తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మానవతే పునాదిగా.. కావాలి మార్పులు - new models for humanity

ఈ భూమిపై మానవుడికే కాదు- కోటానుకోట్ల సూక్ష్మజీవులు, కీటకాలు, జంతువులు, వృక్షాలకూ హక్కు ఉంది. అందరం భూమాత బిడ్డలమే. భిన్నత్వంలో ఏకత్వమంటే ఇదే. ఈ సత్యాన్ని మనిషికి గుర్తు చేసి జ్ఞానోదయం కలిగించడం ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభం పరమార్థమని గ్రహించాలి. ఇకనైనా ఆర్థిక, రాజకీయాలకన్నా కారుణ్యం, సహకారం విధాన నిర్ణయాలకు ప్రాతిపదిక కావాలి. కులం, మతం, జాతీయత, సంస్కృతులను మనుషుల మధ్య విభేదాల సృష్టికి వినియోగించడం మాని సంఘీభావం, సౌభ్రాతృత్వాలను పెంపొందించుకోవాలి.

humanity
మానవతే పునాదిగా.. సరికొత్త నమూనాలు కావాలి

By

Published : May 18, 2020, 7:22 AM IST

కొవిడ్‌ మహమ్మారికి జడిసి జనం అనేక వారాల నుంచి ఇంటి గడప దాటడం లేదు. దీంతో ప్రకృతి గుక్క తిప్పుకొంటోంది. కాలుష్యం తగ్గి, వన్యప్రాణులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం, చెట్లు మరింత పచ్చదనంతో కళకళలాడటం, నదుల్లో మాలిన్యం తగ్గి నిర్మలంగా మారడం ఆహ్లాదం కలిగిస్తోంది. మానవుడు సృష్టిస్తున్న విధ్వంసానికి తాత్కాలికంగా తెరపడి భూమాత కాస్త ఊపిరి పీల్చుకొంటోంది. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అంతా ప్రకృతే శాసిస్తుంది. జీవిత చదరంగంలో మానవుడు ఒక పావు మాత్రమే. ప్రకృతిలో మనకు తెలిసీతెలియకుండా జరిగే అనేకానేక పరస్పరాశ్రిత చర్యలు, అంతర్లీన సమన్వయాలు సమస్త జీవజాలం మనుగడకు కీలకమైన సమతుల్యతను ప్రసాదిస్తూ, పరిరక్షిస్తున్నాయి. మానవాళి ఉనికి ఈ సమతుల్యత మీదే ఆధారపడి ఉంది. ఈ భూమిపై మానవుడికే కాదు- కోటానుకోట్ల సూక్ష్మజీవులు, కీటకాలు, జంతువులు, వృక్షాలకూ హక్కు ఉంది. అందరం భూమాత బిడ్డలమే. భిన్నత్వంలో ఏకత్వమంటే ఇదే. ఈ సత్యాన్ని మనిషికి గుర్తు చేసి జ్ఞానోదయం కలిగించడం ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభం పరమార్థమని గ్రహించాలి. ఇకపై మన వినాశకర జీవన పంథాను సరిదిద్దుకోవాలి. మనిషి తన మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలి తప్ప దురాశకు పోతే దుఃఖం తప్పదని గ్రహించాలి. లాక్‌డౌన్‌లో అవి లేకుండానే నడచిపోతోంది. కాబట్టి మనిషి తన మనుగడకు అవసరమనుకున్నవాటినే ప్రకృతి నుంచి స్వీకరించాలి తప్ప గొంతెమ్మ కోర్కెలకు పోతే చేటు తప్పదని కరోనా హెచ్చరిస్తోంది. ఆత్మసంయమనం వల్ల ప్రాకృతిక వనరులను మితిమీరి కొల్లగొట్టడం నిలచిపోతుంది.

అందరూ సమానమే..

కరోనా వైరస్‌ మానవుల్లో భేదాలను పాటించదు. దాని దృష్టిలో ధనికులైనా పేదలైనా, అధికారం ఉన్నవారైనా, సామాన్యులైనా అందరూ సమానమే. అది దేశనాయకులనూ వదలిపెట్టదు, నిరుపేదనూ విడచిపెట్టదని తేలిపోయింది. మానవుల సంఘర్షణలు, విజయాలు వైఫల్యాలు దాని ముందు వీగిపోవలసిందే. విజేతలు, పరాజితులూ కరోనా ముందు మోకరిల్లాల్సిందే. ప్రకృతిలో మానవులంతా సమానులేనని ప్రవక్తలు మహా నాయకులు చిరకాలంగా బోధిస్తూ వచ్చినా, ఆ బోధలను గౌరవిస్తున్నట్లు నటిస్తూ వచ్చామే తప్ప మనస్ఫూర్తిగా పాటించింది లేదు. ప్రకృతి ఇప్పుడు ఈ పరమ సత్యాన్ని మనకు సుబోధకం చేస్తోంది. నిజమైన ప్రజాస్వామ్య సారమిదే. దాన్ని మనసావాచా కర్మణా ఆచరించకపోతే మనుగడ లేదు. మానవులంతా సమానమని అందరూ గుర్తిస్తే ప్రాకృతిక వనరుల పంపిణి సమానంగా జరుగుతుంది. ఈ వనరులను మన నిత్యావసరాలు తీర్చుకోవడానికి వినియోగించుకోవాలి తప్ప ప్రైవేటు కంపెనీల లాభాలకోసం కాదు. అయినా ఇంతకాలం ప్రైవేటు కంపెనీలు చేసింది ఇదే. కరోనా ఈ పద్ధతి ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. నేడు ఎవరికివారు స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)కన్నా తమ మనుగడ గురించే కంగారు పడుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో వస్తువ్యామోహం వెనక్కుపోయింది. చూసిందల్లా కొనేయాలనే వినియోగదారీ సంస్కృతిని జనం పక్కనపెట్టేసి కనీసావసరాలపైనే దృష్టి నిలిపారు. అమిత లాభాపేక్షతో ప్రకృతిని కొల్లగొడితే అది మన మనుగడకే ముప్పుతెస్తుందని తెలిసివచ్చింది.

సమూలంగా మారాలి..

ఇంతకాలం లాభాల కోసం పోటీలో సాటి మానవుడిని వెనక్కు నెట్టేయాలన్న ఆరాటమే ఎక్కువగా రాజ్యమేలింది. కానీ కరోనా కాలంలో అందరికీ పరస్పర సహకారం ఎంత అవసరమో తెలిసివస్తోంది. అన్నార్తులకు, మూగజీవాలకు అన్నం పెట్టే మానవీయతా మూర్తులు అందరి హృదయాలను ఆనందంతో నింపుతున్నారు. ఇలాంటి పరోపకారులు లేకపోతే లాక్‌డౌన్‌ దుర్భరంగా ఉండేది. ఇకనైనా ఆర్థిక, రాజకీయాలకన్నా కారుణ్యం, సహకారం విధాన నిర్ణయాలకు ప్రాతిపదిక కావాలి. కులం, మతం, జాతీయత, సంస్కృతులను మనుషుల మధ్య విభేదాల సృష్టికి వినియోగించడం మాని సంఘీభావం, సౌభ్రాతృత్వాలను పెంపొందించుకోవాలి. ఏతావతా కరోనాపై సమరం చేయడానికన్నా మనిషీ మనిషీ చేతులు కలిపి ముందుకు సాగడమే ముఖ్యమని తేలుతోంది. పాత వైరాలను కట్టిపెట్టి జగమంతా ఏకతాటిపై నడవాలి. అన్ని దేశాలూ నిర్యుద్ధ సంధులు కుదుర్చుకుని, ఆయుధ నిల్వలను నిర్మూలించి, తమ వివాదాలను ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలి. జాతీయవాదం బదులు అంతర్జాతీయ భావన పెంపొందాలి. వసుధైక కుటుంబకం స్ఫూర్తి వెల్లివిరియాలి. భద్రతా మండలి, వీటో అధికారాలను పక్కనపెట్టి ఐక్యరాజ్యసమితిని ప్రజాతంత్ర పాలనా వేదికగా మలచుకోవాలి. అక్కడ అన్ని దేశాలకూ సమాన ఓటు ఉండాలి. కరోనా సంక్షోభ కాలంలో వివిధ ప్రభుత్వాలు సామాజిక సంక్షేమ వ్యయాన్ని పెంచుతుండగా, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఈ కృషిలో చురుగ్గా పాల్గొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు సమూలంగా మారాలి.

- సందీప్‌ పాండే (రచయిత- రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

ABOUT THE AUTHOR

...view details