'మొత్తానికి ముఠానాయకుడు అంతమయ్యాడురా'..'అంతేలే అన్నా, ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు?'. 'అదేంట్రా అలాగనేశావ్... అధికారపక్షంలా మాట్లాడావ్?'
'పోయినవాడి గురించి మాట్లాడటానికి ఏ పక్షమైతే ఏంటన్నా?'.. 'అక్కడే ఉందిరా అసలు కిటుకంతా! తాను చేస్తే లౌక్యం, అదే ఎదుటివాళ్లు చేస్తే మోసం' అనడంలోనే ఎవరు ఏ పక్షమనేది తేలిపోతుంది.'
'కాస్త వివరంగా చెప్పన్నా'
'సరే విను. ముఠానాయకుడు దుబేను ఎవరు పెంచి పోషించారు, ఇన్నాళ్లూ ఎవరు వత్తాసు పలికారు, మొన్న పోలీసులపై కాల్పులు జరిపిన నాటినుంచి, నిన్న అంతమయ్యేవరకు ఎవరు ఆశ్రయమిచ్చారు?... ఇలా చట్టపరమైన, న్యాయపరమైన ప్రశ్నలు లేవనెత్తే వాళ్లందరూ ప్రతిపక్షంవాళ్లు పోలీసులను గాయపరచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే ఆత్మరక్షణార్థమే కాల్చాల్సి వచ్చిందనే వాళ్లందరూ అధికారపక్షం అన్నమాట. చనిపోయినవాడు దుబేనా, నయీమా లేక ఇంకొకరా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వాడు ఎవడైనా సరే, అధికారపక్షం ప్రతిపక్షాల వైఖరిలో ఎటువంటి మార్పూ ఉండదు... అర్థమవుతోందా?'
'అర్థం అయ్యీ కానట్లుగా ఉందన్నా...'
'అలనాటి భింద్రన్‌వాలే నుంచి వీరప్పన్ వరకు, నేటి నయీం నుంచి దుబే వరకు- ఎవరు అంతమైనాసరే ఇవే ప్రశ్నలు పునరావృతమవుతాయి. కాకపోతే అడిగేవాడు, వినేవాడు మారవచ్చేమో... అదొక్కటే తేడా! కానీ, ఇరుపక్షాలూ ఎవరి పాత్రపోషణ వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు. గీతలో కృష్ణుడు చెప్పినట్లు- కర్మ చెయ్యడం వరకే నీ వంతు... ఫలితం ఆశించకు అనే సూత్రాన్ని బాగా అవపోశన పట్టేశాయి మన రాజకీయ పార్టీలన్నీ! నేటి పరిస్థితుల్లో కృష్ణుడూ గీత అని అంటే అందరికీ నచ్చకపోవచ్చేమో! కొత్తతరం మేనేజిమెంటు పరిభాషలో దీన్నే ‘రోల్ ప్లే-పాత్రపోషణ’ అనే సమయోచితమైన, అందమైన పదబంధంతో చెబుతున్నారు. ‘ఎంతటి బంగారు పళ్ళెమైనా సరే, గోడ చేర్పు కావాలన్నట్లు’ ఈనాటి రాజకీయ పార్టీలన్నీ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్యాంపైన్ మేనేజర్లను, ప్రమోషన్ ఏజన్సీలను నియమించుకుంటున్నాయి. తమ తమ పార్టీల్లో ఎంత గొప్ప గొప్ప నాయకులు ఉన్నారనేదానితో సంబంధం లేకుండా ఈ తరహా ఈవెంట్ ఆర్గనైజర్లు, క్రైసిస్ మేనేజర్లు లేనిదే ఏ రాజకీయ పార్టీ కూడా నడవటం లేదు!'