తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్‌కు అబె... ఓ మంచి నేస్తం! - భారత్​పై జపాన్ ప్రధాని అభిప్రాయం

భారత్​కు ఉన్న మిత్ర దేశాల్లో జపాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక బంధాలు ఇందుకు ప్రధాన కారణం. భారత్‌-జపాన్‌ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయమనే చెప్పాలి. అనారోగ్య కారణాలతో జపాన్ ప్రధాని పదవికి షింజో అబే రాజీనామా చేయడం వల్ల ఆ శకం ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో షింజో అబే రాజకీయ జీవితం, భారత్​తో అనుబంధంపై ప్రత్యేక కథనం మీ కోసం.

India japna bilateral ties
భారత్ జపాన్ బంధంలో షింజో అబే పాత్ర

By

Published : Sep 1, 2020, 9:51 AM IST

రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తరవాత జపాన్‌ ఆర్థికంగా దెబ్బతిని అవమాన భారంతో ఉంది. ఈ క్రమంలో 1957లో ఆ దేశ ప్రధాని నొబుసుకె కిషి భారత్‌ పర్యటనకు వచ్చారు. ఆయనకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. 'నేను ఎంతో గౌరవించే జపాన్‌ ప్రధాని' అని ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఘటన కిషి మనసును తాకింది. ఆయన తన దేశానికి వెళ్లిన తరవాత మనవడికి భారత పర్యటన విశేషాలు, ఆత్మీయ ఆతిథ్యం గురించి వివరించారు. ఆ విషయాలు చిన్నారి మనసులో నాటుకు పోయాయి. 2006లో ఆ మనవడే జపాన్‌ ప్రధాని అయ్యారు. ఆయనే షింజో అబె.

50 ఏళ్ల తర్వాత భారత్​కు..

తాత పర్యటన జరిగిన 50 ఏళ్లకు ఆయన భారత్‌కు వచ్చారు. ఇక్కడి పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి 'రెండు సముద్రాల సంగమ' వ్యూహంపై ప్రసంగించారు. అప్పట్లో ఆ ప్రతిపాదన సంచలనమైంది. ఆయన ప్రస్తావించిన అంశమే 'ఇండో-పసిఫిక్‌ వ్యూహం'గా రూపాంతరం చెంది చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాను భారత్‌కు చేరువ చేసింది.

గట్టెక్కించిన ఆర్థిక విధానాలు

తాజాగా ఆగస్టు 28న షింజో అబె రాజీనామా చేశారు. దీనితో జపాన్‌లో ఓ శకం ముగిసినట్లైంది. ఆ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేత ఆయనే. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తికి రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. అబె 2006లోనే ప్రధాని అయినా పెద్దపేగు సమస్యతో ఏడాదికే రాజీనామా చేశారు. ఆయన తరవాత ఆరేళ్లలో ఆరుగురు ప్రధానులు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనం. దీనితో 2012లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏకధాటిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగారు.

అడుగడుగునా సవాళ్లు..

తాత స్థాపించిన 'లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ' నుంచి ఈ పదవి చేపట్టిన అబెకు అడుగడుగునా సవాళ్లే ఎదురయ్యాయి. 2012లో అధికారం చేపట్టేనాటికి జపాన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించింది. ఈ క్రమంలో అబె చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్‌ వృద్ధిరేటును పట్టాలెక్కించాయి. షింజో ఆర్థిక విధానాలు జపాన్‌లో 'అబెనామిక్స్‌'గా ప్రసిద్ధి చెందాయి.

ఇక ట్రంప్‌ అధికారం చేపట్టాక జపాన్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినకుండా కాపాడిన ఘనత కూడా అబెకు దక్కుతుంది. చైనా ముప్పును దాదాపు పుష్కరకాలం ముందే పసిగట్టి అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన బలమైన చతుర్భుజ కూటమికి 2007లోనే ప్రాణం పోశారు. రక్షణ వ్యూహాల్లో హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాలను కలిపి చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇదే భారత్‌-జపాన్‌ సంబంధాలకు మూలస్తంభంగా మారింది.

రికార్డు స్థాయి భారత పర్యటన..

షింజో అబె తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో నాలుగుసార్లు భారత్‌ను సందర్శించడం ఓ రికార్ఢు భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి జపాన్‌ ప్రధానిగా 2014లో గణుతికెక్కారు. మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కొనసాగించారు. భారత్‌-జపాన్‌ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయంగా మిగిలిపోతుంది.

2014లో మోదీ జపాన్‌ పర్యటన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను పటిష్ఠం చేసుకొనేలా ఓ అణు ఒప్పందానికి బీజం పడింది. 2016లో కుదిరిన ఒప్పందం 2017 నుంచి అమలులోకి వచ్చింది. భారత్‌లోని మౌలిక ప్రాజెక్టులకు జపాన్‌ భారీగా నిధులు సమకూర్చింది. తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ.88వేల కోట్లను నామమాత్రపు వడ్డీకి ఇచ్చింది. 2016లో భారత ప్రధాని జపాన్‌ పర్యటన సందర్భంగా 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 2018లో జరిగిన 13వ ఇండో-జపాన్‌ వార్షిక సదస్సులో ఏకంగా 32 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. భారత్‌లో ఏటా జపాన్‌ పెట్టే పెట్టుబడులు దాదాపు 350 కోట్ల డాలర్లకు చేరాయి.

చైనాకు భయపడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు వెనకడుగు వేస్తే- జపాన్‌ దాదాపు రూ.13వేల కోట్లను ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఏఏ ఆందోళనల కారణంగా గువాహటీలో షింజో అబె హాజరుకావాల్సిన '2019 ఇండో-జపాన్‌' వార్షిక సదస్సు వాయిదా పడటం వల్ల ఈ ప్రతిపాదనలు నిలిచాయి.

కొత్త ప్రధాని తీరుపై ఆసక్తి

ఈ నెలలో జరగాల్సిన ఇండో-జపాన్‌ వర్చువల్‌ సదస్సుకు ముందే అబె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సదస్సులో ఇరు దేశాల మధ్య పరస్పర నావికాదళ స్థావరాల వినియోగంపై ఒప్పందం కుదరాల్సి ఉంది. దీనివల్ల జబుతిలోని జపాన్‌ నావికాదళ స్థావరాన్ని భారత్‌ వాడుకుంటే, అండమాన్‌ స్థావరాలను జపాన్‌ వాడుకోవచ్ఛు.

సెప్టెంబర్‌ 15న జపాన్‌ ఎల్‌డీపీ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకోనుంది. ఈ రేసులో రక్షణ మంత్రి తారోకోనో, చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీ యషిహిది సుగా, ఆర్థిక మంత్రి తారోఆసో, మరో మంత్రి సిగెరు ఇసుబ, మాజీ మహిళా మంత్రి సికో నోదా వంటి దాదాపు అరడజనుకు పైగా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వచ్చినా భారత్‌తో అధికార ఎల్‌డీపీ వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్ఛు ముఖ్యంగా రక్షణ మంత్రి తారోకోనో వంటివారు ప్రధాని పదవి చేపడితే శంకాకు దీవుల విషయంలో చైనాతో కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

(రచయిత- పెద్దింటి ఫణికిరణ్‌)

ఇదీ చూడండి:మోదీజీ మాటలకు జపాన్‌ ప్రధాని ఫిదా

ABOUT THE AUTHOR

...view details