తెలంగాణ

telangana

ETV Bharat / opinion

గల్ఫ్‌ బాధితులకు బాసటేదీ? - గల్ఫ్​ బాధితుల బాధలు

ఏజెంట్ల మాట నమ్మి ఆశల వసంతాన్ని గుండెలో నింపుకొని ఎడారి సీమలకు పయనమైన వేలమంది, దళారుల దగాకు బలై జీవచ్ఛవాలుగా మిగిలి పొగలడం- గల్ఫ్​ బాధితుల తలరాత! అంతా బాగున్నప్పుడు ఎంతో ఆత్మీయత ఒలకబోసే ప్రభుత్వాలు కష్టాల కాష్ఠంలో కమిలిపోతున్న అభాగ్యుల వేదనను ఎందుకు పట్టించుకోవడం లేదనే మీమాంస ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపేణా సుప్రీం కోర్టుకు చేరింది.

The suffering of the Gulf victims is indescribable
గల్ఫ్‌ బాధితులకు బాసటేదీ?

By

Published : Oct 8, 2020, 7:22 AM IST

తివిరి ఇసుమున తైలం తీసే గల్ఫ్‌ దేశాల సమగ్రాభివృద్ధికి పాటుపడుతూ మాతృదేశానికి రికార్డు స్థాయి కాసుల వరద పారించడం- లక్షలాది ప్రవాస భారతీయుల ఘనత. ఏజెంట్ల మాట నమ్మి ఆశల వసంతాన్ని గుండెలో నింపుకొని ఎడారి సీమలకు పయనమైన వేలమంది, దళారుల దగాకు బలై జీవచ్ఛవాలుగా మిగిలి పొగలడం- వాళ్ల తలరాత! అంతా బాగున్నప్పుడు ఎంతో ఆత్మీయత ఒలకబోసే ప్రభుత్వాలు కష్టాల కాష్ఠంలో కమిలిపోతున్న అభాగ్యుల వేదనను ఎందుకు పట్టించుకోవడం లేదనే మీమాంస ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపేణా సుప్రీం కోర్టుకు చేరింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం- కేంద్రం, 12 రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీబీఐకీ నోటీసులు జారీ చేసింది.

భారతీయ శ్రామికుల హక్కుల పరిరక్షణ కోసం గల్ఫ్‌ తెలంగాణ సంక్షేమ సాంస్కృతిక సంఘం సారథి వేసిన వ్యాజ్యం ఎన్నో కీలకాంశాలను స్పృశించింది. గల్ఫ్‌ దేశాల జైళ్లలో 8,189 మంది మగ్గిపోతుండగా 44 మంది మరణ శిక్ష ఎదుర్కొంటున్నారంటూ వారికి న్యాయ సహాయం అందించాలని, అక్కడే విగత జీవులైన వారి దేహాల్ని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన మార్గదర్శకాలు వెలువరించాలనీ కక్షిదారు కోరుతున్నారు.

పాకిస్థాన్‌, శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్‌ వంటివి తమ కార్మికుల్ని రప్పించేందుకు క్రియాశీలంగా చొరవ చూపుతుంటే, అక్కడి భారత ఎంబసీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్నది ఫిర్యాదు! బడుగు శ్రామికుల అక్రమ రవాణా మొదలు వారిపై జరుగుతున్న నేరాల దర్యాప్తునకు సీబీఐని నోడల్‌ ఏజెన్సీగా నియమించాలన్న విజ్ఞాపనా ఉంది. చదువు సంధ్యల్లేక పోయినా కాయకష్టంతో నాలుగు రాళ్లు వెనకేసుకొందామన్న ఆశతో వెళ్ళి బానిసలుగా అమ్ముడు పోయిన, వ్యభిచార కూపంలో కూరుకుపోయిన వాళ్ల దయనీయావస్థలకు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపరంగా సత్వర పరిష్కారాలు కావాలిప్పుడు!

గల్ఫ్‌లోని ఆరు దేశాల్లో 85 లక్షలమంది భారతీయులు పని చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖే చెబుతోంది. 2016-19 మధ్యకాలంలో వివిధ రకాల వేధింపులపై 77 వేలకుపైగా ఫిర్యాదులందినట్లు నిరుడు జులైలో లోక్‌సభకు నివేదించిన కేంద్రం వాటిలో 36శాతం సౌదీ అరేబియానుంచే వచ్చాయంటూ- ప్రవాసుల సంఖ్యతో పోలిస్తే ఫిర్యాదులు నామమాత్రమేనని ముక్తాయించింది. దేశంకాని దేశంలో జీతాలు చెల్లించకపోవడం, కార్మిక హక్కుల్ని తొక్కిపట్టడం, నివాస అనుమతుల్ని నిరాకరించడం, వైద్య సదుపాయాలు కల్పించకపోవడం, ప్రాణాలు పోయినా పరిహారం ఊసెత్తకపోవడం వంటివన్నీ బడుగు శ్రామికుల జీవన్మరణ సమస్యలు.

2014-19 మధ్యకాలంలో దాదాపు 34వేల మంది ప్రవాస కార్మికులు మృత్యువాత పడటమూ ప్రభుత్వాలకు తీవ్ర విషయంగా కనిపించడం లేదు! 2016 జూన్‌లో ఖతర్‌ సందర్శించిన ప్రధాని మోదీ- శ్రామికుల సమస్యలు తెలుసునంటూ వాటిని అధినేతలతో మాట్లాడి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. దానివల్ల ఒరిగిందేమీ లేదనడానికి ఫిర్యాదుల పరంపరే రుజువు! 2012-17 నడుమ ప్రపంచవ్యాప్త ప్రవాస భారతీయులు ఇండియాకు పంపిన మొత్తం 41 వేల కోట్ల డాలర్లు; అందులో గల్ఫ్‌ దేశాలనుంచి వచ్చింది దాదాపు 21 వేల కోట్ల డాలర్లు. ఇంతగా సిరులు పండిస్తున్న శ్రామికుల కష్టం దగాకోరుల పాలబడి బడుగు జీవితాలు చితికిపోకుండా కాచుకోవడం ప్రభుత్వాల విధి.

గల్ఫ్‌ కలలకు వలవేసి ముంచేసే 29 అక్రమ ఏజెన్సీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని; మహారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీలో తలో 85దాకా పోగుపడ్డాయని మొన్న ఫిబ్రవరిలో కేంద్రం హెచ్చరించింది. చట్టబద్ధంగా శ్రామిక వలసలు సాగేలా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్రాలు రూపొందిస్తే, పని ప్రదేశాల్లో వారి హక్కులకు ఆయా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పూచీపడే పటిష్ఠ యంత్రాంగ నిర్మాణానికి కేంద్రం సమాయత్తం కావాలి. చీకూ చింతా లేని ప్రవాస విజయానికి అదే సరైన దారి!

ABOUT THE AUTHOR

...view details