తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దుర్వినియోగమవుతున్న సామాజిక మాధ్యమాలు - Social media being abused

విద్వేషం వెళ్లగక్కడానికి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే ధోరణి ఇటీవల ప్రపంచమంతటా పెచ్చరిల్లింది. అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి తర్వాత జాత్యహంకార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాల పాత్రపై నిరసనాగ్రహాలు పెల్లుబుకుతున్నాయి. ఈ మాధ్యమాలపై ఒత్తిడి పెంచి దారికితీసుకురావాలని మేధావులు పిలుపునిస్తున్నారు.

Social media
దుర్వినియోగమవుతున్న సామాజిక మాధ్యమాలు

By

Published : Sep 2, 2020, 9:40 AM IST

ఇతర జాతులు, మత వర్గాలపై విద్వేషం వెళ్లగక్కడానికి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే ధోరణి ఇటీవల ప్రపంచమంతటా పెచ్చరిల్లింది. అమెరికాలో తెల్లజాతి పోలీసు అధికారుల దాష్టీకానికి జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు మరణించాక జాత్యహంకార వ్యాప్తిలో- సామాజిక మాధ్యమాల పాత్రపై నిరసనాగ్రహాలు పెల్లుబుకుతున్నాయి. ఈ మాధ్యమాలపై ఒత్తిడి పెంచి దారికి తీసుకురావాలని మేధావులు పిలుపిస్తున్నారు. దీనికి యూనీలీవర్‌ వంటి భారీ బహుళజాతి సంస్థ స్పందించి ట్విటర్‌, ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లకు ఈ ఏడాది చివరి వరకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది లేదని ప్రకటించింది. ఈ నిషేధం అమెరికాకే తప్ప- తనకు అతిపెద్ద మార్కెట్‌ అయిన భారతదేశానికి వర్తించదని వివరించింది. ఇంతలోనే విద్వేష ప్రసంగాల సెగ భారత్‌లో ఫేస్‌బుక్‌నూ తాకింది. విఖ్యాత అమెరికన్‌ పత్రికలు ‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, టైమ్‌ మ్యాగజైన్‌’ ప్రచురించిన కథనాలు ఈ సెగకు కారణాలు.

జల్లెడ పట్టడంలో వైఫల్యం

తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్‌ ముస్లిములపై విరుచుకుపడుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టారని, ఈయనే కాకుండా కపిల్‌ శర్మ, అనంత్‌ కుమార్‌ హెగ్డే వంటి భాజపా నాయకులూ తరచూ రెచ్చగొట్టే పోస్టులు పెడుతుంటారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. దిల్లీ, బెంగుళూరులలో మతపరమైన అల్లర్లు పేట్రేగడం వెనక ఈ పోస్టింగుల పాత్రా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. రాజాసింగ్‌ పోస్టులను చూసి, ఆయన్ను 'ప్రమాదకర వ్యక్తి'గా పరిగణించి, ఆయన పోస్టింగులను నిషేధించాలంటూ ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కోరారని, వారి సూచనను ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారిణి అంఖీ దాస్‌ తోసిపుచ్చడమే కాకుండా సమావేశం నుంచి వాకౌట్‌ చేశారని టైమ్‌, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపాయి. భారతీయ జనతా పార్టీ నాయకులపై చర్య తీసుకుంటే, అది భారతదేశంలో ఫేస్‌బుక్‌ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అంఖీ దాస్‌ చెప్పినట్లు తెలిసింది.

భారత్‌లో ఫేస్‌బుక్‌కు 30కోట్ల మంది, దాని అనుబంధ వాట్సాప్‌కు 40కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. భారత్‌తోపాటు, అనేక దేశాల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను నియంత్రించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్టెర్న్‌ సెంటర్‌ నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లు వెలువరించే పోస్టులను జల్లెడ పట్టే పనిని బయటివారికి అవుట్‌ సోర్సింగ్‌ ఇవ్వడం దీనికి ప్రధాన కారణమని ఆ నివేదిక వివరించింది. భారత్‌లో 30 కోట్లమంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల పోస్టులను నియంత్రించడానికి సరిపడా మాడరేటర్‌ సిబ్బంది ఫేస్‌బుక్‌కు లేరు. విదేశీ పత్రికలు, మేధావి బృందాలు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాయని, వాటి కథనాలను సాక్ష్యాధారాలుగా పరిగణించలేమని భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్ఘాటించారు.

అమెరికా, ఐరోపాలలో మాదిరిగా భారత్‌లోనూ హింసాకాండను రెచ్చగొట్టాలని వామపక్ష బృందాలు విదేశీ పత్రికలకు డబ్బిచ్చి, జాతీయవాద వ్యతిరేక కథనాలను రాయిస్తున్నాయని భాజపా జాతీయ ఐటీ, సామాజిక మాధ్యమ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఖేమ్‌ చంద్‌ శర్మ వ్యాఖ్యానించారు. గత ఫిబ్రవరిలో భాజపా నాయకుడు కపిల్‌ మిశ్రా దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారి పనిపడతామని హెచ్చరించిన తరవాత- కొన్ని గంటల్లోనే అల్లర్లు మొదలయ్యాయి. విద్వేష ప్రసంగానికి ఇది మచ్చుతునక అంటూ ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఆ పోస్టును తొలగించారు. రాజాసింగ్‌ పోస్టుల్లో కొన్నింటిని ఫేస్‌బుక్‌ తొలగించిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. మరోవైపు తాను ఎటువంటి విద్వేష పూరిత పోస్టింగ్‌లు పెట్టలేదని, తనకు ఫేస్‌బుక్‌ ఖాతాయే లేదని రాజా సింగ్‌ ట్విటర్‌లో వివరించారు. తన పేరు మీద ఎవరో పోస్టులు పెట్టినట్లు ఆరోపించారు. వాట్సాప్‌, భాజపా కుమ్మక్కు కావడంవల్లే ఫేస్‌బుక్‌లో విద్వేష ప్రసంగాలను నియంత్రించడం లేదని టైమ్‌ పత్రిక వెలువరించిన వార్తను ఉటంకిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడగా, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆ విమర్శలను తోసిపుచ్చారు.

భావోద్వేగాల పునాదులపై...

ఒక్కటి మాత్రం నిజం. సామాజిక మాధ్యమాలు వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, భావోద్వేగాలను అనుక్షణం అల్గొరిథమ్స్‌ సాయంతో గమనిస్తూ, వాటిని డిజిటల్‌ వాణిజ్య ప్రకటనల మార్కెటింగ్‌కు ఉపయోగించుకొంటున్నాయి. ఈ మాధ్యమాలు సొంతంగా ఏమీ ప్రచురించవు. వినియోగదారులకు భావ వ్యక్తీకరణ వేదికలుగా మాత్రమే పనిచేయడం వల్ల చట్టం నుంచి తప్పించుకోగలుగుతున్నాయి. దీన్ని నివారించాలంటే పత్రికలు, టీవీల మాదిరిగానే సామాజిక మాధ్యమాలను చట్టపరిధిలోకి తీసుకురావాలని అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. సొంత వెబ్‌ సర్వర్‌ ఉంటే ఇంటర్నెట్‌లో ఎవరైనా సరే ఎవరితోనైనా సంభాషించవచ్ఛు స్వీయానుభవాలు, వీడియోలు, ఫొటోలను పంచుకోవచ్ఛు ఎవరైనా సరే ఈమెయిల్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ సర్వర్లను ఏర్పరచవచ్ఛు బిగ్‌ బ్లూబటన్‌ ఉచిత సాఫ్ట్‌ వేర్‌ సాయంతో ఐఐటీ ప్రొఫెసర్లు ఇప్పటికే ఈ పనులు చేస్తున్నారు. పాఠాలు చెబుతున్నారు. ఇలా ఉచిత సాఫ్ట్‌వేర్‌లతో సమాఖ్య పద్ధతిలో వెబ్‌ సేవలను అందించే సౌలభ్యాన్ని అందరికీ అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- కైజర్‌ అడపా

ABOUT THE AUTHOR

...view details