భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్‌కి ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తూ ఉండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముకుల్‌తో పాటు అనేకమంది ఇప్పటికే తృణమూల్‌లో చేరిపోయారు. దీంతో ఇలా ఇంకెంతమంది పార్టీని వీడతారనే చర్చ జోరందుకుంటోంది. దాదాపు నాలుగేళ్లు టీఎంసీకి దూరంగా ఉన్న ముకుల్ రాయ్, తనయుడు సుభ్రాన్షుతో కలిసి ఇటీవలే సొంత గూటికి చేరారు. ఈ పరిణామం కొత్తగా ప్రతిపక్ష హోదాను సంపాదించుకున్న కమలదళం గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు కనిపించకుండా భాజపా ధైర్యం కనబరుస్తోంది.
చేసిందేమీ లేదు..
67ఏళ్ల ముకుల్ దూరమైతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే వాదనలను ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కొట్టిపడేశారు. పార్టీకి ముకుల్ చేసిందేమీ లేదని, ఆయన వెళ్ళిపోయినా నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. కథలో అసలు మలుపు ఇక్కడే ఉంది. కొన్నేళ్లుగా పార్టీలో ఫిరాయింపులు సర్వసాధారణమయ్యాయి. ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ వలసదారులను భాజపా రెండు చేతులతో స్వాగతించిన తీరు మాత్రం పశ్చిమ్ బంగ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడనిది. కమలదళం వేసిన ఈ ఎత్తుగడకు రెండు కారణాలు ఉన్నాయి.
ఒకటి, తృణమూల్ కాంగ్రెస్‌ను గట్టిదెబ్బ కొట్టాలని ఎన్నో ఏళ్లుగా భాజపా ఎదురుచూస్తోంది. రెండోది, కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడే అభ్యర్థులకు కాషాయ కండువా కప్పాలని నిర్ణయించుకుంది. ఆ ఎన్నికల్లో మొత్తం 293 సీట్లలో బరిలోకి దిగిన భాజపా, 148 స్థానాల్లో వలస పక్షులను నిలబెట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారిలో ఆరుగురు మాత్రమే గెలుపొందడం గమనార్హం.
సువేందుకు బ్రహ్మరథం
కమల దళానికి ముకుల్ రాయ్ అవసరం ఉందన్నది వాస్తవం. ఇతరుల్లాగా ముకుల్ ఎన్నికల సమయంలో పార్టీ మారలేదు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లు, అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల ముందే, 2017 నవంబర్‌లో భాజపాలో చేరారు. 2019 సార్వత్రికంలో పశ్చిమ్ బంగలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 18 సీట్లలో కాషాయ పార్టీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భాజపా ఈ స్థాయిలో పుంజుకొందంటే దానికి కారణం ముకుల్ అని స్పష్టమవుతుంది. ముకుల్ వ్యూహాలు లేకపోతే ఉత్తర పశ్చిమ్ బంగ, మథువా సంఘానికి మంచి పట్టు ఉన్న ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాల్లో భాజపా గెలుపొందడం అసాధ్యమయ్యేది!
ఇక ముకుల్ విషయానికొస్తే కొత్త ఇంట్లో ఆయనకు పరిస్థితులు సహకరించలేదు. శారదా, నారదా కుంభకోణాలతో సంబంధం ఉన్న ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. చివరికి 2020 సెప్టెంబర్‌లో భాజపా ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఆ తరవాత సువేందు అధికారి రాకతో కథ పూర్తిగా మారిపోయింది.
పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మినబంటుగా పేరొందిన సువేందు అధికారి, ఎన్నికల వేళ టీఎంసీని వదిలి భాజపాలో చేరారు. దీదీని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్న కమల శ్రేణులు సువేందుకు బ్రహ్మరథం పట్టాయి. ఆ ప్రభావం ముకుల్ మీద తీవ్రంగా పడింది. భాజపాలో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడే వచ్చిన సువేందు ఎన్నికల్లో భాజపా ముఖచిత్రంగా మారిపోయారు. అయినప్పటికీ ముకుల్ భాజపాను వీడలేదు. తనకు ఇష్టం లేనప్పటికీ, పార్టీ నిర్ణయం మేరకు తొలిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకుని తొలిసారి శాసనసభ్యుడిగా పశ్చిమ్ బంగ అసెంబ్లీలో అడుగుపెట్టారు. పుండు మీద కారం చల్లినట్టు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ముకుల్‌ను కాదని సువేందును ఎన్నుకుంది భాజపా. ముకుల్‌కి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఆలస్యం చేయకుండా టీఎంసీ తలుపుతట్టారు.
టీఎంసీలో ముకుల్ స్థానమేమిటి?
అసెంబ్లీ ఎన్నికల్లో 213 సీట్లు గెలిచి దేశానికి తన శక్తిని చాటిచెప్పిన మమతా బెనర్జీకి ముకుల్ ఏ విధంగా సహాయపడతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు టీఎంసీకి ముకుల్‌ని చేర్చుకునే అవసరం ఏముంది? అభిషేక్ బెనర్జీ ఇప్పటికే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను సాధించుకున్నారు, ఇక పార్టీలో ముకుల్ స్థానం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ ముకుల్ వద్ద సమాధానాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
అనేకమంది భాజపా నేతలు ఇప్పటికీ తనతో సన్నిహితంగానే ఉన్నారని, రేపో మాపో వారు కూడా టీఎంసీలో చేరతారని ముకుల్ సంకేతాలిచ్చారు. ఉత్తర 24 పరగణాలలోని బగ్దా నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ ఇప్పటికే ప్రత్యక్షంగా టీఎంసీపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటం ముకుల్ మాటలకు బలం చేకూరుస్తోంది.
వాస్తవానికి దాస్ కూడా టీఎంసీ మనిషే. రెండుసార్లు పార్టీ టికెట్‌పై గెలుపొంది, ముకుల్ పిలుపుతోనే ఆయన భాజపాలో చేరారు. మథువా సంఘంపై పట్టు ఉన్న దాస్ టీఎంసీలో చేరితే ఇక భాజపా నుంచి వలసలు పెరగడం ఖాయం! అదే జరిగితే, రెండు ప్రశ్నలు కమలదళాన్ని వెంటాడతాయి. ఫిరాయింపులు పెరిగిపోతే క్షేత్రస్థాయిలో భాజపా పట్టు కోల్పోతుందా, దిలీప్ ఘోష్ అన్నట్టు కాకుండా ముకుల్ రాయ్ కమలదళాన్ని వీడటం పార్టీకి ఊహకందని విధంగా చేటుచేస్తుందా, అని భాజపా శ్రేణులు ఇప్పటికే ఆలోచనల్లో మునిగిపోయాయి.
పురులియా ఎమ్మెల్యే ముఖోపాధ్యాయ్, రణఘాట్ ఉత్తర-పశ్చిమ్ ఎమ్మెల్యే పార్థసారథి ఛటోపాధ్యాయ్‌లు విశ్వజిత్ సన్నిహితులని ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు కేంద్ర మంత్రిపదవి దక్కలేదన్న అలకతో భాజపా యువమోర్ఛా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సౌమిత్రా ఖాన్‌కు పార్టీ వీడేందుకు అనేక కారణాలు ఉన్నాయి. మరి ముకుల్ కారణంగా భాజపాలో వలసలు పెరుగుతాయా, పశ్చిమ్ బంగలో వికసించకముందే కమలం వాడిపోతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి!
- దీపాంకర్ బోస్