పంచభూతాల సమాహారం మన విశ్వం. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఎంత స్వచ్ఛంగా ఉంటే... సమాజం, మానవాళికి అంత ఆరోగ్యం. కోటానుకోట్ల సంవత్సరాలుగా సజీవంగా, స్వచ్ఛంగా ఉన్న ప్రకృతి 19వ శతాబ్దం నుంచి మూలాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా గడచిన మూడు దశాబ్దాలలో వచ్చిన శాస్త్ర, సాంకేతిక, జీవావరణ మార్పులు... ప్రకృతి స్వచ్ఛతను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, జీవుల మనుగడను శాసిస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం, అడవుల నరికివేత, వనరుల విధ్వంసం, మితిమీరిన ప్లాస్టిక్, రసాయనాల వినియోగం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. అందుకే నేడు భూమి, నీరు కలుషితమైంది. గాలి, నిప్పు, చివరకి నింగి కూడా కాలుష్య కేంద్రమైంది. పర్యవసానంగానే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రుతువులు గతితప్పి సకాలంలో వానలు కురవకుండా పోతున్నాయి. కరవులు కాటేస్తున్నాయి. శుద్ధమైన నీరు దొరకడం లేదు. నాణ్యమైన పంట పండటం లేదు. ఇలాంటి వాతావరణ పెను పరిణామాలకు కారణం మానవ చర్యలే. మానవ వికృత చేష్టలే పర్యావరణ భద్రతను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెడుతున్నాయి. వాతావరణ అసమతౌల్యం మానవ మనుగడకే ముప్పని తెలిసినా నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు.
సకలం కాలుష్యం...
ప్రపంచవ్యాప్తంగా ఏటికేడు పెరుగుతున్న జనాభా, రెట్టింపవుతున్న వాహనాల సంఖ్య, పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, అంతరిస్తున్న అడవులు, తరిగిపోతున్న ప్రకృతి వనరులు వెరసి కాలుష్యం విషం చిమ్ముతూ భూతాపం తీవ్ర సమస్యగా మారింది. ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ఇవన్నీ కరవు కాటకాలకు దారితీస్తూ నీరు, ఆహార కొరతకు ఆజ్యం పోస్తున్నాయి. భూతాపాన్ని కనిష్ఠంగా రెండు డిగ్రీలకు తగ్గించాలన్న పారిస్ ఒప్పందం పట్టాలెక్కకపోవడం, అగ్రరాజ్యాలు కలసి రాకపోవడం... భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంలా మారింది. అసలే అధిక జనాభాతో అమితంగా సహజ వనరులు ఖర్చయ్యే మన దేశంలో కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. దేశంలోని ప్రతి సమస్యకు మూల కారణమై నిలుస్తోంది. ముఖ్యంగా భూమి, నీరు, పచ్చదనంపై ఆ ప్రభావం అధికంగా ఉంటోంది. అడవుల నరికివేత, మోతాదుకు మించిన ఎరువుల వాడకంతో నేల కన్నీరు పెడుతోంది.
పుడమి పచ్చగా ఉండాలంటే 33 శాతం అడవులు ఉండాల్సిన దేశంలో 21 శాతానికి మించిలేవు. సగటున రోజుకు 333 ఎకరాల మేరకు అటవీ భూమి అదృశ్యమై నిర్జీవమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితోపాటు కొట్టుకుపోతున్నాయి. దీనికితోడు విచక్షణ రహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల పసిడి నేలలు నిర్జీవ క్షేత్రాలుగా మారుతున్నాయి. కోట్లాది సూక్ష్మ జీవులు, పోషకాలతో నిండి ఉండే సుసంపన్నమైన నేల నిస్సారంగా మారింది. సూక్ష్మ, స్థూల ధాతువుల లోపం పెరిగిపోయింది. హరిత విప్లవం తరవాత బస్తాల కొద్దీ ఎరువులు గుమ్మరించనిదే పంట పండని రీతిలో నేలలు క్షయమయ్యాయి. భూసార ఆధారిత ఎరువుల వినియోగానికి పెద్దపీట వేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రైతుల్లో అవగాహన కరవై ఎరువుల వినియోగం తగ్గడం లేదు. సేంద్రియ కర్బనం హరించుకుపోయి కనీస దిగుబడి కూడా దక్కడం లేదు.
ఈ భూమిపై తన స్థానం ఏమిటనేది మానవుడు గుర్తెరగాలి. మనతోపాటు ఎన్నో లక్షల జీవరాశులు ఈ ప్రకృతిని పంచుకుంటున్నాయనే విషయం మరవకూడదు. మన చర్యల కారణంగా ఎన్నో జాతులు, జీవులు అంతరించే దశ, అరుదైన జాబితాలోకి చేరుతున్నాయని గ్రహించాలి. జీవులు అంతరిస్తే జీవ వైవిధ్యం క్షీణిస్తుందన్న వాస్తవం పసిగట్టాలి. భూతాపం, పర్యావరణ మార్పులకు మనమే కారకులం. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనదే. ఉష్ణోగ్రతలు తగ్గించడం సంగతేమోగానీ అవి పెరగకుండా కాచుకోవాల్సిన అవసరం మానవాళిదే.