ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ నేతల సమావేశం సానుకూల వాతావరణంలో సాగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరమనే సందేశాన్ని అందించింది. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా గతంలో ప్రకటించారు. అదే విషయాన్ని ఈ సమావేశంలోనూ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల నిర్వహణ, కాల్పుల విరమణలతో పరిస్థితులు కాస్త కుదుటపడుతున్న తరుణంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఇదే సరైన సమయమని పార్టీలు పేర్కొన్నాయి.
ప్రజామోదం తప్పనిసరి!
స్థానికంగా శాంతి నెలకొనాలంటే మోదీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రజామోదం తప్పనిసరి! ఆ మద్దతును కూడగట్టుకోవడంలో కేంద్రానికి, ప్రజలకు మధ్య స్థానిక పార్టీలు వారధులుగా నిలవగలుగుతాయి. ఈ అవసరాన్ని కేంద్రం గుర్తించినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తికాగానే ఎన్నికలు జరుపుతామని దిల్లీ నాయకత్వం ప్రకటించింది. పునర్విభజనపై జమ్మూకశ్మీర్ నేతలు మొదట కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ సహకరిస్తామనడం మరో సానుకూలాంశం.
దానిపై ఉమ్మడి స్వరం..
తమలో తాము ఎంత కలహించుకొంటున్నా 370 అధికరణ రద్దుపై మాత్రం వారందరూ ఉమ్మడి స్వరాన్నే వినిపిస్తున్నారు. ఆ మేరకు న్యాయపోరాటాన్ని కొనసాగించడంలో రాజీ లేదనే ఇప్పటికీ చెబుతున్నారు. గురువారం నాటి సమావేశం ఎంతవరకు సఫలమవుతుందనే దానిపై కొన్ని అనుమాన మేఘాలు కమ్ముకొన్నా- వాటిని పటాపంచలు చేస్తూ సుహృద్భావ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. ప్రజా ప్రాతినిధ్యం లేని అస్థిర పాలనా పరిస్థితుల నుంచి జమ్మూకశ్మీర్‌ను ఒడ్డునపడేసే రాజకీయ ప్రక్రియకు అంకురారోపణ చేసింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను తొలగించి, భౌగోళికంగా విభజించి కేంద్ర పాలనలోకి తీసుకురావడం తదితరాలు ఇంటాబయటా తీవ్ర చర్చను రేకెత్తించాయి. దీన్ని తీవ్రమైన నమ్మక ద్రోహంగా స్థానిక పార్టీలు అభివర్ణించాయి. 370వ అధికరణ రద్దు అనంతర పరిస్థితులను నిభాయించడానికి దశాబ్దాలుగా మిత్రులుగా ఉంటున్న నాయకులను నిర్బంధంలో ఉంచడంపై విమర్శలు రేగాయి. సమాచార సేవలను నిలిపేయడంపైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. వీటన్నింటిపై జరుగుతున్న చర్చకు సమాధానమిచ్చేలా గురువారం భేటీ సాగింది. కశ్మీర్‌లో పునాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించే బాధ్యతను ఆయా పార్టీల సాయంతో కేంద్రం తలకెత్తుకున్న భావన దీనితో వ్యక్తమైంది. జమ్మూకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికల నిర్వహణను చారిత్రక ఘట్టంగా బీజేపీ అంతకు మునుపు పేర్కొంది.