తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జీవ ఇంధనంపై కేంద్రం దృష్టి- ఆహార భద్రతకు ముప్పుందా? - పెట్రోల్​

పెట్రోల్‌, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి ఇథనాల్​ వాడకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. చెరకు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, వెదురు వంటి వాటితో పాటు అక్కరకురాని ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే జీవ ఇంధనమే ఇథనాల్‌. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్​ను కలపడం ద్వారా చమురు దిగుమతులకయ్యే ఖర్చును తగ్గించుకోవడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని భారత్‌ భావిస్తోంది. ఇంధన భద్రతను పెంచుకొనేందుకు ఇలా ఆహార పదార్థాలను ఇంధనంగా వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు పెద్ద యెత్తున ముప్పు వాటిల్లనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ethanol used in petrol
ఇథనాల్‌

By

Published : Jul 11, 2021, 8:18 AM IST

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. మరోవైపు ఆ శిలాజ ఇంధనాల కారణంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు పర్యావరణానికి పెనుసవాలుగా మారుతున్నాయి. ఇ(ఇథనాల్‌)-20 లక్ష్యసాధనతో ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చెరకు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, వెదురు వంటి వాటితోపాటు అక్కరకురాని ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే జీవ ఇంధనమే ఇథనాల్‌. పెట్రోల్‌లో 20శాతం కలపడం ద్వారా చమురు దిగుమతులకయ్యే ఖర్చును తగ్గించుకోవడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని భారత్‌ భావిస్తోంది. దేశీయంగా ప్రస్తుతం పెట్రోల్‌లో 8.5 శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు. వచ్చే ఏడాదికల్లా దీన్ని పది శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2023 నాటికి 20 శాతం మేళవింపును తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే ఏటా చమురు దిగుమతులకు పెట్టే ఖర్చులో రూ.30 వేల కోట్ల మేర ఆదా అవుతుంది.

లక్ష్య సాధనకు రాయితీలు

పెట్రోల్‌తో సులభంగా కలవడం ఇథనాల్‌ ప్రత్యేకత. అలాగని పెట్రోల్‌ మాదిరిగా పర్యావరణానికి హాని చేయదు. మరోవైపు చెరకు, ఆహార పంటలకు గిరాకీ పెరుగుతుంది కాబట్టి రైతుకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇక కాలుష్య కారకమైన కార్బన్‌మోనాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను ముప్ఫై నుంచి యాభైశాతం వరకు తగ్గించుకోవచ్చు. ఈ కారణాల వల్లనే ఇథనాల్‌ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అపారమైన వ్యవసాయ క్షేత్రాలు, మిగులు ధాన్యాలు, ఇథనాల్‌ను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ భారత్‌కు సానుకూల అంశాలు. స్థానికంగా తయారైన ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల ఇంధన భద్రతను సాధించడంతోపాటు- స్థానిక వ్యాపారులు, రైతులూ ఇంధన రంగంలో భాగస్వాములు అవుతారు. 2018లోనే ఇందుకు సంబంధించి జాతీయ జీవ ఇంధనాల విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇథనాల్‌ వాడకాన్ని క్రమంగా పెంచడం, అందుకు తగ్గట్టు వాహనాల తయారీలో చేయాల్సిన మార్పుల వంటి విషయాలపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఇ-20 లక్ష్యాన్ని సాధించాలంటే సమారు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సగటున భారత్‌- మొలాసిస్‌ను వాడి 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగం ఆల్కహాల్‌ తయారీకి వినియోగిస్తోంది. 60 కోట్ల లీటర్లను వివిధ రకాల రసాయనాల తయారీలో వాడుతోంది. మిగిలిన 100 కోట్ల లీటర్లను ఇ-10 లక్ష్యం కోసం ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు విక్రయిస్తోంది. ఇథనాల్‌ సాయంతో సరికొత్త జీవ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనేది కేంద్రం ఉద్దేశం. ఇందుకోసం 2021-22లో 35 లక్షల మెట్రిక్‌ టన్నుల చక్కెర నిల్వలను ఇథనాల్‌ తయారీ కోసం వినియోగించనున్నారు. అలాగే 73,000 టన్నుల మిగులు ఆహార ధాన్యాలను అందించేందుకు ఎఫ్‌సీఐ సిద్ధమైంది. కొవిడ్‌ అనంతర పరిణామాల్లో భాగంగా రాబోయే రోజుల్లో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగవచ్చనేది ఒక అంచనా. అదే జరిగితే కాలుష్య స్థాయులూ పెరుగుతాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వాహనాలు ఇథనాల్‌ వాడకానికి అనువుగా ఉండాలంటే వాటి ఇంజిన్లలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహన తయారీదారులకు ప్రభుత్వం పన్ను రాయితీలను ప్రకటిస్తోంది. ఇథనాల్‌ తయారీ సంస్థలు, వినియోగదారులను ఆ మేరకు రాయితీలతో ప్రోత్సహిస్తోంది.

ఆహార భద్రతకు ముప్పుందా?

చమురు దిగుమతులకయ్యే ఖర్చు తగ్గించుకొనేందుకు, భూతాపాన్ని అదుపు చేసేందుకు అమెరికా, బ్రెజిల్‌, ఐరోపా సమాఖ్య దేశాలు రెండు దశాబ్దాలుగా ఇథనాల్‌ వాడకాన్ని మూడురెట్లు పెంచాయి. ఇంధన భద్రతను పెంచుకొనేందుకు ఇలా ఆహార పదార్థాలను ఇంధనంగా వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు పెద్దయెత్తున ముప్పు వాటిల్లనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్త ఆహార ధాన్యాల్లో మూడు శాతం వాటిని జీవ ఇంధనం తయారీ కోసమే వెచ్చిస్తున్నారు. ఆఫ్రికాలో ఆహార ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణం జీవ ఇంధనాలే అన్న వాదనా ఉంది. ఇథనాల్‌ తయారీతో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా వంటివాటి ధరలు పెరిగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. మనదేశం విషయానికే వస్తే చెరకు, ప్రధాన ఆహార ధాన్యాలైన వరి, గోధుమలు సాగునీటిలో 70 శాతం నీటిని వాడుకుంటున్నాయి. ఆ ప్రకారం ఒక లీటరు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలంటే సుమారుగా మూడువేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇందుకోసం భూగర్భ జలాల్ని విపరీతంగా వాడేస్తే, కరవు పెచ్చరిల్లుతుంది. అందుకే ఇథనాల్‌ కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని నీతిఆయోగ్‌ అభిప్రాయపడుతోంది. దేశీయంగా ఆ మేరకు ప్రయోగాలూ ఊపందుకొంటున్నాయి. ప్రాజ్‌ వంటి సంస్థలు పంట వ్యర్థాల నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాయి. పంజాబ్‌, హరియాణాల్లో ఏటా పంట వ్యర్థాలను దహనం చేసే బదులు ఇథనాల్‌ తయారీలో వాడుకోవాలి. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, ఆహార భద్రతకు ముప్పు రాకుండా- ఇథనాల్‌ తయారీ, వినియోగం వైపు అడుగులు వేస్తేనే మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి.

ముందు వరసలో బ్రెజిల్‌, అమెరికా..

పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను విజయవంతంగా వినియోగించుకుంటున్న దేశాల్లో బ్రెజిల్‌ ముందువరసలో ఉంది. చెరకును అధికంగా పండించే బ్రెజిల్‌ 1977లోనే ఈ జీవ ఇంధనం వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఇంధన ఉత్పత్తిలోకి అమెరికా అడుగుపెట్టడానికి ముందు వరకు, బ్రెజిల్‌దే పైచేయి. మొత్తం ఇథనాల్‌ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల వాటా 87 శాతానికి మించి ఉండటం విశేషం. స్వీడన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలు సైతం ఇథనాల్‌ వాడకాన్ని పెంచుతున్నాయి. మొత్తం 60 దేశాలు ఈ ఇంధనం తయారీలో చురుగ్గా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం బ్రెజిల్‌లో కరవు తాండవిస్తోంది. దానితో భారత్‌ తయారు చేయబోయే ఇథనాల్‌పై ప్రపంచ దేశాల దృష్టి పడింది. చైనా సైతం పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై నిశితంగా దృష్టి సారించింది. జీవ ఇంధన తయారీ కోసం మలేసియా, ఇండొనేసియాల నుంచి పెద్దయెత్తున కర్రపెండలం దుంపలను దిగుమతి చేసుకుంటోంది.

- శ్రీసత్యవాణి గొర్లె

ఇవీ చదవండి:గ్యాస్ సిలిండర్లు నీటిలో విసిరి నిరసన

ABOUT THE AUTHOR

...view details