సుందర్‌లాల్ బహుగుణ... భారత్‌లో పర్యావరణ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన మహోన్నత మార్గదర్శి. మహాత్మాగాంధీ అహింసా ఉద్యమ స్ఫూర్తితో బహుగుణ నేతృత్వంలో నడిచిన చిప్కో ఉద్యమం- దేశంలో అడవుల సంరక్షణకు బాటలు పరచింది. ప్రకృతి పరిరక్షణలో ప్రభుత్వ వ్యవస్థలు అనుసరిస్తున్న లోపభూయిష్ఠ విధానాలను వెన్ను చరిచి తట్టి లేపింది. హిమాలయాల్లో విచక్షణారహితంగా సాగే అడవుల నాశనం, తవ్వకాలు, పెద్ద ఆనకట్టల నిర్మాణాలను బహుగుణ ప్రజాస్వామిక పద్ధతుల్లో దీటుగా ఎదుర్కొన్నారు. స్థానికులతో కలిసి బలమైన ఉద్యమాలు నిర్మించారు. సుస్థిర అభివృద్ధి నినాదం ప్రాతిపదికన అడవులను కాపాడుతూనే, వాటిపై ఆధారపడిన ఆదివాసులకు జీవనోపాధులను అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని కార్యాచరణలో చేసి చూపారు. సుదీర్ఘ కాలం ప్రజా పర్యావరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన బహుగుణ- 94 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు.
సుందర్‌లాల్ బహుగుణ 1927 జనవరి తొమ్మిదో తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెహ్రీ వద్ద ఉన్న మరోడా అనే మారుమూల గ్రామంలో జన్మించారు. తండ్రి అంబదత్ తేహ్రీ గఢ్వాల్ రాజాస్థానంలో ఉద్యోగి. తల్లి పూర్ణాదేవి. బహుగుణ విద్యాభ్యాసం ఉత్తర కాశి, తెహ్రీలలో సాగింది. స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీదేవ్ సుమన్‌తో ఏర్పడ్డ పరిచయంతో ఉద్యమాల బాట పట్టారు. తెహ్రీ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడిన శ్రీదేవ్ సుమన్ జైలులో ఆమరణ దీక్ష చేస్తూ మరణించారు. బహుగుణ లాహోర్‌లో పట్టభద్రుడై వచ్చి శ్రీదేవ్ సుమన్ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ పోరాట బాట పట్టారు. 1956లో విమలను వివాహం చేసుకొన్నాక షిలియర ప్రాంతంలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. వినోబాభావే సారథ్యంలోని సర్వోదయ ఉద్యమం వెంట నడిచారు.
వనాల కోతపై ఉద్యమబాట
హిమాలయ పర్వత శ్రేణుల్లో విలువైన ప్రకృతి సంపద ఉన్నా, స్థానికులు పేదరికంలో మగ్గుతుండటాన్ని బహుగుణ గమనించారు. 1965 నుంచి ఆరేళ్ల పాటు పర్వత ప్రాంతాల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడి ప్రజల సాంఘిక అలవాట్లు, దురాచారాలను గుర్తించి వారిలో మార్పునకు విశేష కృషి చేశారు. నగరాల్లో అభివృద్ధి పేరిట వాణిజ్య ప్రయోజనాల కోసం.. హిమాలయ సానువుల్లో విచక్షణారహితంగా సాగుతున్న వనాల కోతను సహించలేకపోయారు. అడవులు భూగోళానికి ఊపిరితిత్తుల వంటివని, వాటిని పరిరక్షించుకుంటేనే మానవులకు మనుగడ అని, అలాంటప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమని స్థానికులకు ఉద్బోధించారు. 1973లో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు, అధికారులకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొలిపి చిప్కో ఉద్యమానికి రూపకల్పన చేశారు. వృక్షాలను కౌగలించుకుని ఉండటం ద్వారా వాటిని నరికేందుకు వచ్చే అధికారులకు నిరసన తెలియజేయడం చిప్కో ఉద్యమ ఉద్దేశం. అహింసా పద్ధతిలో సాగిన ఈ ఉద్యమంలో స్థానిక ఆదివాసీ మహిళలు ఎంతో చైతన్యవంతులై పాల్గొన్నారు. ప్రభుత్వాల్లో చలనం కొరవడిన స్థితిలో- 1979లో బహుగుణ ఆమరణ దీక్షకూ దిగారు. హిమాలయాల్లో వేల కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజలను కదిలించారు. అటవీ సత్యాగ్రహంగా పేరొందిన ఆ ఉద్యమంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్పందించి- లోపభూయిష్ఠ విధానాలను సవరించేందుకు నడుం కట్టారు. చిప్కో ఉద్యమంతోనే 1980 అటవీ పరిరక్షణ చట్టం రూపకల్పనకు బీజం పడింది. ప్రజాప్రయోజనార్థం అడవులకు కోత పెడితే- దానివల్ల ప్రయోజనం పొందే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నష్టపరిహారం చెల్లించడం సహా ప్రత్యామ్నాయంగా వనాలను పెంచే విప్లవాత్మకమైన కొత్త నిబంధన అమలవడం మొదలైంది.