'మీ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకుని నా భూమిని దానం చేస్తున్నాను. కానీ, సమస్య పరిష్కారానికి ఇది దోహద పడదనుకుంటాను. ప్రతి ఒక్కరూ హృదయ పరివర్తనం చెంది భూదానం చేయడం అసాధ్యం కదా!'- ఆచార్య వినేబాభావే ముందు బిహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ వ్యక్తి వెలిబుచ్చిన సందేహమిది. 'మీరు గతంలో కాంగ్రెస్ అనుయాయి. ఇప్పుడు సామ్యవాది. మరి ఇతరులు మారరని మీరెలా చెప్పగలరు?' అన్నది ఆచార్యుల సమాధానం! మానవ హృదయ పరివర్తనంపై అచంచల విశ్వాసంతోనే భూదాన యజ్ఞానికి బాపూజీ ప్రియశిష్యుడు నడుంకట్టారు. ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజు (1951 ఏప్రిల్ 18) హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి గ్రామంలో భూమి లేని పేదలకు పంచడానికి ఆచార్య వినోబాభావేకు వెదిరె రాంచంద్రారెడ్డి వంద ఎకరాలను దానం చేశారు. అలా ఓ చిన్న పల్లెలో పురుడు పోసుకున్న భూదాన ఉద్యమం ఆ తరవాత దేశవ్యాప్తమైంది. భూమి కోసం హింసాత్మక ఉద్యమాలు సాగుతున్న కాలంలో మహాత్ముడి అహింసా మార్గంలో భూ సంస్కరణలకు పోచంపల్లిలో పునాది పడింది. ఈ డెబ్భై ఏళ్లలో భూదాన ఉద్యమం సాధించిందేమిటి? ఎన్ని పేద కుటుంబాలకు మేలుచేసింది? భూదాన ఉద్యమ సప్తతి ఉత్సవాల (డెబ్భై ఏళ్ల సంబరాలు) సందర్భంగా ఆ స్ఫూర్తిని మననం చేసుకుంటూ, ఆ వెలుగులో భవిష్యత్తు కార్యాచరణకు బాటలు వేసుకోవాలి.
అలా మొదలైంది..
హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో 1951 ఏప్రిల్‌లో జరిగిన సర్వోదయ సమావేశానికి ఆచార్య వినోబాభావే వచ్చారు. అది ముగిశాక పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్ 17న పోచంపల్లికి చేరుకుని, గ్రామస్థులతో సమావేశమయ్యారు. తమకు కొద్దో గొప్పో భూమి ఉంటే జీవనోపాధి లభిస్తుందన్న పేదల మాటలు ఆయనలో ఆలోచన రేకెత్తించాయి. 'ఈ పేదలకు భూమి ఇప్పించడానికి మనమేమి చేయగలం' అని మరుసటిరోజు గ్రామస్థులను అడిగారు వినోబా. తన భూమిలోంచి వంద ఎకరాలను దానం చేయడానికి స్థానిక భూస్వామి వెదిరె రాంచంద్రారెడ్డి ముందుకొచ్చారు. అప్పటికప్పుడు దానపత్రం రాసి వినోబాభావేకు అందించగా, భూమి లేని పేదలకు పంపిణీ చేశారు. అలా ప్రారంభమైన ఉద్యమం.. రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. వినోబాభావే దేశమంతా 64 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 48.67 లక్షల ఎకరాల భూమిని స్వీకరించారు. భూదానంలో ఝార్ఖండ్ (14.69 లక్షల ఎకరాలు), బిహార్ (6.48), ఒడిశా (6.38), రాజస్థాన్ (5.46), ఉత్తర్ ప్రదేశ్ (4.36), మధ్యప్రదేశ్ (4.10) తొలి వరసలో నిలిచాయి. అలా సమకూరిన భూమిలోంచి 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారు. అప్పట్లో దేశంలో ఉన్న ముప్పై కోట్ల ఎకరాల సాగుభూమిలో అయిదు కోట్ల ఎకరాలను దానంగా పుచ్చుకోవాలని భావించినా, అరకోటి ఎకరాలే లభించాయి.
భూదాన ఉద్యమం ఆరంభమైన ఏడాదికే గ్రామదాన కార్యక్రమంగా రూపుదాల్చింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మంగ్రోత్ వాసులు తమ ఊరిలోని మొత్తం భూములను దానం చేసి, తొలి గ్రామదాతలయ్యారు. వ్యక్తిగత భూములను గ్రామసభకు గానీ, దాని ఆధ్వర్యంలోని సంఘానికి గానీ అప్పగించి, గ్రామస్థులందరూ కలిసి సహకార పద్ధతిలో సాగుచేసుకోవడమే 'గ్రామదానం', దీంతో 'భూమి' ఉమ్మడి ఆస్తి అవుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని వేల గ్రామాలు తమ ఊళ్లలోని మొత్తం భూమిని దానంగా ఇచ్చాయి. గ్రామదానంతో ఆగకుండా తాలూకా, జిల్లా దానాలూ జరిగాయి. మహాత్మాగాంధీ శతజయంతి (1969 అక్టోబర్ 2) నాటికి దేశంలోని అన్ని పల్లెలను గ్రామదాన గ్రామాలుగా మార్చాలని వినోబా లక్ష్యంగా ఉండేది. వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. మొదట్లో భూ యజమానులు ఆరోవంతు భూమిని దానం చేయాలని కోరిన వినోబా, ఆ తరవాత కాలంలో ఇరవయ్యో వంతును ఇవ్వాలని అభ్యర్థించారు.
భూహక్కుల యజ్ఞం కావాలి!