నగర భారతంలో వాయు కాలుష్యం మృత్యఘంటికలు మోగిస్తోంది. హైదరాబాదుతో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఒక్క 2020లోనే 1.2 లక్షల మందిని ఇది పొట్టనపెట్టుకున్నట్టు 'గ్రీన్‌పీస్' సంస్థ నివేదించింది. వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాల్లో 66శాతానికి డీజిల్ వాహనాలదే బాధ్యతని గతంలో ఓ అధ్యయనంలో తేలింది. ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాలను(ఈవీ) వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కిందటి నెలలో 'గో ఎలక్ట్రిక్' పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 'శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి ఏడాదికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. విద్యుత్తు వాహనాల వాడకం పెరిగితే దేశం మీద ఈ భారం తగ్గడం సహా పర్యావరణానికీ మంచిది' అన్నారు. భారత్‌లో శిలాజ ఇంధనాల వినియోగం ఇలాగే కొనసాగితే 2040నాటికి వాటి దిగుమతి వ్యయం మరో మూడు రెట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో ఈవీలకు ప్రాచుర్యం పెంచడం అత్యవసరం.
దశమార్చే 'ఫేమ్'
విద్యుత్తు వాహనాల తయారీ, కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం 2011లో 'భారత్‌లో విద్యుత్తు వాహనాల తయారీ, త్వరితగత స్వీకారం' (ఫేమ్) పథకానికి రూపకల్పన చేసింది. దీని మొదటి దశలో 2.8 లక్షల వాహనాలకు రూ.359 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 'ఫేమ్' రెండో దశ అమలులోకి వచ్చింది. దీనికి రూ.10 వేల కోట్లను కేటాయించారు. వీటిలో 86 శాతం నిధులను దేశంలో ఈవీల గిరాకీ పెంచడానికి వెచ్చిస్తున్నారు. 'ఫేమ్' రెండో దశ పూర్తయ్యేసరికి విద్యుత్తుతో నడిచే ఏడు వేల బస్సులు, 55 వేల కార్లు, అయిదు లక్షల త్రిచక్ర, పది లక్షల ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈవీల మీద జీఎస్టీని 12శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించారు. ఈ-వాహనాల ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్ల మీదా జీఎస్టీని 18శాతం నుంచి అయిదు శాతానికి పరిమితం చేశారు.
ఇదీ చదవండి:'అంబేద్కర్ కలలు కన్న భారతం దిశగా కాంగ్రెస్'
ఈవీలకు గిరాకీ..
ప్రభుత్వ ప్రయత్నాలతో ఈవీల అమ్మకాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. 2017-18లో 69 వేల విద్యుత్తు వాహనాలు అమ్ముడైతే, 2019-20 నాటికి వాటి సంఖ్య 1.67 లక్షలకు పెరిగింది. మొత్తమ్మీద 2017-20 మధ్యలో దేశవ్యాప్తంగా 3.79 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. అయితే, దేశంలో ఏటా జరిగే వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా ఒక శాతం కంటే తక్కువే! రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది అయిదు శాతానికి పైగా పెరిగే అవకాశముందని భారతీయ విద్యుత్తు వాహనాల తయారీదారుల సంఘం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ వేదిక క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ (సీఈఎం) 'ఈవీ30జీ30' ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీఈఎం సభ్య దేశాల్లో 2030నాటికి ఏటా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీలు 30 శాతం ఉండాలన్నది దీని ఉద్దేశం. సీఈఎంలో సభ్యదేశంగా భారత్ సైతం ఈ లక్ష్యాన్ని స్వీకరించింది.