కరోనా మహమ్మారి విద్యార్థుల అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బడుల మూసివేతతో తరగతి బోధన కుంటువడి విద్యార్థుల్లో చురుకుదనం లోపించిందని, ఆన్‌లైన్ విద్య అభ్యసనంలో అంతరాలను సృష్టించిందని పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్, దూరవిద్యా విధానాలు, పిల్లల్లో అభ్యసనం తీరు వంటి అంశాలపై 'సర్వే ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ రెస్పాన్సెస్‌టు కొవిడ్-19 స్కూల్ క్లోజర్స్' పేరుతో యునెస్కో, యునిసెఫ్, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ, ప్రపంచబ్యాంకులు నిర్వహించిన ఉమ్మడి అధ్యయనంలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. విద్యార్థుల అభ్యసనంపై కొవిడ్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని అధ్యయనం వెల్లడించింది. అభ్యసనంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు, నష్టాన్ని నివారించేందుకు ప్రపంచంలోని మూడో వంతు దేశాలే చర్యలు చేపడుతున్నాయని, వాటిలో ఎక్కువగా ధనిక దేశాలే ఉన్నాయని సర్వే పేర్కొంది.
ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే దీని పర్యవసానం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ఉండబోతుందని హెచ్చరించింది. ఇప్పటికే దేశీయంగా 'అసర్, నేషనల్ అసెస్‌మెంట్ సర్వే(ఎన్‌ఏఎస్)'లు పలు రాష్ట్రాల్లో విద్యార్థుల్లో పునాదిస్థాయి ప్రమాణాలు క్షీణించినట్లు పేర్కొన్నాయి. పాఠశాలలో అభ్యసించే పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలు విద్యార్థి సమగ్ర వికాసానికి పునాది వేస్తాయి. పిల్లలు విభిన్నమైన నేపథ్యాల నుంచి పాఠశాలకు వస్తారు. పరిసరాలు, బోధనాంశాలు తదితరాలు విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు. తరగతిగది బోధన విద్యార్థుల సంక్షేమం, వికాసాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారిలో నైపుణ్యాలను, వైఖరులను, సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు తోడ్పడుతుంది. కాబట్టి పాఠశాలకు, అభ్యసనానికి విడదీయరాని సంబంధం ఉందని విద్యావేత్తలు చెబుతారు.
కొవిడ్ మహమ్మారితో భారత్‌లో ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు చాలా వరకు ప్రాథమిక భావనలు మరిచిపోయారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని మెజారిటీ విద్యార్థులు చదవడం, రాయడం, గుణించడం వంటి కనీస అభ్యసన సామర్థ్యాల్లో వెనకబడ్డారు. క్రమశిక్షణ దెబ్బతిని, ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రఖ్యాత ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ నేతృత్వంలో పదిహేను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అధ్యయనంలో వెలుగు చూసిన చేదు వాస్తవాలివి. సుదీర్ఘకాలంగా బడులు మూతపడటం వల్ల గ్రామీణ భారతంలో 37శాతం, పట్టణాల్లో 19శాతం విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. మిగిలిన పిల్లల అభ్యసనంపైనా కరోనా పెనుప్రభావమే చూపినట్లు డ్రెజ్ బృందం గుర్తించింది. కరోనా కష్టకాలంలో క్రమం తప్పకుండా ఆన్‌లైన్ పాఠాలు విన్న విద్యార్థుల సంఖ్య గ్రామీణంలో ఎనిమిది శాతంకాగా- పట్టణాల్లో 24శాతంగా తేలింది. గ్రామాల్లోని దళితులు, ఆదివాసీ విద్యార్థి సమూహాల్లోనైతే ఆన్‌లైన్ బోధనకు నోచుకొన్న విద్యార్థులు నాలుగు శాతమే. బడుల మూసివేత కారణంగా తమ పిల్లల పఠన, రాత నైపుణ్యాలు బాగా తగ్గిపోయాయని 65శాతం తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వే అభ్యసన నష్టాన్ని, సామాజిక అంతరాలను నొక్కి చెబుతోంది.