ఎండిన డొక్కలు, మాడిన పేగులతో అల్లాడుతున్న అభాగ్యులు ఒక పక్క... టన్నుల కొద్దీ ఆహారాన్ని చెత్తకుప్పల్లోకి విసిరేస్తున్న కడుపు నిండిన మనుషులు మరోపక్క. ప్రస్తుతం అన్ని దేశాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 82 కోట్ల మంది కడుపులు మాడుతూ, పస్తులు ఉంటుండగా, అదే సమయంలో మానవ వినియోగం కోసం ఉత్పత్తి అవుతున్న ఆహారంలో మూడింట ఒక వంతు మట్టి పాలవుతోంది. దేశాలకతీతంగా ఆహార సంక్షోభం పెచ్చుమీరుతున్న వేళ... ఈ స్థాయిలో జరుగుతున్న వృథా మరింతగా ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 29వ తేదీని ఆహార నష్టం, వృథాపై అంతర్జాతీయ అవగాహన దినంగా పాటిస్తోంది.
నిర్వహణ లోపమే శాపం
ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న పండ్లు, కూరగాయల్లో రెండో వంతు వృథా చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఓ సర్వేలో గుర్తించింది. ఒక్క అమెరికాలోనే ఏటా బయట పడేస్తున్న అన్ని రకాల ఆహార పదార్థాల విలువ పెద్దమొత్తంలోనే ఉంటోందని పేర్కొంది. ఆహార పదార్థాల వృథాకు తోడు తాగునీరులో సగం వ్యర్థమవుతోందని స్పష్టం చేసింది. లాటిన్ అమెరికాలో వృథా అవుతున్న ఆహారంతో 30 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చనేది ఒక అంచనా. ఇక బ్రిటన్‌లో ఏడాదికి 67 లక్షల టన్నుల ఆహారం చెత్తకుప్పల పాలవుతోంది. బ్రిటన్‌వాసులు తాము కొనుగోలు చేస్తున్న మొత్తం ఆహారంలో 32 శాతాన్ని తినకుండానే బయట పడేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 1,600 గృహాల్లో చేసిన ఓ సర్వేలో సగటున ఒక్కో ఇంట్లో 5 వేల డాలర్ల విలువ చేసే ఆహారాన్ని కొనుగోలు చేస్తూ, వృథాగా పడేస్తున్నారని గుర్తించారు. మరోవైపు... ఆఫ్రికా దేశాల్లో సరైన ఆహార శుద్ధి, నిల్వ వసతులు లేక పెద్దయెత్తున ఆహారం వృథా అవుతోంది. ఎంతో విలువైన ఆహారం ఎవరికీ దక్కకుండా మట్టిపాలవుతోంది. దీన్ని కనుక సక్రమంగా వినియోగించుకోగలిగితే 4.8 కోట్ల మంది కడుపులు నింపవచ్ఛు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో సరైన మౌలిక వసతులు లేక పంట కోత దశలోనే ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. వీటిలో పండ్లు, కూరగాయల వాటా అధికం. అలాగే, కెన్యా తదితర దేశాల్లో 9.5 కోట్ల లీటర్ల పాలు ఏటా నేల పాలవుతున్నాయి. ఆసియా దేశాల్లో చైనాలో ఏటా 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృథాగా మారుతున్నాయి. మొత్తం ఉత్పత్తిలో పదోవంతు ఇలా చెత్తబుట్టల పాలవుతోందని, దీన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే చైనా జనాభాలో ఆరోవంతు మంది ఆహార అవసరాలు తీరతాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఏటా 1.2 కోట్ల టన్నుల పండ్లు, 2.1 కోట్ల టన్నుల కూరగాయలు వృథా అవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మట్టిపాలవుతున్న ఆహారానికి రెట్టింపు స్థాయిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వృథా జరుగుతోందని ఐక్యరాజ్యసమితి ఆహారం, వ్యవసాయ పర్యవేక్షణ సంస్థ అంచనా వేసింది. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఏటా తలసరి ఆహార వృథా 95 కిలోల నుంచి 115 కిలోలదాకా ఉంటోంది.