ప్రపంచ శాంతి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో విద్యారంగం పాత్ర ఎంతో కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి ఏటా జనవరి 24వ తేదీన అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని 2019 నుంచి నిర్వహిస్తోంది. ఏడాది కాలంగా కొవిడ్ సంక్షోభంతో ప్రపంచ విద్యారంగం అతలాకుతలం అవుతున్నవేళ మూడో అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాం. "కొవిడ్ సంక్షోభాన్ని చవిచూసిన తరం కోసం విద్యారంగాన్ని పట్టాలకెక్కించి, పునరుజ్జీవింపజేయడం" అనే భావనకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రాచుర్యం కల్పిస్తోంది. అంతర్జాతీయ సమాజం కాంక్షించిన 17 లక్ష్యాల సాధనకు విద్య దన్నుగా నిలబడుతుందని సమితి భావిస్తోంది. "స్థిరమైన సమాజాలను నిర్మించడంలో భాగంగా ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, కొత్త ఆవిష్కరణల ప్రేరేపణకు విద్య ఒక శక్తిమంతమైన ఆయుధం లాంటిది" అని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే అంటారు. పేదరికాన్ని అధిగమించకుండా, పర్యావరణ రక్షణకు ఉపక్రమించకుండా, లింగ దుర్విచక్షణను రూపుమాపకుండా, సాంకేతికతను వినియోగించకుండా, సార్వజనీన విద్య కోసం నిబద్ధతతో కూడిన రాజకీయ కార్యాచరణ లేకుండా మనం ఎప్పటికీ విజయం సాధించలేమన్న ఆయన మాట ముమ్మాటికీ నిజం.
బట్టబయలైన అసమానతలు
కొవిడ్ మహమ్మారి విలయతాండవానికి విద్యావ్యవస్థ విచ్ఛిన్నమైంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడటంతో సుమారు 190 దేశాల్లోని 160 కోట్లమందికి పైగా విద్యార్థుల అభ్యసన ప్రక్రియకు విఘాతం కలిగింది. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా సాంకేతిక బాట పట్టి విద్యావ్యవస్థ మనుగడను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో ఆన్‌లైన్ విద్యాబోధన మొదలైనా- మూడోవంతు విద్యార్థులు దాన్ని అందుకోలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సామాజిక, ఆర్థిక, సాంకేతికపరమైన అసమానతలను కొవిడ్ సంక్షోభం బట్టబయలు చేసింది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఒక్కసారిగా ఊపందుకోవడం హర్షించదగిన పరిణామం. అప్పటివరకు సాంకేతికతకు దూరంగా ఉన్న బోధన సిబ్బంది సైతం డిజిటల్ నైపుణ్యాలను అలవరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మహమ్మారి కల్లోలం సృష్టించినా- ప్రపంచాన్ని మేల్కొలిపింది. సంక్షోభాన్ని అధిగమించి, విద్యా వ్యవస్థను తిరిగి పట్టాలకెక్కించేందుకు అవసరమైన శక్తియుక్తుల అన్వేషణకు ఊపిరులూదింది. మన అభ్యసన పరిధుల్ని పెంచుకునే, వినూత్న ప్రక్రియలు చేపట్టే అవకాశాలను ఇచ్చింది.
చదువు ఓ ప్రాథమిక హక్కు. దాన్ని కాపాడటం అందరి బాధ్యత. కానీ వాస్తవం భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లమందికి పైగా పిల్లలు బడులకు వెళ్లడంలేదు. విద్యాలయాలకు వెళుతున్నవారిలో సుమారు 62 కోట్లమంది చిన్నారులు, కిశోర వయస్కులైన బాలబాలికలకు చదవడం, చిన్న చిన్న లెక్కలు చేయడంవంటివీ రావు. ఆఫ్రికా ఖండంలో హైస్కూలు విద్యను పూర్తి చేసిన బాలికలు 40 శాతంలోపే. 40 లక్షలమంది శరణార్థులైన పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. యునెస్కో నివేదిక ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు చెందిన నిరుపేద వర్గాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నవారు 50శాతం కంటే తక్కువే. సెకండరీ స్థాయి విద్య పూర్తి చేస్తున్నవారు పదోవంతు మాత్రమే. బాలికల్లో అయితే కేవలం రెండు శాతమే సెకండరీ స్థాయి విద్యకు నోచుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యాహక్కును వినియోగించుకోలేని స్థితిలో ప్రజలు ఉండటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.