తెలంగాణ

telangana

ETV Bharat / opinion

టెలికాం సంస్కరణలతో లాభమెంత? - టెలికాం రంగ విధానాల గురించి చెప్పండి?

టెలికాం రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించింది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. అయితే.. ప్రధాన కంపెనీల మధ్య ఉన్న అహేతుక ధరలే అసలు సమస్య అన్నది నిపుణుల మాట.

telecom
టెలికాం

By

Published : Oct 19, 2021, 5:43 AM IST

టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం పాదుకొనేలా కొత్త సంస్థలను ప్రోత్సహించడం, తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడటానికి నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలు చేపట్టినట్లు సెప్టెంబర్‌ 15న కేంద్రం ప్రకటించింది. పతనం అంచున ఉన్న వొడాఫోన్‌ ఐడియాను గట్టెక్కించి, టెలికాం రంగంలో రెండు సంస్థల ఆధిపత్యాన్ని నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లుగా కనపడుతోంది. స్పెక్ట్రమ్‌, ఏజీఆర్‌(సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిలు, బ్యాంకు రుణాల కారణంగా పేరుకుపోయిన రూ.1.8లక్షల కోట్ల అప్పుల నుంచి ఉపశమనం కల్పించాలంటూ వొడాఫోన్‌ ఐడియా ఇటీవల టెలికాం మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత సుంకాలు తగ్గించాలని, 5జీ స్పెక్ట్రమ్‌కు తక్కువ మూలధరను నిర్ణయించాలని సీఓఏఐ(సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. సంస్కరణల్లో భాగంగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్‌ నిర్వచనంలోంచి మినహాయించింది. భవిష్యత్తులో వేలం వేయబోయే స్పెక్ట్రమ్‌పై వినియోగ రుసుము (ఎస్‌యూసీ)లను రద్దు చేసింది. స్పెక్ట్రమ్‌ గడువును 20ఏళ్ల నుంచి 30ఏళ్లకు పెంచి, పదేళ్ల తరవాత స్పెక్ట్రమ్‌ను తిరిగిచ్చే వెసులుబాటును కల్పించింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌పై పెనుభారం..

టెలికాం పరిశ్రమ ప్రస్తుత దయనీయ స్థితికి ఆయా సంస్థలు అవలంబించిన అశాస్త్రీయ విధానాలే కారణం. వ్యాపారాన్ని వేగంగా విస్తరించుకునేందుకు అవి అహేతుక ధరలను అనుసరించాయి. ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లతో భారత టెలికాం సంస్థలు బయటకు ఆకర్షణీయంగానే కనిపిస్తున్నా- ప్రభుత్వ ఖజానా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆర్థిక వ్యవస్థలపై అవి భరించలేని భారాన్ని మోపుతున్నాయి. 2016లో 4జీతో రంగంలోకి వచ్చిన రిలయన్స్‌ జియో ఉచిత వాయిస్‌, అతితక్కువ డేటా ధరలతో పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అప్పటివరకు వాయిస్‌ కాల్స్‌ ద్వారా 50శాతానికిపైగా ఆదాయాన్ని అర్జించిన వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు.. జియో ధాటికి 2018లో విలీనమయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం దీనికి తట్టుకోగలిగింది. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌పై పెనుభారం పడింది. సంస్థ మార్కెట్‌ వాటాకు గండిపడింది. అవసరమైన స్పెక్ట్రమ్‌ కేటాయింపులో ప్రభుత్వ ఉదాసీనతతో ల్యాండ్‌లైన్‌ చందాదారులను కోల్పోయింది. వివిధ కారణాల రీత్యా సర్కారు సమకూర్చిన రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఇప్పుడు ఆ సంస్థ మనుగడ సాగిస్తోంది. సుంకాల తగ్గింపు, రాయితీలతో తక్షణ ప్రయోజనాలు సిద్ధించినా, దీర్ఘకాలంలో అది చేటుచేస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం, ట్రాయ్‌ అర్థంచేసుకోవాలి. వస్తువులు, సేవలను వాటి అసలు ధరల కన్నా తక్కువకు విక్రయించకూడదని గ్రహించాలి.

కాల్స్‌, డేటా చౌకగా లభ్యమవుతుండటంపై మరోవైపు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల యువత దారితప్పుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేశాభివృద్ధిలో చౌక డేటా కీలక పాత్ర పోషిస్తుందన్న వాదనలో నిజం లేదు. మానవాభివృద్ధికి సంబంధించి వివిధ దేశాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారత్‌తో పోలిస్తే ఒక జీబీ డేటా ధర నాలుగు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండే అమెరికా, జర్మనీ, జపాన్‌, కెనడా తదితరాలు అనేక అంశాల్లో మనకు అందనంత దూరంలో ఉన్నాయి. ఇటీవలి కాలం వరకు అత్యల్ప టారిఫ్‌లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా (ఒక జీబీ డేటాకు 0.26 డాలర్లు) అగ్రస్థానంలో ఉండేది. బకాయిలను తగ్గించుకునేందుకు ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచక తప్పలేదు. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి ఒక జీబీ డేటాకు 0.68 డాలర్లు ఖర్చవుతోంది. ప్రపంచ సగటు ధరతో (ఒక జీబీకి 4.21డాలర్లు) పోలిస్తే ఇది చాలా తక్కువ! టారిఫ్‌ల పెంపుపై సీఓఏఐ, ఎయిర్‌టెల్‌లు కొంతకాలంగా గళమెత్తుతున్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ముందుకొచ్చి ధరలు పెంచే ధైర్యం చేయగలుగుతారన్నదే ప్రధాన ప్రశ్న.

అనేక లాభాలు..

ఒక కుటుంబం నెలవారీ వ్యయంలో టెలికాం ఖర్చులు సుమారు అయిదు శాతం ఉంటాయని అంచనా. మిగిలిన 95శాతం ఖర్చులు గత ఇరవై ఏళ్లలో 300శాతం పెరిగాయి. అదే సమయంలో టెలికాం వ్యయం మాత్రం లోగడతో పోలిస్తే తొంభై శాతానికి పైగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ధరలను హేతుబద్ధం చేస్తే టెలికాం సంస్థల బకాయిలు తగ్గుతాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టకుండానే, కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకొనేందుకు అవి మూలధనం సమకూర్చుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సామాన్యులకు పెనుభారమవుతున్న ఇంధన ధరలను తగ్గించడానికి అవకాశం చిక్కుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తగ్గి, అవి వృద్ధి బాట పడతాయి. అనవసర డేటా వినియోగం నియంత్రణలోకి వస్తుంది. భూతాపాన్ని కొంతమేర తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.

- ఎం.ఆర్‌.పట్నాయక్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖ రీజియన్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌)

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details