తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Harish Rao on Fuel price: '16సార్లు పెంచి... ఒక్కసారి తగ్గించి.. మేలు చేసినట్లు కేంద్రం డ్రామా'

అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతాయంటూ భాజపా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao on Fuel price) అన్నారు. నిజాయతీగల సర్కార్ అంటూనే దేశప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ‘సెస్సు’ పోటే ఈ పెట్రోలు, డీజిలు ధరలు ఆకాశాన్నంటడానికి ముఖ్య కారణమని తెలిపారు. 16 సార్లు ధరలు పెంచి, ఒక్కసారి తగ్గించి ప్రజలకు మేలు చేసినట్లు నటిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలంటూ ఉచిత సలహా ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Harish Rao on Fuel price
Minister Harish Rao on Fuel price

By

Published : Nov 13, 2021, 7:53 AM IST

పెట్రోలు, డీజిలు ధరల(Fuel price hike) విషయంలో కేంద్రం వైఖరి గిచ్చి జోల పాడినట్లుంది. పెట్రోలుపై అయిదు రూపాయలు, డీజిలుపై పది రూపాయలు తగ్గించిన తీరు- పెంచింది కొండంత... తగ్గించింది పిసరంతగా ఉంది. 2018 నుంచి పెట్రోలు, డీజిలు రేట్లను భాజపా ప్రభుత్వం ఎట్లా పెంచిందో పరిశీలిస్తే అసలు విషయం మనకు బోధపడుతుంది. పెట్రోలు, డీజిలు ధర పెరిగినప్పుడల్లా ‘అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగింది కాబట్టి... మేం పెంచక తప్పదు’ అని కేంద్రం చెబుతోంది. 2013-14లో అంతర్జాతీయ విపణిలో బారెల్‌ ముడిచమురు (ఇండియన్‌ బాస్కెట్‌) సగటు ధర 105.52 యూఎస్‌ డాలర్లు. అప్పుడు దేశంలో లీటరు పెట్రోలు(Petro price) రేటు రూ.77, డీజిలు రేటు(Diesel price) రూ.68. ప్రస్తుతం బారెల్‌ ముడిచమురు సగటు ధర కేవలం 83 డాలర్లు మాత్రమే. అంటే 2013-14 నాటి ధర కన్నా 22 డాలర్లమేర తగ్గింది. అయినా పెట్రోలు, డీజిలు ధరలు రూ.100కు పైనే ఉన్నాయి. ముడి చమురు ధర పడిపోతే పెట్రోలు, డీజిలు ధరలు తగ్గాలి కదా... తగ్గకపోగా పెరగడమేమిటి? అదే మాయ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల మీద మోపిన ‘సెస్‌’ మాయ.

సమాఖ్య స్ఫూర్తికి తూట్లు

అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే పెట్రోలు, డీజిలు ధరలు(fuel price) పెరుగుతాయంటూ భాజపా ప్రభుత్వం చెబుతోంది. ఇది పచ్చి అబద్ధం. ‘మాది నిజాయతీగల పార్టీ. దేశభక్తి మీద పేటెంట్‌ హక్కులు మావే’ అని చెప్పుకొనే భాజపా ఇలాంటి పచ్చి అబద్ధాలతో దేశప్రజలను దారుణంగా వంచిస్తోంది. ఏదైనా యుద్ధం సంభవించి ముడిచమురు సరఫరా ఆగిపోతేనో; లేక ఒపెక్‌ దేశాలు చమురు వెలికితీతను, మన దేశం చమురు దిగుమతులను తగ్గిస్తేనో కొరత ఏర్పడి ధరలు పెరగడం సహజం. కానీ, ముడిచమురు అందుబాటులో ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గింది. అయినా పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం(central government) విధిస్తున్న ‘సెస్సు’ పోటే ఈ పెట్రోలు, డీజిలు ధరలు ఆకాశాన్నంటడానికి ముఖ్య కారణం. కేంద్రం పెట్రోలు మీద వేసే ఎక్సైజ్‌ సుంకం, సెస్‌ 2014 నుంచి ఫిబ్రవరి 2021 నాటికి 247శాతం, డీజిలు మీద 793శాతం చొప్పున పెంచి- కేంద్ర సర్కారు వీర బాదుడుకు తెగబడితే ధరలు ఎందుకు పెరగవు? 2014 నుంచి 2020 మధ్య కాలంలో ముడి చమురు ధరలు గణనీయంగా క్షీణించినప్పటికీ మన దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు మాత్రం ఆకాశాన్నంటడానికి వెనకున్న అసలు కారణం ఇదే. 2014 జూన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర 109 డాలర్లు ఉండగా, అది 2020 మే నెల నాటికి 30.61 డాలర్లకు క్షీణించింది. కానీ, కేంద్రప్రభుత్వ పన్నుపోటుతో పాటు అదనంగా విధించిన సెస్సువల్ల అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గకపోగా- ప్రజలపై తీవ్రభారం పడింది.

ఇక్కడ కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచిన సంగతీ చెప్పాలి. కేంద్రం పన్ను వేస్తే ఆ ఆదాయం రాష్ట్రాలకు పంచాల్సి వస్తుంది. అలాకాకుండా తన ఖజానాను నింపుకోవడానికి భాజపా ప్రభుత్వం కొత్త సూత్రం కనిపెట్టింది. రాష్ట్రాలతో ఆదాయాన్ని పంచుకునే బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీని క్రమంగా తగ్గిస్తూ, కేంద్ర ఆదాయం పెరిగేలా స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్‌లను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. దానివల్ల రాష్ట్రాలకు ఆదాయంలో వాటా ఇవ్వవలసిన అవసరం ఉండదు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని పెట్రోలు, డీజిలుపై పన్నులు పెంచడమే. 2015, 2020, 2021 మధ్య కాలంలో అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా తగ్గినా, కేంద్రం మాత్రం ప్రజలకు ఊరట కలిగేలా ధరలు తగ్గించలేదు. 2016 నుంచి 2021 వరకు కేంద్రం క్రమంగా రాష్ట్రాలకు పంచాల్సిన బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీని లీటరు పెట్రోలు మీద రూ.9.48 నుంచి రూ.1.40కు (52.8శాతం నుంచి 5శాతానికి), డీజిలు మీద రూ.11.33 నుంచి రూ.1.80కు (79.9శాతం నుంచి 8.3శాతానికి) తగ్గించింది. ఇది రాష్ట్రాల మీద ఎంత ఆర్థిక ప్రభావం చూపిస్తుందో, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు గండి కొడుతుందో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. 2014-15లో పెట్రోలియం రంగం నుంచి వచ్చిన మొత్తం ఆదాయం రూ.3,32,620 కోట్లు. దీనిలో కేంద్ర ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.1,72,065 కోట్లు (52శాతం). రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం రూ.1,60,554 కోట్లు (48శాతం). 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్రాల ఖజానాలకు సమకూరిన ఆదాయం రూ.6,72,719 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే అమాంతం రూ.4,55,069 కోట్లకు (68శాతం) పెరిగింది. రాష్ట్రాల వాటా మాత్రం 32శాతానికి పడిపోయింది. ఈ వాటా ప్రకారం రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం రూ.2,17,650 కోట్లు మాత్రమే. 2014-15 నుంచి 2020-21 వరకు పెట్రో రంగం ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో కేంద్రం వాటా 58శాతం నుంచి 68శాతానికి... అంటే పది శాతం మేర పెరగ్గా, రాష్ట్రాల వాటా 48శాతం నుంచి 32శాతానికి పడిపోయింది. అంటే 16శాతం మేర క్షీణించింది. ఇది కేంద్రం చేసిన మాయాజాలం. ఏడేళ్లలో రాష్ట్రం వాటా 16శాతం తగ్గిపోగా, ఇప్పుడు కేంద్రం కంటి తుడుపుగా పెట్రోలు మీద రూ.5, డీజిలు మీద రూ.10 తగ్గించి రాష్ట్రాలు సైతం తగ్గించాలని సూచించడం- రాష్ట్రాలను క్రూరంగా పరిహసించడమే.

భాజపా నేతల వింత వాదన

తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై వ్యాట్‌ రేట్లను 2015లో పెంచిందని రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. గడచిన ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం(Telangana government) ఒక్క రూపాయీ పెంచలేదు. కేంద్రం మాత్రం 16 సార్లు పెట్రోలు, డీజిలుపై పన్ను రేట్లను పెంచింది. ఇదేమిటని ప్రశ్నిస్తే భాజపా నేతలు తత్తర బిత్తర సమాధానాలిస్తూ, అసలు విషయాన్ని దాటవేస్తున్నారు. ముడిచమురు ధరలు క్షీణించినా పెట్రోలు, డీజిలు రేట్లు ఎందుకు తగ్గించలేదని భాజపా నేతలను ప్రశ్నిస్తే- దేశభక్తి లేనివాళ్లే ప్రశ్నిస్తారని వింత వాదన చేస్తున్నారు. వారికి ఒకటే ప్రశ్న... యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగితే కమలం పార్టీ నేతలు ఎందుకు నానా యాగీ చేశారు? ఆనాడు అదే దేశభక్తి ఏమైంది? ఇవాళ అధికార పీఠంపై ఉండి సమాధానం చెప్పాల్సి వస్తే, ధర పెంచడమే దేశభక్తి అనే తీరు దేశ ప్రజలను వంచించడం కాకపోతే ఏమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఒక భాజపా నేత అసలు పెట్రోలుతో దేశ ప్రజలకు ఏం సంబంధం అన్న పిచ్చి ప్రశ్నలు లేవనెత్తడం భాజపా నేతల డొల్ల సమాధానాలకు ఉదాహరణ. తన ఆదాయం పెంచుకోవడానికి భాజపా సర్కారు ప్రజలను పన్నుపోటుతో పొడిచిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పెట్రో, డీజిలు మంటతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడటంతో కమలం పార్టీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు పెట్రో ధరల సెగ తీవ్రంగా తగిలింది. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికలను మరి కొద్ది నెలల్లో ఎదుర్కోవాల్సి రావడంతో భాజపా కంటి తుడుపు చర్యగా పెట్రోలు, డీజిలు రేట్లను పిసరంత తగ్గించి, దానికే కొండంత రాగం తీస్తోంది. ఇది రాజకీయ వికృత క్రీడ. 16 సార్లు ధరలు పెంచి, ఒక్కసారి తగ్గించి ప్రజలకు మేలు చేసినట్లు నటిస్తోంది. రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. దీనివల్ల కేంద్రం తగ్గించినా రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదన్న రీతిలో రాష్ట్రాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కుటిల ప్రయత్నం చేస్తోంది. కానీ గణాంకాలను విశ్లేషిస్తే పెట్రోలు, డీజిలు ధరల(reason for fuel price hike) భారానికి కారణం ఎవరో అర్థమవుతుంది. పెట్రోలు ధరల పెంపు పాపానికి కర్తలు ఎవరన్నదీ జనం సరిగ్గా పోల్చుకుంటారు.

(తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా రచయిత వ్యక్తపరచిన అభిప్రాయాలివి)

ABOUT THE AUTHOR

...view details