కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించింది. మే నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చిన సరికొత్త వ్యాక్సిన్ విధానం కొరగానిదంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరుల జీవన హక్కుకే అది కొరివిగా మారిందంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరించిన నేపథ్యంలో- ప్రధాని మోదీ ముఖతా వెలువడిన నిర్ణయాలు స్వాగతించదగినవి. సమాఖ్య స్ఫూర్తికి పట్టం కడుతూ రాష్ట్రాల అభీష్టం మేరకు వ్యాక్సిన్ల సేకరణలో వాటికీ భాగస్వామ్యం కల్పించామన్న కేంద్రం, పనిలో పనిగా పాతిక శాతం వాటాను ప్రైవేటుకూ కట్టబెట్టి- ఒకే టీకాకు భిన్న రేట్ల కోలాటానికి తెరతీసింది. 45 ఏళ్ల పైబడిన వయో వర్గానికి మాత్రమే ఉచిత వ్యాక్సిన్ల బాధ్యత తనదని కేంద్రం దడి కట్టుకోగా, 18-45 మధ్య వయస్కులకు ఉచిత టీకాలందించాలని సంకల్పించిన రాష్ట్రాలకు వాటి లభ్యత ఎండమావిగా మారింది. దేశవ్యాప్తంగా రెండు కోట్ల 90 లక్షల కేసులు, మూడున్నర లక్షల మంది మృత్యువాతతో కొవిడ్ కరాళ నృత్యం చేస్తున్న దశలో ప్రాణాధార టీకాల సేకరణకు కేంద్రమే పూనుకోవాలన్న రాష్ట్రాల వినతిని మోదీ సర్కారు మన్నించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి 75 శాతం టీకాల్ని కేంద్రమే సేకరించి 18 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందించేలా రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. పాతిక శాతం టీకాల్ని సేకరించే ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాక్సిన్ల ధరకు అదనంగా రూ.150 సేవా రుసుము వసూలు చేసుకోగల వెసులుబాటును కేంద్రం కల్పించింది. ప్రస్తుతం ఉన్న సర్వీస్ ఛార్జీ రూ.50 కాగా, అదనంగా మరో వంద వడ్డింపు దేనికోమరి! దేశీయంగా 80 కోట్ల మంది జనావళికి ఆకలి తీర్చే గరీబ్ కల్యాణ్ అన్న యోజనను దీపావళి దాకా పొడిగించడం ఆనందదాయకమే. టీకాల కోసం 'కొవిన్'లో నమోదు తప్పనిసరి అంటున్న కేంద్రం- ఆ డిజిటల్ అగాధాన్ని గ్రామీణులు నిరక్షరాస్యులు ఎలా అధిగమించాలో పేర్కొనకపోవడం ఆందోళనకరమే!
వ్యాక్సిన్ విధానానికి చికిత్స - టీకా పంపిణీ
ఎట్టకేలకు టీకాల సేకరణ బాధ్యతను నెత్తికెత్తుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటి పంపిణీకి శాస్త్రీయ ప్రాతిపదికల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ల కోసం కొవిన్ యాప్లో నమోదు తప్పనిసరి అయిన నేపథ్యంలో గ్రామీణ నిరక్ష్యరాసులకు వాటిని చేరవేసే మార్గాన్ని రూపొందించాలి.
అందుబాటులో ఉన్న రెండు టీకాలూ కొవిడ్ నుంచి 95 శాతం రక్షణ కల్పించగలవన్న అధ్యయనాలు కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. మరోవంక, ఇప్పటిమాదిరి టీకా కార్యక్రమం మందకొడిన సాగితే- వ్యాక్సిన్ రక్షణ వలయాన్ని ఛేదించగలిగేలా కరోనా ప్రమాదకర ఉత్పరివర్తనాలపై శాస్త్రవేత్తల హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజుకు కోటి టీకాల వంతున వేస్తేనే నిర్దేశిత లక్ష్యాలను చేరగలమంటున్న దశలో- విదేశీ వ్యాక్సిన్ల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విఫల యత్నాలతోనే దాదాపు ఆరు వారాల పుణ్యకాలం కరిగిపోయింది! తమ ఏలుబడిలో 'మిషన్ ఇంద్రధనుష్' ద్వారా పిల్లలకు టీకా రక్షణ ఛత్రాన్ని 60 శాతం నుంచి 90 శాతానికిపైగా విస్తరించామన్న ప్రధాని- అదే చొరవను కొవిడ్ వ్యాక్సిన్ల ముందస్తు సేకరణలో కనబరచకపోబట్టే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇప్పుడు మూడోదశ ప్రయోగాల్లో ఉన్న బయోలాజికల్-ఇ టీకా 30 కోట్ల డోసుల సేకరణ కోసం కేంద్రం ఇటీవల రూ.1500 కోట్లు విడుదల చేసింది. ప్రయోగ దశల్లోనే టీకాల సేకరణకు ముందస్తు చెల్లింపులతో వాటి ఉత్పత్తికి వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా, కెనడా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు నేడు మహమ్మారిని ధీమాగా ఎదుర్కొంటున్నాయి. కొవాక్సిన్, కొవిషీల్డ్‌లకు ఆ తరహా చెల్లింపులలో నెలల తరబడి జాప్యం, నిర్దిష్ట ప్రమాణాలతో టీకాల ఉత్పత్తికి అనివార్యంగా కొన్ని నెలల సమయం పట్టడం- వ్యాక్సిన్లకు ప్రపంచ రాజధానిగా వాసికెక్కిన ఇండియాను వాటికోసం దేబిరించే దురవస్థకు దిగజార్చేశాయి. మూడొంతుల టీకాల సేకరణకు పూచీ పడుతున్న కేంద్రం వాటి పంపిణీకి శాస్త్రీయ ప్రాతిపదికల్ని సిద్ధం చేయాలి. మొబైల్ వ్యాన్ల ద్వారా టీకాల్ని గ్రామాలకు చేర్చి, సర్కారీ సిబ్బందే కొవిన్ ద్వారా పేర్ల నమోదు కానిచ్చి పల్లెలకూ వ్యాక్సిన్ రక్షణ సత్వరం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన కదలాలి!
ఇదీ చూడండి:'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'