నమ్మకమే వారికి అస్తిత్వాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పెద్దలను గౌరవించాలి, పవిత్ర గ్రంథాల సూక్తులను, ఆధ్యాత్మిక గురువుల బోధలను శిరసావహించాలని బోధించే సంస్కృతిలో- ప్రశ్నించే తత్వానికి చోటు ఉండదు. ప్రతిదీ ప్రశ్నించి, తరచి శోధించి సత్యాన్ని తెలుసుకొమ్మంటుంది సైన్స్‌. అంతా దేవుడి సృష్టి అని నమ్మమంటుంది పురాతన సంస్కృతి. అలా నమ్మితే సైన్స్‌ ఎలా పురోగమిస్తుంది? ప్లాస్టిక్‌ సర్జరీని మన ప్రాచీనులే కనిపెట్టారని, మనం కనిపెట్టిన ‘సున్నా’ ఆధునిక గణితానికి పునాది అని మురిసిపోయేకన్నా- ప్రపంచానికి కారు చౌకగా ప్రాణరక్షక మందులను అందిస్తున్నామని, స్వదేశంలోనే అధునాతన ఉపగ్రహాలను తయారుచేస్తున్నామని గర్వించకపోవడం పెద్ద వింత. ముందు చూపుకన్నా వెనకచూపే మిన్నా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ తరహా తిరోగమన వైఖరిని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే వ్యక్తీకరిస్తున్నారు. 2018 అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) బడ్జెట్‌ లో 1,500 కోట్ల డాలర్ల కోత పెట్టడం, ప్రపంచంలో వ్యాధుల నిరోధానికి ఇచ్చే నిధులను 80శాతం తగ్గించడం సైన్స్‌ పట్ల ట్రంప్‌ చిన్నచూపును బయటపెడుతున్నాయి. ఇతర దేశాల నాయకులకూ ఈ జాడ్యం పాకదని ఆశిద్దాం.

-కావేరీ బాంజాయ్‌(రచయిత్రి- ప్రముఖ పాత్రికేయురాలు)

ABOUT THE AUTHOR

...view details