తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పర్యావరణానికి ఘన వ్యర్థాల సవాలు!

గ్రామీణ ప్రాంతాల్లో వెలువడుతున్న వ్యర్థాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇష్టారాజ్యంగా చెత్తను పడేయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠమైన వ్యూహాలతో, సమగ్ర నిర్వహణకు వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది.

Solid waste emanating from rural areas is becoming a challenge to the environment
పర్యావరణానికి ఘన వ్యర్థాల సవాలు!

By

Published : Mar 31, 2021, 6:42 AM IST

గ్రామీణ భారతంలో ఇంటి నుంచి వెలువడే ఘనవ్యర్థాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇష్టారాజ్యంగా చెత్తను పడేయడంవల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఊపందుకున్న నేపథ్యంలో- ఘన వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయి సవాలుగా పరిణమిస్తున్నాయి. విస్తరిస్తున్న జనాభా, మారుతున్న ఆహార అలవాట్లవల్ల వ్యర్థాలు అధికంగా పోగుపడుతున్నాయి. ప్రజల జీవనవిధానంలో మార్పులు చోటు చేసుకున్న తరుణంలో- ఎక్కడికక్కడ 'వాడి పారవేసే (యూజ్‌ అండ్‌ త్రో)' సామగ్రి పేరుకుపోతోంది. దీంతో వ్యర్థాల సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఇళ్లు, వీధి కూడళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి- ఊరి బయట గుమ్మరించడమే ఏళ్ల తరబడి ఇండియాలో కొనసాగిన చెత్త విధానం.

అశాస్త్రీయ విధానాలతో ముప్పు

భారత్‌లో ఏటా 27.7 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తవుతున్నట్లు అంచనా. 2030నాటికి దీనికి రెట్టింపు వ్యర్థాలు పోగుపడతాయని భావిస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠమైన వ్యూహాలతో, సమగ్ర నిర్వహణకు వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది. ఎన్నో దేశాలు చెత్త నుంచి ప్రయోజనాలు పొందుతున్నాయి. ఇండియాలో మాత్రం పునశ్శుద్ధి, సరైన నిర్వహణ లేకపోవడంవల్ల క్యాన్సర్‌, ఉబ్బసం వంటి 22 రకాల వ్యాధులు పడగ విప్పుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి రోజూ వెలువడుతున్న చెత్తలో 15శాతం పునర్వినియోగానికి అనువైనదని ఐఐటీ కాన్పూర్‌ అధ్యయనం వెల్లడించింది. చెత్తను ఏరే పనిలో అయిదు లక్షల మందికి జీవనోపాధి కల్పించవచ్చనీ సూచించింది. వ్యర్థాల నిర్వహణలో సమర్థంగా వ్యవహరించకపోతే అనర్థం తప్పదు. చెత్తను టన్నులకొద్దీ పేరబెట్టినా, అశాస్త్రీయ పద్ధతుల్లో తగలబెట్టినా- ఇటు ప్రజారోగ్యానికి, అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లక మానదు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లేమి; గృహ, సమాజ స్థాయిలో స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక, సరైన అవగాహన లేక ఘన వ్యర్థాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గతంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2000 రూపొందించింది. ఈ నిబంధనలను 2016లో సవరించారు. 73వ రాజ్యాంగ సవరణ, 1992 ద్వారా పారిశుద్ధ్యాన్ని పదకొండో షెడ్యూల్‌లో చేర్చడంవల్ల గ్రామాల్లో సక్రమ పారిశుద్ధ్య నిర్వహణ- పంచాయతీ రాజ్‌ సంస్థల పరిధిలోకి వచ్చింది. ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యర్థాల నిర్వహణ విధానాలను గ్రామ పంచాయతీలు నిర్ణయించుకోవాలి. అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో క్రియాశీలకమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. గ్రామ పంచాయతీలు ప్రజలందరికీ స్వచ్ఛమైన, నివాసయోగ్యమైన వాతావరణాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి చేయడం ముఖ్యమైన ప్రక్రియలు. గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచీ వెలువడే చెత్తను సేకరించాలి. తడి, పొడి చెత్తగా వేరుచేయడంలో ప్రజలకు అవగాహన కల్పించాలి.ముఖ్యంగా మహిళలకు ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పరచాలి. నిత్యం ప్రజలతో ఉంటూ, చెత్త సేకరణలో పారిశుద్ధ్య కార్మికులు ప్రభావాన్విత పాత్ర పోషిస్తారు కనుక- వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.

బహుళ ప్రయోజనాలు

గ్రామీణ ప్రాంతాల్లో వెలువడే గృహ వ్యర్థాలు ఎక్కువగా శుద్ధి చేయడానికి అనుకూలంగా, సేంద్రియ ఎరువుగా మార్చడానికి వీలుగా ఉంటాయి. గృహ వ్యర్థాలను ఇంటి వద్దే వేరు చేసి, వ్యర్థాల నిర్వహణను చేపట్టేలా అవగాహన కల్పించాలి. వ్యర్థాల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం పెరిగి, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడుతుంది. గ్రామ పంచాయతీలు తమకు అనువైన సాంకేతికతను ఎంచుకునేలా అవగాహన కల్పిస్తే అమలు సులభతరమవుతుంది. వ్యర్థాలను పునర్వినియోగించే ప్రయత్నాలు చురుగ్గా జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో తడి చెత్త అధికంగా వెలువడుతుంది కనుక కంపోస్టింగ్‌ చేయడం అత్యంత అనుకూలమైన, పర్యావరణ హితకరమైన పద్ధతి. అందుకు 'నాడెప్‌' విధానం, బెంగళూరు పద్ధతి, ఇండోర్‌, వర్మీ కంపోస్టింగ్‌, రోటరీ డ్రమ్‌ కంపోస్టింగ్‌, బయోగ్యాస్‌ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో వర్మీ కంపోస్టింగ్‌ అత్యంత అనుకూలమైన, సులువైన విధానం. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారుచేసి ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు, రైతులకు ఎరువును సరసమైన ధరలకు అందించవచ్చు. చెత్త నిల్వ చేసే ప్రదేశాలను సమర్థంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి. సేంద్రియ ఎరువుల ఉత్పత్తితో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నేల సారం కోల్పోకుండా ఉంటుంది. మంచి దిగుబడినీ సాధించవచ్చు. ఇలా అర్థవంతంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థంగా చేపట్టడం- ప్రజానీకానికి శ్రేయోదాయకం, పర్యావరణానికీ హితకరం.

రచయిత- ఎ.శ్యామ్‌కుమార్‌

ABOUT THE AUTHOR

...view details