కొవిడ్ సోకినవాళ్లు సుమారు రెండు వారాల పాటు ఐసొలేషన్‌లో ఉంటారు. ఇంటిలోనే ఉంటూ వైద్యుడి సలహాలతో చికిత్స పొందినా, వ్యాధి తీవ్రత పెరిగి ఆస్పత్రిలో చేరినా 'ఒంటరితనం' తప్పదు. సెల్‌ఫోన్, కంప్యూటర్, పుస్తకాలతో కాలక్షేపం చేసినా- పక్కన మనసు విప్పి మాట్లాడే తోడు లేకపోవడం దుర్భరంగా అనిపిస్తుంది. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడే అర్థమవుతుంది. ఈ పరిస్థితి చాలామందిలో కుంగుబాటుకు కారణమవుతోంది. కొందరిలో తీవ్రమైన మానసిక సమస్యలూ తలెత్తుతున్నాయి. తనకు కరోనా వైరస్ సోకిందనే సమాచారం వినగానే ఒక్కసారిగా తెలియని భయం ముప్పిరిగొంటుంది. తనకేమన్నా అయితే కుటుంబం పరిస్థితి ఏమిటనే ఆందోళన ఒకవైపు, చికిత్సకు ఎంత ఖర్చవుతుందో, అంత సొమ్మును తన కుటుంబం ఎక్కడినుంచి తేగలదోననే బెంగ మరోవైపు కొవిడ్ బాధితులను పీడిస్తున్నాయి.
ఎంత మందిలో అంటే?
దేశ జనాభాలో దాదాపు 14శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు 2016లో నిర్వహించిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే వెల్లడించింది. 1990 నాటి కంటే ఈ సంఖ్య 2016 నాటికి రెట్టింపయింది. ప్రపంచం మొత్తమ్మీద మానసిక అనారోగ్యం అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇక్కడ దాదాపు 20శాతం ప్రజలు మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల్లో భారతదేశ వాటా 36.6శాతం. 1990లో ఇది 25.3శాతం మాత్రమేనని లాన్సెట్ పరిశోధన వెల్లడించింది. మహిళల్లోనే ఎక్కువగా ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి. 13 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న యువతలో దాదాపు 98 లక్షల మంది కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, వారికి మానసిక చికిత్స తప్పనిసరిగా అవసరమని బెంగళూరులోని జాతీయ మానసికారోగ్య, నాడీశాస్త్ర సంస్థ (నిమ్‌హాన్స్) తెలిపింది.
ఈ లక్షణాలతో జాగ్రత్త..
ప్రశాంతత లేకపోవడం, చికాకుపడుతుండటం, చిన్న విషయాలకూ కోపం రావడం లేదా అతిగా స్పందించడం, కారణం లేకుండా నీరసంగా అనిపించడం.. ఇలాంటివి ఇంకా అనేక లక్షణాలు మానసిక అనారోగ్యానికి సూచికలు. సమస్య ఉన్నవారిలో రెండు శాతం వరకు తీవ్రస్థాయికి చేరుకుని, స్కిజోఫ్రెనియా లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు పెట్టే ఒత్తిడి వారిని కుంగుబాటులోకి నెట్టేస్తోంది.
ఆర్థికంగానూ నష్టమే..
మానసిక అనారోగ్యంతో ఆర్థిక సమస్యలూ తలెత్తుతున్నాయి. భారతీయుల్లో కుంగుబాటు, ఆందోళన లాంటి కారణాల వల్ల ఉత్పాదకత గణనీయంగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2030 వరకు ఇలా మానసిక సమస్యల వల్ల తగ్గే ఉత్పాదకత విలువ దాదాపు రూ.1.03 లక్షల కోట్లు ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా దానికి పరిష్కార మార్గాలు మాత్రం చాలా తక్కువే. దేశంలో ప్రతి లక్ష జనాభాకు కేవలం 0.75 మంది మాత్రమే మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లక్ష జనాభాకు కనీసం ముగ్గురు ఉండాలని, అదే అభివృద్ధి చెందిన దేశాలైతే ఆరుగురు ఉండాలని ప్రమాణాలు చెబుతున్నాయి. దేశజనాభాలో 65శాతం గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారు. మానసిక ఆరోగ్య నిపుణుల్లో మాత్రం 75శాతం పట్టణాలు, నగరాల్లోనే ఉంటున్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో వీరి సంఖ్య మిగిలిన ప్రాంతాల కంటే మరీ తక్కువ. కేంద్ర ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.34శాతం మాత్రమే వైద్యరంగం మీద ఖర్చుపెడుతోంది. అందులోనూ మానసిక వైద్యరంగంపై పెట్టేది అత్యంత తక్కువ. అదే అభివృద్ధి చెందిన దేశాలు మానసిక వైద్యరంగంపైనే తమ జీడీపీలో అయిదుశాతం ఖర్చుచేస్తున్నాయి.