ఆస్తులకు సంబంధించిన వివాదాలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నంతకాలం అభివృద్ధికి దూరం అవుతున్నట్లేనని సామాజిక సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్ అనేవారు. గత ఏడాది అక్టోబరు 11న ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తిహక్కు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భూమి, ఇంటి యాజమాన్య ధ్రువపత్రాలు సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ, ప్రజల్లో స్వాభిమానాన్ని సాధికారతను పెంపొందిస్తాయి. సరైన హక్కు పత్రాలు కలిగి ఉన్న ప్రజలు పరాధీనత లేకుండా, ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం ఉంటుంది.
తద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. గ్రామ ఆబాది(నివాస ప్రాంతం)లోని స్థిరాస్తులకు సరైన యాజమాన్య హక్కు పత్రాలు లేక గ్రామీణులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్థిరాస్తుల గుర్తింపునకు అశాస్త్రీయ విధానానికి, సాంకేతికత సాయంతో అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం, ప్రజల ఆస్తుల డిజిటలీకరణకు సిద్ధమైంది. భూమి హక్కు పత్రాలు సక్రమంగా లేక పలు నేరాలు-ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల్లోని ప్రజల ఆస్తులకు సక్రమమైన, శాస్త్రీయ పద్ధతిలో రికార్డులు లేక- ఆస్తి ఉన్నా అవసరానికి అక్కరకు రాక అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.
అన్ని రకాల ఆస్తులకు సాంకేతికత
స్వామిత్వ- సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రువైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (ఎస్‌వీఏఎంఐటీవీఏ) కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ద్వారా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ప్రధాని ఈ పథకాన్ని గత సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవమైన ఏప్రిల్ 24న ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆస్తులను తనిఖీ చేసి ధ్రువీకరించడమే ఈ పథకం ఉద్దేశం. దేశంలోని 6.62లక్షల గ్రామాల్లో ఈ పథకం అమలుకానుంది. రాష్ట్రాల్లోని రెవిన్యూ, భూమి రికార్డుల విభాగాలు నోడల్ విభాగంగా వ్యవహరిస్తూ, సంబంధిత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సహకారంతో ఈ పథకం అమలవుతోంది. సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక భాగస్వామిగా సేవలందిస్తోంది. డ్రోన్ల ద్వారా సర్వే చేసే సాంకేతికతతో గ్రామీణ ప్రాంతాల పరిధిలోని భూములకు హద్దులను నిర్ణయించి, డిజిటల్ పటం తయారు చేస్తున్నారు. అనంతరం గ్రామాల్లో నివసించే, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను కలిగి ఉన్న కుటుంబ యజమానులకు ఆస్తి హక్కుల రికార్డును అందిస్తారు. హక్కు పత్రాల ద్వారా బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణసౌకర్యం, ఆర్థికపరమైన లబ్ధి పొందడం ద్వారా ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. సంస్థాగత రుణ పరపతి లభిస్తుంది. ఆస్తి కార్డుల జారీ ద్వారా గ్రామంలోని అన్ని స్థిరాస్తులూ ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయి. గ్రామ పంచాయతీల పాలన మెరుగవుతుంది. ప్రజల ఆస్తులే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం సర్వే చేసి హద్దులను నిర్ణయిస్తున్నారు. ఇలా అన్ని రకాల ఆస్తులకు సాంకేతికత సాయంతో హక్కు పత్రాలు జారీచేయడంవల్ల బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి.